Leading News Portal in Telugu

తుగ్లక్, హిట్లర్, గోబెల్స్‌కు ప్రతిరూపం జగన్ ? | jagan a replica of hitler| tuglak| gobels| constitution| arrest| democracy


posted on Sep 28, 2023 1:00PM

ఏది సత్యం, ఏది అసత్యం, ఏది న్యాయం, ఏది అన్యాయం అనే అంశాలను ప్రజలు గుర్తించాల్సి వుంది. మరోసారి అధికారంలోకి రావడం కోసం చంద్రబాబుని అవినీతిపరుడుగా చిత్రించేందుకు ఏటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి.. అన్యాయంగా  జైలులో పెట్టించి..  చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు జనాన్ని బురిడీ కొట్టించాలని చూస్తున్న దగా నాయకుడి చరిత్ర ప్రజలు తప్పక తెలుసుకోవాలి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఆర్ధిక ఉగ్రవాదానికి పాల్పడిన ఆర్ధిక నేరస్థుడు ఎటువంటి నేరానికి పాల్పడని మచ్చలేని నాయకుడిపై అవినీతి ఆరోపణలు చెయ్యడం సిగ్గు చేటు. గాలి మంద గాలి ఆరోపణలు చేస్తున్నారు. ప్రపంచం నివ్వెర పోయే స్థాయిలో అవినీతికి పాల్పడి, ఏ స్థాయిలో కూడా నీతికి, నిజాయితీకి విలువ లేకుండా చేసి తెలుగువారంటే అంతా మోసం, దగా అన్న భావన ప్రపంచానికి కల్పించిన జగన్ రెడ్డి.. చంద్రబాబుని అవినీతి పరుడుగా చిత్రించడం చూసి ప్రపంచ వ్యాప్తంగా ప్రజానీకం ఛీ  కొడుతున్నారు. రెండవ సారి అధికారంలోకి రావడం కోసం ఆధారాలు లేని కేసులు పెట్టి చంద్రబాబును అవినీతి పరుడు గా చిత్రించడానికి పడరాని పాట్లు పడుతున్నారు. అవినీతి అంటూ చంద్రబాబుపై జగన్ గ్యాంగ్ చేస్తున్న రాద్దాంతం అంతా కూడా రాజకీయ దురుద్దేశంతోనే తప్ప మరొకటి మాత్రం కాదు. ఏ విధంగా అయినా ప్రజల్ని మభ్యపెట్టి రాజకీయ ప్రయోజనం పొందటానికేనని అర్ధమవుతుంది. 

ఒక పక్క రాష్ట్ర ప్రజల ముందు దోషిగా నిలబడి కూడా అవినీతి గురించి సుద్దులు చెప్పడం అంటే అంతకన్నా మోసం మరోకటి లేదు. వైఎస్ఆర్ హయాంలో అంతా ప్రజల కోసమేనంటూ నిష్టగా సాగిన అవినీతి యజ్ఞంలో కొల్లగొట్టబడిన ప్రజాధనాన్ని నిగ్గు తేల్చడానికి దర్యాప్తు సంస్థలు ఎంతగా శ్రమ పడ్డాయో రాష్ట్ర ప్రజలే కాదు దేశ ప్రజలంతా సైతం చూశారు. రూ.43 వేల కోట్లు ప్రభుత్వ ఖజానాకు ఏకంగా పెద్ద బొర్రే పెట్టినట్లు సిబిఐ తేల్చి 17 ఛార్జి షీట్లు వేసింది. అన్నీ ఛార్జిషీట్లలోను వైయస్ జగన్‌ని మొదటి ముద్దాయిగా తేల్చింది. తండ్రి అధికారానికి అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాలరాసి, రాష్ట్రాన్ని మాఫియా మయం చేసి లక్ష కోట్ల ప్రజాధనం దిగమింగిన ఘనుడీ జగన్ రెడ్డి. జగన్ ఆర్ధిక నేరాలు పలు దేశాలకు సైతం విస్తరించాయని న్యాయస్థానాలు సైతం నివ్వెరపోయాయి. అవినీతిపరులను దీప స్తంభాలకు ఉరి తీయాలని తీవ్రంగా స్పందించిన సుప్రీం కోర్టు చట్టబద్దంగా అలా ఆదేశించే వీలు లేకపోయిందంటూ కొన్నేళ్ళ క్రితం బాధ పడింది, అలాగే చైనా జాతీయుడిగా వైయస్ జగన్ ఇంత దోపిడీకి పాల్పడి వుంటే అక్కడ అతనికి నిర్ధాక్షిణ్యంగా మరణ శిక్ష అమలు జరిగేది. ప్రపంచంలో మరే ఇతర ప్రజాస్వామ్య దేశాల్లో అయితే జగన్ బతుకు శంకరగిరి మాన్యాలు పట్టి వుండేది. అయినా జగత్ కిలాడి అయిన జగన్ రెడ్డి తానే నిజాయితీ పరుడుగా అమాయక జనం చెవిలో పూలు పెడుతున్నాడు. 

