Leading News Portal in Telugu

ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?.. వైసీపీ కొత్త నినాదం | why ap need jagan| ycp| new| slogan| troll| social| media| anathor| gadapa


posted on Sep 28, 2023 6:39PM

 ఏంటో పాపం ఎన్ని పేర్లు మార్చినా ఏపీలో వైసీపీకి సౌండ్ పెరగడం లేదు. గడప గడపకి వైసీపీ, జగనే మా నమ్మకం, వైనాట్ 175 ఇలా ఎన్నో కార్యక్రమాలు రూపకల్పన చేసి ప్రజలపై రుద్దాలని చూశారు. కానీ, ప్రజలు వాటిని  పట్టించుకోలేదు. గడప గడపకి కార్యక్రమంలో అయితే ఇళ్లకు వెళ్లిన వైసీపీ నేతలకు, ఎమ్మెల్యేలకు ప్రజలు చుక్కలు చూపించారు. మంత్రులు అని కూడా చూడకుండా ఏం సాధించారని నిలదీశారు. నాలుగేళ్ళ మీ పాలనలో నరకం చూశామంటూ మొహాల మీదనే తిట్టిపోశారు. ఆ దెబ్బతో చాలా మంది నేతలు మొహం చాటేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధిష్టానం ఏమో ఏదోకటి నచ్చ జెప్పండి.. ఒక్కో కుటుంబానికి ఎంత ఇచ్చామో లెక్కలు చెప్పి ప్రజలను మచ్చిక చేసుకోండి అంటూ ఆదేశించినా.. ప్రజల వద్దకు వెళ్లిన నేతల పప్పులు ఉడకనేలేదు. ఇంతిచ్చామని వైసీపీ నేతలు లెక్కలు చెప్తే.. గత ప్రభుత్వం ఏం చేసిందో గణాంకాలతో సహా చూపిస్తూ జనం వైసీపీ నేతలను కడిగి పారేశారు.  ఎన్ని పథకాలు తెచ్చినా.. ఎన్ని కార్యక్రమాలు చేసినా.. చేశామని చెప్పుకుంటున్నా ప్రజలలో వ్యతిరేకతే తప్ప సానుకూలత ఇసుమంతైనా కనిపించకపోవడంతో  వైసీపీ వ్యూహకర్తలు కొత్త కొత్త పథకాలకు రూపకల్పన చేస్తున్నారు. అలా ఇప్పుడు వైసీపీ నుండి వచ్చిన మరో పథకమే ‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి?’. తాజాగా తాడేపల్లిలో నిర్వహించిన వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్ ఛార్జులు, ఎమ్మెల్సీలతో జరిగిన కార్యక్రమంలో సీఎం జగన్ స్వయంగా ఈ కార్యక్రమాన్ని ప్రకటించారు. ఐప్యాక్ సహ వ్యవస్థాపకుడు రిషిరాజ్ ఈ కార్యక్రమంపై ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. త్వరలో చేపట్టే ఈ కార్యక్రమానికి సంబంధించిన వివరాలను వెల్లడించిన రిషిరాజ్.. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో నిర్వహిస్తామని చెప్పారు. సీఎం జగన్ కూడా ఈ కార్యక్రమంపై పలు వివరాల్ని వెల్లడించగా.. ఈ కార్యక్రమం ద్వారా నాలుగేళ్ళ వైసీపీ పాలనలో ప్రజలకు కలిగిన ప్రయోజనాలను వివరిస్తూ.. ఇదే ప్రయోజనాలు కొనసాగాలంటే మళ్ళీ జగనే కావాలని ప్రజలకు నమ్మకం కలిగించాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో వాలంటీర్లు, జగనన్నగృహ సారథులను భాగస్వాములుగా చేసుకుంటూ గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకూ వైసీపీ నేతలంతా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించాలని జగన్ ఆదేశించారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నవంబరులో గడప గడపకు ప్రోగ్రాం ముగించనున్నట్లు చెప్పిన వ్యూహకర్తలు.. తర్వాత ఎన్నికల ప్రత్యేక కార్యాచరణ ప్రకటిస్తామని.. అందుకు పునాది  ‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’? కార్యక్రమం ఉంటుందని చెప్పారని అంటున్నారు.  నవంబరు నుండి కొత్త కొత్త కార్యక్రమాలతో నేతలంతా నిత్యం ప్రజల మధ్యనే ఉండేలా ఐప్యాక్ ప్రణాళికలు రచిస్తున్నట్లు తాడేపల్లిలో జరిగిన కార్యక్రమంలో నేతలకు చెప్పిన జగన్.. ఇక నుండి ఎన్నికల వరకూ నిత్యం ప్రజలతో మమేకమయ్యేందుకు ప్రతి ఒక్కరూ సంసిద్ధంగా ఉండాలని కోరారని చెబుతున్నారు.

కాగా, వైసీపీ కొత్త కార్యక్రమంపై ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు రాజకీయ వర్గాలలో ట్రోల్స్ మొదలయ్యాయి. ‘ఎందుకు ఆంధ్రాకి జగనే కావాలి’ అంటూ వైసీపీ కార్యక్రమం రూపొందిస్తుంటే ప్రత్యర్ధులు ‘ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో’ వివరిస్తూ పోస్టులు పెడుతున్నారు. వైసీపీ పరిపాలన మొదలు పెట్టిన రోజులలో కరకట్టపై ఉన్న ప్రజా వేదిక కూల్చివేత నుండి రంగుల కోసం వృధా చేసిన ప్రజా ధనం, అన్న క్యాంటీన్ల మూసివేత, మద్యం ధరలు పెంచి చేసిన ప్రజా దోపిడీ, ఇసుక కోసం ప్రజలు పడిన,పడుతున్న పాట్లు, రాష్ట్రంలో కొరవడిన ఉపాధి, కరోనా సమయంలో ప్రభుత్వ వైఫల్యాలు, వైన్ షాప్ ల వద్ద టీచర్ల కాపలా, మాస్కులు అడిగిన వైద్య సిబ్బందిపై దాడులు, ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించిన వారిపై పెట్టిన కేసులు, ఎమ్మెల్యేలు.. మంత్రుల బూతు పురాణాలు, అసెంబ్లీలో వైసీపీ నేతలు వేసిన వెకిలి వేషాలు, రాష్ట్రంలో  గుంతల మయంగా మారిన రోడ్లు, మూడు రాజధానుల పేరిట రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన కుట్రలు, అటకెక్కిన పోలవరం నిర్మాణం, సీపీఎస్ రద్దు పేరిట ఉద్యోగులకు చేసిన మోసం, జాబ్ క్యాలండర్ విడుదల చేస్తామని నిరుద్యోగులను నిలువునా ముంచిన తీరు ఇలా అన్నిటినీ వివరిస్తూ ఎందుకు ఆంధ్రాకి జగన్ వద్దో ఆ పోస్టులలో సవివరంగా పెడుతూ వైసీపీ గాలి తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో   వైసీపీకి ఈ కొత్త నినాదం ఏమేరకు పనికి వస్తుందో చూడాలి. ఇది కూడా మరో గడపగడపకూ కార్యక్రమంలాగే అభాసుపాలు కావడం తథ్యమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.