Leading News Portal in Telugu

తెలంగాణ బీజేపీ రేకులు రాలిపోనున్నాయా? | big trouble in telangana bjp| dissidence| mlc| kavita| hicommand


posted on Sep 27, 2023 12:50PM

తెలంగాణ ఎన్నికల ముంగిట కమలం పార్టీకి అన్నీ అపశకునాలే ఎదురౌతున్నాయా? కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏం జరిగిందో అలాగే  తెలంగాణలో పరిస్థితులు కూడా ముందుగానే ప్రతికూలతను చూపిస్తున్నాయా అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీలో అసమ్మతి ఒక్కసారిగా భగ్గుమంది.

ఆ పార్టీకి చెందిన కీలక నేతలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఔను ఎన్నికల ముంగిట కర్నాటకలో కమలం రేకులు రాలిపోయాయి. సరిగ్గా తెలంగాణ ఎన్నికల ముంగిట కూడా అదే జరగనుందన్న సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. ఒక్క సారి కర్నాటక ఎన్నికల సమయంలో నామినేషన్ల దాఖలు గడువుకు ఒక్క రోజు ముందు వరకూ నాన్చి నాన్చి మరీ చివరి జాబితాలు బీజేపీ ఇలా ప్రకటించిందో లేదో అలా  పార్టీలో క్రమ శిక్షణ గేట్లు బద్దలైపోయాయి.   టికెట్ ఆశించి భంగపడిన నాయకులు ఒకరివెంట ఒకరు క్యూ కట్టి కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. నిజానికి టికెట్ల విషయంలో నిత్య పంచాయతీగా నిలిచే కాంగ్రెస్ మాత్రం కర్నాటక అసెంబ్లీ ఎన్నికల విషయంలో పంచాయతీలు దాదాపు లేకుండా టికెట్ల కేటాయింపు సజావుగా జరపగలిగింది. అదే సమయంలో క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే బీజేపీలో మాత్రం అసమ్మతి ఆరున్నొక్క రాగంతో బహిర్గతమైంది.  

ఇక ఇప్పుడు తెలంగాణ ఎన్నికల సమయంలో కూడా బీజేపీ కర్నాటక ఎన్నికల సమయంలో ఎదుర్కొన్న పరిస్థితులనే ఎదుర్కొంటున్నది. అయితే ఇక్కడ టికెట్ల కేటాయింపు వరకూ పరిస్థితి రాకుండానే.. పార్టీ అధిష్ఠానం తీరుపై అసమ్మతి, అసంతృప్తి భగ్గుమంటోంది. ఇందుకు ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో కవిత అరెస్టులో జాప్యం కారణమని చెప్పవచ్చు. హస్తిన మద్యం కుంభకోణంలో కవితపై ఆరోపణలు గుప్పించి, కేసీఆర్ కుటుంబ అవినీతిపై గట్టిగా గళమెత్తిన తెలంగాణ బీజేపీ నేతలకు ఈ విషయంలో అధిష్ఠానం తీరు మింగుడుపడటం లేదు. కవిత కేంద్రంగా హస్తిన మద్యం కుంభకోణంపై విమర్శలు గుప్పించిన  బీజేపీ రాష్ట్ర నాయకులకు ఇప్పుడు పార్టీ అధినాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కారణంగా   అస్థిత్వమే ప్రమాదంలో  పడిన పరిస్థితి ఎదురైంది.   

మద్యం కుంభకోణంలో ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సహా పలువురు అరెస్టు అయినప్పటికీ.. ఈ కుంభకోణంలో అందరి కంటే ఎక్కువగా లబ్ధి పొందారంటూ బీజేపీ విమర్శలు గుప్పించిన కవిత మాత్రం ఈడీ, సీబీఐ విచారణలను ఎదుర్కొన్నప్పటికీ అరెస్టును మాత్రం తప్పించుకోగలిగారు. ఇందుకు కేంద్రంలోని మోడీ సర్కార్ తీరే కారణమని బీజేపీ రాష్ట్ర నాయకులు పలువురు గట్టిగా నమ్ముతున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారమే తరువాయి అన్నట్లుగా హైప్ కు వెళ్లిన బీజేపీ ఆ తరువాత క్రమంగా బలహీనపడి ఇప్పుడు గెలుపు సంగతి తరువాత కనీసం గౌరవప్రదమైన స్థానాలైనా వస్తాయా రావా అన్నట్లుగా చతికిల పడింది. ఇందుకు మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కాకపోవడమే కారణమని బీజేపీ రాష్ట్ర నాయకులు పలువురు బహిరంగంగానే చెబుతున్నారు. అధిష్ఠానం వద్ద కూడా ఇదే విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు కూడా. అయినా బీజేపీ అధినాయకత్వం వైఖరిలో ఇసుమంతైనా మార్పు లేకపోవడంతో  బీజేపీలోని పలువురు తెలంగాణ నేతలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. జరుగుతున్న పరిణామాలు బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ కాంగ్రెస్ సహా పలువురు ఆరోపిస్తున్న నేపథ్యంలో పార్టీ అధిష్ఠానం తీరు వాటిని బలపరిచేవిధంగా ఉందన్న అసంతృప్తి నాయకులలో వ్యక్తం అవుతుంది.

కాగా ప్రస్తుతం పార్టీ హై కమాండ్ తీరు పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న నేతలంతా దాదాపుగా కేసీఆర్ సర్కార్ పై బీజేపీ బలంగా పోరాడుతుందని నమ్మి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారే కావడం, తమ నమ్మకాన్ని బీజేపీ హైకమాండ్ వమ్ము చేసిందని భావిస్తుండటంతో వారంతా కలిసి సమష్టిగా తన అసంతృప్తిని వ్యక్తం చేయడమే కాకుండా వచ్చే ఎన్నికలలో బీఆర్ఎస్ కు   గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్న కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు బీజేపీ తెలంగాణ నేతలు ఇటీవలి కాలంలో ఒకటికి రెండు సార్లు రహస్యంగా భేటీ అయ్యారు. 

 విజయశాంతి, డీకే అరుణ వంటి వారితో సహా వీరి సంఖ్య పదికి మించే ఉంటుందని పరిశీలకులు చెబుతున్నారు. సరిగ్గా కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ఆ రాష్ట్రంలో బీజేపీ ఇటువంటి పరిస్థితినే ఎదుర్కొంది. ఇప్పుడు తెలంగాణ ఎన్నికల ముంగిట కూడా అదే పరిస్థితిని రాష్ట్రంలో ఎదుర్కొంటున్నది. వచ్చే నెల మొదటి తేదీన ప్రధాని మోడీ తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ లో అధికారిక కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మహబూబ్ నగర్ లో జరిగే పార్టీ బహిరంగ సభలో ప్రసంగిస్తారు. అప్పటి వరకూ వేచి చూసి ఆ తరువాత రాష్ట్రంలోని బీజేపీ అసమ్మతి నేతలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే బీజేపీ అసంతృప్త నాయకులతో టీపీసీసీ చీఫ్ రేవంత్ టచ్ లో ఉన్నారని కూడా చెబుతున్నారు.