గతంలో ముంబయిని వణికించిన మాఫియా శక్తుల్లో అరుణ్ గావ్లీ ఒకడు. తరువాత అరుణ్ గావ్లీ 1997లో అఖిల భారతీయ సేన పేరిట ఓ రాజకీయ పార్టీ స్థాపించి 2004 లో మహారాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. అయితే అతడి పాపం పండి నేడు జైల్లో వున్నాడు. సమాజానికి చీడ పురుగుల్లాంటి అరుణ్ గావ్లికి, జగన్ గ్యాంగ్‌కి ఎందులోనూ తేడా లేదు. తండ్రి వైఎస్ఆర్ ముఖ్యమంత్రి కాక ముందు ఇల్లు అమ్ముకోవాల్సిన పరిస్థితి వుందని మొర పెట్టుకున్న కుటుంబం,  కర్నాటకలో 22.5 మెగావాట్ల చిన్న సెకండ్ హ్యాండ్ విద్యుత్ ప్లాంట్ 1998లో ఎవరి దగ్గరో కొని 2004 వరకు దాంతో కుస్తీలు పడుతున్న పుత్రరత్నం దశ  అయిదేళ్లలో తిరిగి వేల కోట్ల రూపాయల విలువ చేసే బహుముఖ వ్యాపార సామ్రాజ్యం విస్తరించిందంటే అది అంతా రాష్ట్రాన్ని ఏడాపెడా దోచిన దురాగతం కాదా? జగన్ బొక్కింది గాలికి పోయే పేలాల పిండి కాదని, ప్రజలకు దక్కాల్సిన వేల కోట్ల ప్రజాధనమని జగన్ గ్యాంగ్ గుర్తించాలి,  జలయజ్ఞం, గనులు, సెజ్‌లు, కారిడార్లు, పోర్టులు, నాలెడ్జ్ హబ్‌లు, లేపాక్షి, ఒడిస్సీ, ఎకనామిక్ సిటీలు, రస్ అల్ ఖైమా, ఎమ్మార్..  ఇలా రాజావారి కన్ను పడ్డ ప్రతిదీ కుంభకోణమే. ఏమీ జరగని స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏదో జరిగిపోయిందని తన ముందుకు వస్తే నోరు పట్టే వారిని, వెనక్కి వస్తే దోచేళ్లు పట్టేవారిని ఊరూరు పంపించించి ప్రెస్ మీట్లు పెట్టించి చంద్రబాబు అవినీతికి పాల్పడినట్లు ప్రచారం చేయిస్తున్నాడు. 

తన తండ్రి వైఎస్ఆర్ వివిధ రూపాల్లో అవినీతి యజ్ఞాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సత్ పరిపాలనా సూత్రాలను, రాజ్యాంగ యత్రాంగాలను కాల రాసిన భ్రష్ట చరిత్ర వైఎస్‌ఆర్‌ది. జగన్ దాచింది అంతా జనాన్ని దోచిందే. రాష్ట్ర సర్వతొ ముఖాభివృద్దికి దోహద పడాల్సిన వనరులతో హవాలా నడిపి లెక్కలేనన్ని బినామీ కంపెనీలతో చట్టం కళ్ళు కప్పి నేర పూరిత కుట్రలకు పాల్పడిన జగన్ నేడు పత్తిత్తు మాటలు చెబుతున్నారు. రాజకీయ డ్రామాలు రక్తి కట్టించడంలో జగన్ అభినవ నటుడు ,ఆయన జగన్నాటకం ముందు పగటి వేషం అనేక కళారూపం వెనకబడి పోయింది. ఎంతగా నటిస్తే అంతగా రాజకీయం పండుతుందని జగన్ ఆశ. ప్రజల్ని ఏదో విధంగా మోసం చెయ్యడమే ఆయన లక్ష్యం. చట్ట బద్ద పద్దతుల్లో, ప్రజ్ఞా పాటవాలతో ఎవరు ఎదిగినా.. ఎవరికి అభ్యంతరం ఉండదు. ఎల్లవేళలా రాష్ట్ర  ప్రయోజనాలను కాపాడాల్సిన ముఖ్యమంత్రి ఎల్లలెరుగని కుంభకోణాలతో జన ఖజానాకు చెందాల్సిన సమస్తాన్ని తన కుటుంభానికి దోచిపెట్టిన తీరు నభూతో… అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రజాదనం దోపిడి తప్ప ప్రజాసేవ అంటే ఏమిటో తెలియని జగన్…  జనం కోసమే పుట్టినట్టు జగన్నాటకాలు ఆడుతున్నాడు. 

