రాజకీయాలలో బ్రాహ్మణి ఎంట్రీ.. నిర్బంధాల నడుమ పుట్టుకొచ్చిన నవ నాయకురాలు! | nara brahmini a new leader evolved| tdp| babu| lokesh| balayya| people| cadre| courage| clarity
posted on Sep 27, 2023 9:49AM
అరెస్టులు, నిర్బంధాలతో తెలుగుదేశం దూకుడుకు కళ్లెం వేద్దామని చూస్తున్న జగన్ సర్కార్ కు కొత్త నాయకత్వం తెరమీదకు రావడం మింగుడు పడటం లేదు. అక్రమకేసు అయితేనేమి, నిలబడదని స్పష్టంగా తెలిస్తేనేమి.. ఏదో విధంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని అరెస్టు చేసేసిన జగన్ సర్కార్ ఇప్పుడు మరో విచిత్రమైన కేసులో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను అరెస్టు చేయాలని చూస్తోంది. ఈ ఇద్దరి అరెస్టుతో జనంలోకి బలంగా వెళ్లే నాయకులు లేకుండా చేయొచ్చనీ, తెలుగుదేశం ఎన్నికల ముందరు డీలా పడుతుందనీ ఆశించింది. అయితే చంద్రబాబు అరెస్టుకు రాష్ట్రంలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచంలో తెలుగువారు ఉన్న ప్రతి దేశంలో నిరసనలు వెల్లువెత్తడంతో కంగుతింది. ఇక నష్ట నివారణ ఎటూ సాధ్యం కాదు.. ఇదే ఒరవడిని కొనసాగించి నోరున్న నాయకులందర్నీ నిర్బంధించి.. ఏకపక్షంగా ఎన్నికలకు వెళ్లే వ్యూహానికి తెరతీసింది. అందులో భాగంగానే ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు అంటూ నారా లోకేష్ ను ఏ14గా చేర్చింది. ఇక ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తుతూ రోడ్లపైకి వస్తే అరెస్టులేనన్న సంకేతాన్ని ఇవ్వాలని ప్రయత్నిస్తున్నది. నాలుగేళ్లుగా ప్రభుత్వ వేధింపులను, దమనకాండను, అప్రజాస్వామిక విధానాలను గట్టిగా ఎదిరించి నిలబడిన తెలుగుదేశం పార్టీ అగ్ర నేతలను నిర్బంధిస్తే నీరుగారిపోతుందని ఆశిస్తున్నది.
అయితే తెలుగుదేశం పార్టీ నిర్బంధాలను ఎదరించి నిలబడే విషయంలో చాలా గట్టిగా ఉంది. ఎన్నికల సమయం దగ్గరపడేకొద్దీ జగన్ సర్కార్ నిర్బంధకాండనే నమ్ముకుంటుందని ముందుగానే ఊహించింది. అధినేత చంద్రబాబు తన అరెస్టును ముందుగానే ఊహించారు. ఆ విషయాన్ని బహిరంగంగా చెప్పి.. ఏదో అక్రమ కేసులో నన్ను అరెస్టు చేస్తారు. భయపడకుండా ఒకే సారి న్యాయపోరాటం, క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటాలకు సిద్ధంగా ఉండాలంటూ పార్టీ నేతలను, కేడర్ ను ముందుగానే సన్నద్ధం చేశారు. వరుస అరెస్టులతో భయానక వాతావరణం సృష్టించే వ్యూహంలో అధికార జగన్ పార్టీ ఉందని ఆయన నాయకులు, శ్రేణులను ముందుగానే హెచ్చరించారు. ప్రతి కార్యకర్తా ముందుండి పార్టీని నడిపించాల్సిన పరిస్థితి వచ్చినా ఆశ్చర్య పోనవసరం లేదన్నట్లుగా తెలుగుదేశం పార్టీని ఆయన సిద్ధం చేశారు.
ఇప్పుడు చంద్రబాబును స్కిల్ స్కాం అంటూ అడ్డగోలుగా అరెస్టు చేసినా తెలుగుదేశం పోరాట పటిమను ఇసుమంతైనా కోల్పోలేదు. యువగళం పాదయాత్రతో ప్రజాబాహుల్యం మన్ననలు అందుకుంటూ, అశేష ప్రజాభిమానంతో ముందుకు సాగుతున్న పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను నిర్బంధించేందుకు అధికార వైసీపీ రంగం సిద్ధం చేసిన తరుణంలో మరో యువ నాయకురాలు ముందుకు వచ్చారు. ఆమే నారా బ్రాహ్మణి. తెలుగుదేశం అగ్రనేతలను ఆధారాలు లేని కేసుల్లో జైల్లో పెట్టి.. వారికి బెయిలు రాకుండా వ్యవస్థలను మేజేన్ చేస్తున్నా పార్టీలో ధైర్యం, స్థైర్యం ఇసుమంతైనా సడలదని బ్రాహ్మణి విస్ఫష్టంగా చాటారు. నారా బ్రాహ్మణి వైఫ్ ఆఫ్ నారా లోకేష్, డాటర్ ఇన్ లా ఆఫ్ చంద్రబాబు అండ్ డాటర్ ఆఫ్ బాలయ్య. నారా, నందమూరి కుటుంబాల వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న నారా బ్రాహ్మణి తొలి మీడియా సమావేశంలోనే సూటిగా సుత్తి లేకుండా జగన్ రెడ్డి సర్కార్ ఆగడాలను ఎండగట్టారు.