అక్రమంగా తన తండ్రి తవ్విపోసిన మంది సొమ్ముతో వ్యాపార సామ్రాజ్యం నిర్మించుకొని నీతులు చెప్పడం సిగ్గు చేటు. నాలుగేళ్ల క్రితం వరకు ప్రతి శుక్రవారం కోర్టు బోనులో నిబడిన పెద్దమనిషి, ఆస్తులు జప్తు చేయించుకున్న జగన్ రెడ్డి.. చంద్రబాబు అవినీతి పరుడుని  ప్రజలను నమ్మించడానికి ఎన్నో..ఎన్నేన్నో అవస్థలు పడుతున్నారు. ముస్సోలినీ, సద్దాం హుసేన్, ఇడీ అమీన్, హిట్లర్ ఆలోచనల ప్రతి రూపమే వైయస్ జగన్ అని చెప్పాలి. అధికార గర్వంతో, లెక్కలేని తనంతో, రాక్షస పాలన సాగిస్తున్నారు. అహంకారులకు గర్వపోతులకు ప్రజల చేతిలో శృంగభంగం తప్పదు. ప్రజాస్వామ్యంలో పాలకులను ప్రశ్నించే, విమర్శించే హక్కు ప్రతిపక్షానికి, పౌరులకు రాజ్యాంగం కల్పించింది.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆర్టికల్ 19ని అడ్డుకొనే చట్టమే లేదు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీలు, ప్రజాసంఘాలు శాంతి యుతంగా ధర్నాలు, నిరసనలు, ర్యాలీలు, సభలు, రోడ్‌షోలు నిర్వహించరాదంటూ అనుమతి నిరాకరించడం దుర్మార్గపు చర్య. జగన్‌ పరిపాలనలో ప్రజాస్వామ్యానికి  పెడరెక్కలు విరిచే వికృతం విశ్వరూపం దాల్చింది. రాష్ట్రంలో ప్రతిపక్షాలు నిరసనలు, దర్నాలు, దీక్షలు నిర్వహించే హక్కు కూడా లేకపోతే ఇది ప్రజా స్వామ్యమా? జగన్ స్వామ్యమా?  రాష్ట్రం ఏమన్నా జగన్ జాగీర్ అనుకొంటున్నారా? జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి 144  సెక్షన్, 30 యాక్టు నిరంతరం అమలు చేస్తూనే వున్నారు. తానూ ప్రతి పక్షంలో వున్నప్పుడు అనేక  రోజులు రోడ్లపై పాద యాత్రలు, దీక్షలు చేశారు? ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వం అడ్డుకొంటే జగన్ రెడ్డి పాద యాత్ర  చేసే వారా? స్వాతంత్రోద్యమంలో కానీ, 1975 నాటి ఎమర్జెన్సీలో కానీ ఇలాంటి పరిస్థితులు చూడలేదని, ఏపీలో నయా ఎమర్జెన్సీ పరిస్థితులు ఉన్నాయని, ఎమర్జెన్సీ పరిస్థితులను కళ్లారా చూసిన పెద్దలు చెబుతున్నారు. ఇందిరాగాంధీ  ఎమర్జెన్సీ విధించినా, పౌర హక్కులను కాలరాసినా ప్రజలు  రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపినా  పోరాటాలు ఆగలేదు. కానీ ఇప్పుడు ఊరూరా పోలీసులే. హౌస్‌ అరె‌స్టులు చేస్తూ ఇళ్లనే జైళ్లుగా మార్చేస్తున్నారు. రాజకీయ కక్షతో చంద్రబాబును జైల్లో పెట్టడం అంటే  రాష్ట్రంలో ఎంత దారుణ పరిస్థితులు ఉన్నాయో అర్ధం అవుతుంది. రాజకీయ ప్రత్యర్థులతో పాటు సామాన్యులనూ వేధిస్తున్నారు. లాఠీ చార్జీ చేయడం, నాన్‌ బెయిలబుల్‌ కేసులు పెట్టడం వంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారు. జగన్‌ ఏలుబడిలో జగన్ రెడ్డి  రాజ్యాంగం అమలవుతోంది. ఐపీసీ కాదు. వైసీపీ చట్టం అమలవుతోంది. స్వతంత్ర భారత చరిత్రలో ఎమర్జెన్సీలో మాత్రమే రాజ్యాంగం ప్రసాదించిన పౌర హక్కులు హరించాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీకి మించిన అణచివేత కొనసాగుతోంది. రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్,తెలంగాణ సరిహద్దుల్లో పాకిస్థాన్‌ బోర్డర్‌ను తలపించే విధంగా వందల మంది పోలీసులను, పారా మిలటరీ బలగాలను మోహరింప చేయడం దారుణం. అక్రమ కేసులో అరెస్టు అయిన చంద్రబాబు కుటుంబానికి  మద్దతు తెలిపేందుకు హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి బయలుదేరిన ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీని అడ్డుకోవడానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం సర్వ శక్తులు ఒడ్డింది. అడుగడుగునా అడ్డంకులు సృష్టించింది. తెలంగాణ నుంచి వచ్చే ప్రతి వాహనాన్ని పోలీసులు క్షుణ్నంగా తనిఖీలు చేశారు. ఎక్కడిక్కడ కార్లను ఆపేసి, రోడ్డు పక్కకు నిలిపేశారు. ఎక్కడికి వెళ్తున్నారు? ఎందుకు వెళ్తున్నారు? అంటూ ప్రశ్నలు సంధించి మరీ వేధించారు. అయినా హైదరాబాద్‌లో పని చేస్తున్న ఐటీ ఉద్యోగులు పట్టువదలని విక్రమార్కుల్లా అడ్డంకులు ఛేదించుకొని రాజమండ్రికి చేరుకొని నారా బ్రాహ్మణిని కలసి తమ మద్దతు తెలిపారు. 

 

జగన్ ప్రభుత్వం ఘోరంగా వ్యవహరిస్తుంది. ప్రతిపక్షానికి వస్తున్న ప్రజాధరణ చూసి ఓర్వలేక, అక్కసుతో, దుర్భుద్దితో చంద్రబాబు అరెస్ట్‌కు ప్రతిగా జరుగుతోన్న నిరసనలు, దర్నాలు, దీక్షలు, ర్యాలీలను అడ్డుకొంటున్నది. ప్రతిపక్షాల స్వేచ్చకు గోరీ కట్టే  నిరంకుశ ధోరణికి సమాధి కట్టకపోతే ప్రజాస్వామ్యం  మనుగడ సాగించదు. స్వార్ధంతో ఎంతటి నీచ చర్యకైనా వెనకాడని విపరీత మనస్తత్వం గల జగన్ రెడ్డి రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాల రాస్తున్నారు. రాజ్యాంగ బద్ధంగా పాలన సాగిస్తామని ప్రమాణం చేసి అధికార పీఠం అధిష్టించిన జగన్ రెడ్డి ఆ ప్రమాణాన్ని పాతాళంలో పాతరేశారు. జగన్ ఫాసిస్ట్ క్రూర మనస్తత్వానికి అధికారం తోడు కావడంతో.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రజాస్వామ్యం మంటకలిసి పోతుంది. ప్రభుత్వం మాదే, వ్యవస్థలు మావే, మేము చేసిందే చట్టం, మేము చేసేదే పరిపాలన అన్న విధంగా వ్యవహరిస్తున్నారు. తమ ప్రభుత్వానికి ఎవ్వరూ ఎదురు రాకూడదని, తమకు అందరూ భయపడాలని నిరంకుశంతో, నిర్భందాలతో పాలన సాగిస్తున్నారు. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దానిని ఎవ్వరు అతిక్రమించరాదని . సభలు, సమావేశాలు, ప్రదర్శనలు జరిపే హక్కు రాజకీయ పక్షాలకు ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పాలకులు నిరంకుశంగా, నా ప్రభుత్వం నా ఇష్టం అన్న విధంగా వ్యవహరిస్తుంటే ప్రజలు, ప్రతిపక్షం మాత్రం చట్టాలను, జీవోలను ఎందుకు గౌరవించాలి?  

రాజ్యాంగ అధినేతగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాల పై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలి. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాజ్యాంగానికి అనుగుణంగా రాష్ట్రంలో పాలన లేనప్పుడు తక్షణ చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత గవర్నర్‌దే. రాష్ట్రంలో పరిణామాలను గవర్నర్ ఉపేక్షించ రాదు. ప్రజాస్వామ్యాన్ని చెల్లని కాసుగా మార్చిన ఘనత ఈ జగన్ ప్రభుత్వానిదే. అఖిల భారత సర్వీస్ అధికారులు సర్వీసులో చేరే ముందు రాజ్యాంగాన్ని,  చట్టాలను కాపాడతామని ప్రమాణం చేస్తారు. కానీ నేడు ప్రజా ప్రయోజనాలను, రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షిస్తూ రాజ్యాంగ నిబంధనలు పాటించాల్సిన అవసరాన్ని ఐ ఏ ఎస్,ఐపిఎస్ అధికారులు  గుర్తించకపోవడం బాధాకరం. 

ఏ ప్రభుత్వం శాశ్వతం కాదు. ప్రభుత్వాలు ఐదేళ్లకొక సారి మారుతోంటాయి. వీరు మాత్రం 60 ఏళ్ళు పదవుల్లో కొనసాగుతారు. అఖిల భారత సర్వీసు అధికారులకు రాజ్యాoగ నిర్మాతలు కల్పించిన హక్కులు, అధికారాలు సామాన్యమైనవి కావు. కానీ చట్టానికి,రాజ్యాంగానికి వ్యతిరేకంగా బాధ్యత లేకుండా పనిచేస్తూ వ్యక్తి గుర్తింపు కోసం, ప్రమోషన్లకు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బ తీస్తూ అధికార పార్టీకి ఊడిగం చేస్తున్నారు. శాంతియుత ప్రదర్శనలకు సభలకు, ర్యాలీలకు అనుమ్మతులు నిరాకరించడం, ముందస్తు అరెస్ట్‌లకు పాల్పడటం, గృహ నిర్బంధాలు వంటి నిరంకుశ చర్యలతో పాలన సాగిస్తున్నారు. అధికార పార్టీ దన్నుతో పోలీసులు అత్యంత పాశవికంగా ప్రవర్తిస్తున్నారు. జగన్ రెడ్డి అహంకారంతో, ప్యూడలిస్ట్ స్వభావంతో పరిపాలన సాగిస్తున్నారు.

ఇప్పటికే జగన్ ప్రభుత్వ, వేధింపులు, సాధింపులు, నియంతృత్వంపై జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతున్నది. ఇప్పటికైనా పోలీసులు అధికార పార్టీకి అడుగులకు మడుగులోత్తుతూ ప్రజల, ప్రతిపక్షాల హక్కులను హరించడం మంచిది కాదని గుర్తించాలి. రాష్ట్రంలో పోలీసులు నేరం చేసిన వారిని కాపాడుతున్నారు. భాదితుల పక్షాన నిలుస్తున్న ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ప్రజలకు విధేయులుగా వుండాల్సిన పోలీసు వ్యవస్థ పాలకులకు విధేయులుగా వున్నామని నిరూపించుకోవడానికి పోలీసు వ్యవస్థ అంతులేని ఆరాటాన్ని ప్రదర్శిస్తున్నది. ప్రజల తిరుగుబాటుతో ప్రపంచ చరిత్రలో ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపొయారు. జగనొక లెక్క కాదు. ప్రజలు ఇప్పటి వరకు సహనంతో  వున్నారు. ఇంక ప్రజలు సహించే పరిస్థితి లేదు. ప్రజల చేతిలో ఓటమి శిక్షకు జగన్ గ్యాంగ్ అంతా సిద్ధంగా ఉండాలి. ప్రజాస్వామ్య పెడరెక్కలు విరిచే ధోరణిని అరికట్టాలి. ఏది ఏమైనా రాష్ట్రంలో ఒక హిట్లర్, ఒక తుగ్లక్, ఒక గోబెల్స్‌లకు ప్రతిరూపంగా అయిన పరిపాలన సాగుతుందని,ప్రజలు,ప్రజాస్వామ్య వాదులు అంటున్నారు. 


నీరుకొండ ప్రసాద్

9849625610