తడబాటు, తొట్రుపాటు లేకుండా మీడియా ముందు పార్టీ పోరాట పటిమను ఆవిష్కరించారు. మీడియా సమావేశంతోనే సరిపెట్టకుండా ప్రజా సమస్యలపైనా, ప్రభుత్వ దమనకాండపైనా ఘాటు విమర్శలతో సామాజిక మాధ్యమం వేదికగా ప్రజలలో చైతన్యం రగులుస్తున్నారు. అంగన్వాడి మహిళలు, టీడీపీ మహిళా నేత పరిటాల సునీత పై పోలీసుల తీరును గర్హించారు. ఆంధ్రప్రదేశ్ లో శాంతియుతంగా జరుగుతున్న ర్యాలీల్లో ప్రభుత్వ ప్రేరేపిత హింస షాక్ కు గురి చేసిందంటూ ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయమని అడిగిన అంగన్వాడి కార్మికులపై పోలీసు దాడులు దుర్మార్గం, అప్రజాస్వామికం అని విమర్శించారు.. న్యాయం కోసం మహిళా నేతలు శాంతియుతంగా ప్రజాస్వామ్య బద్దంగా పోరాడుతూంటే.. వారిపై దాడులకు పాల్పడటం శోచనీయమంటూ బ్రాహ్మణి సోషల్ మీడియా ద్వారా చేసిన వ్యాఖ్యలు, విమర్శలు ప్రజలను కదిలిస్తున్నాయి. నారా బ్రాహ్మణి పార్టీ సమావేశాలలో పాల్గొంటున్నారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ ఆయనకు సంఘీభావం తెలిపేందుకు వస్తున్న నేతలతో చర్చిస్తున్నారు. ఆ చర్చలలో బ్రాహ్మణి పరిణితి చూసి నేతలే విస్తుపోతున్నారు. జనసేన నేతలతోనూ చర్చలు జరుపుతున్నారు. అటు ఐటీ ఉద్యోగులనూ కలుస్తున్నారు.
నిత్యం పార్టీ వ్యవహారాలపై చర్చలు జరుపుతున్నారు, సమాలోచనలు చేస్తున్నారు. ఒక వేళ లోకేష్ ను ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసినా పార్టీ కేడర్ లో స్థైర్యం చెదరకుండా, ధైర్యం సడల కుండా నేనున్నానంటూ భరోసా ఇస్తున్నారు. క్రమశిక్షణ, స్థిర చిత్తం, ప్రజలలో కదలిక తీసుకురాగలిగే వాగ్ధాటితో బ్రాహ్మణి తెలుగుదేశం శ్రేణులలోనే కాదు, చంద్రబాబు అక్రమ అరెస్టును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేస్తున్న జనాలకు కూడా ధైర్యాన్నీ స్థైర్యాన్నీ ఇస్తున్నారు.
ఇప్పటి వరకూ ఆమె కుటుంబ వ్యాపారం చూసుకుంటున్నారు. అయితే సంక్షోభ సమయంలో తెలుగుదేశం పార్టీకి ఆమె ఒక నాయకురాలిగా ఆవిర్భవించారు. ఇప్పటి వరకూ రాజకీయాల ఊసే ఎత్తని నారా బ్రహ్మణి ధైర్యంగా నేనున్నానంటూ ముందుకు వచ్చారు. భర్తను అరెస్టు చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో.. అక్రమాలను, అన్యాయాలను సహించబోమంటూ.. పార్టీని నడిపించేందుకు తాను జనంలోకి వస్తానంటూ ముందుకు వచ్చారు. ఒక్క మీడియా సమావేశంతో ఆమె రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో అందరి దృష్టినీ తన వైపునకు తిప్పుకున్నారు. మీడియా ప్రతినిథుల ప్రశ్నలకు నదురూబెదురూ లేకుండా ఆమె ఇచ్చిన సమాధానాలు అందరికీ ఆకట్టుకున్నాయి. స్పష్టమైన అవగాహనతో జగన్ సర్కార్ తీరును ఎండగట్టిన తీరు బ్రాహ్మణిలోని నాయకత్వ పటిమను ఎత్తి చూపింది. తెలుగుదేశం అధినేత చంద్రబాబును అరెస్టు చేయడంలోని ఔచిత్యాన్ని ఆమె ప్రశ్నించిన తీరు ఆమెలోని నాయకత్వ లక్షణాలను బహిర్గతం చేశాయి. ఇంత కాలం హెరిటేజ్ వ్యవహారాలు చూసుకునే యువ వ్యాపార వేత్తగా మాత్రమే అందరికీ తెలిసిన బ్రాహ్మణి.. రాజమహేంద్రవరంలో మీడియా ఎదుట స్కిల్ స్కామ్ పేరుతో జగన్ సర్కార్ ఎంత అడ్డగోలుగా, ఎంత అప్రజాస్వామికంగా తన మామ, పార్టీ అధినేత చంద్రబాబును అరెస్టు చేసిందో వివరించిన తీరు.. పొలిటికల్ గా ఆమె పరిణితికి అద్దం పట్టాయి. మొత్తం మీద నారా బ్రాహ్మణి నందమూరి, నారా కుటుంబాల నుంచి వచ్చిన మరో సమర్ధవంతమైన, ప్రతిభామంతమైన నాయకురాలిగా జనం మనస్సుల్లో చెరగని ముద్ర వేసుకున్నారనడంలో సందేహం లేదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు.