జనంలోకి లోకేష్.. అరెస్ట్ కు సర్కార్ కుట్ర? | lokesh to start padayatra| jagan| sarkar| arrest| protests| anti| incumbency| government
posted on Sep 28, 2023 6:17PM
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తిరిగి యువగళం పాదయాత్ర ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఇప్పటికే ప్రకటించారు. లోకేష్ సైతం టీడీపీ నేతలతో టెలి కాన్ఫరెన్స్ లో కూడా ఇదే విషయం చెప్పారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ రోజున యువగళం పాదయాత్ర ఎక్కడ ఆగిందో ఇప్పుడు తిరిగి అక్కడ నుంచే ప్రారంభం కానుంది. అయితే, లోకేష్ పాదయాత్ర మొదలు పెట్టక ముందే అరెస్ట్ చేసేందుకు కుట్ర జరుగుతున్నదని రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతున్నది. చంద్రబాబు అక్రమ అరెస్టు తర్వాత లోకేష్ ఢిల్లీ వెళ్లిన సంగతి తెలిసిందే. చంద్రబాబు అక్రమ అరెస్టుపై దేశవ్యాప్తంగా చర్చకు తెరతీసి, జగన్ సర్కార్ కక్షపూరిత చర్యలను ఎండగడుతూ మద్దతు కూడగట్టే పనిలో ఉన్న లోకేష్ త్వరలోనే రాష్ట్రానికి వచ్చి యువగళం పాదయాత్ర పునఃప్రారంభించనున్నారు.
అయితే, జగన్ ప్రభుత్వం లోకేష్ ను కూడా అరెస్టు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఫైబర్ నెట్ ప్రాజెక్టులో అవినీతి జరిగిందని కేసులు పెట్టి లోకేష్ పేరుని చేర్చిన ఏపీ సీఐడీ అధికారులు తాజాగా అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను ఏ14గా చేర్చారు. అంతే కాదు ఏసీబీ కోర్టులో సీఐడీ అధికారులు దీని మీద పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఆయనతో పాటు అప్పటి మంత్రి నారాయణపై కూడా సీఐడీ కేసు నమోదు చేసింది. అయితే ఈ కేసులో నారాయణ ఇప్పటికే యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చుకున్నారు. కాగా, లోకేష్ పాదయాత్రను పున:ప్రారంభించాలని చూస్తున్న నేపథ్యంలో యాత్ర ప్రారంభించకుండానే అరెస్టు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయని వార్తలు వస్తున్నాయి. లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ఇప్పుడు టీడీపీలో మరో హడావిడి మొదలైంది.
ఇప్పటికే చంద్రబాబు జైలులో ఉన్న సంగతి తెలిసిందే. మరోవైపు లోకేష్ కూడా అరెస్ట్ అయితే ఏపీ రాజకీయాలు మరింత హీట్ ఎక్కడం ఖాయం. ఇప్పటికే చంద్రబాబు అక్రమ అరెస్టును ప్రతీకార చర్యగా పరిశీలకులు తేల్చేశారు. ప్రజలు కూడా దీనిపై అనేక రకాలుగా చర్చలు సాగిస్తున్నారు. ప్రస్తుతం ఏపీలో పరిస్థితులు, సీఐడీ కేసుల విచారణ చూస్తున్న సామాన్య ప్రజలు ప్రభుత్వం చేతిలో వ్యవస్థలు పావులుగా మారడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ అరెస్టు చేస్తే కక్ష పూరితంగానే ప్రభుత్వం ఈ కుట్రలకు తెగబడుతుందని ప్రజలు నిర్ధారణకు వచ్చేస్తారు. ఇప్పటికే జగన్ సర్కార్ పై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జనం, తెలుగుదేశం శ్రేణులు లోకేష్ అరెస్టు అవుతారనే ప్రచారం నేపథ్యంలో భారీ ఎత్తున నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టుపై ఎక్కడికక్కడ దీక్షలు చేపడుతూ నిరసనలు తెలుపుతున్న తెలుగు తమ్ముళ్లు లోకేష్ అరెస్టుతో ఎలాంటి నిర్ణయాలకు దిగుతారన్నది అంచనా వేయడం కూడా కష్టమే.
ఇప్పటికే ఒకవైపు చంద్రబాబు అరెస్టుతో వస్తున్న రాజకీయ పరిణామాలను గమనిస్తున్న వైసీపీ.. లోకేష్ అరెస్ట్ కి కూడా ప్రయత్నిస్తున్నదంటే టీడీపీకి వస్తున్న సానుభూతి ఎన్నికలలో తనను ఏమీ చేయలేదని భావిస్తున్నట్లు కనిపిస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే చంద్రబాబు, లోకేష్ అరెస్టుతో టీడీపీని దెబ్బకొట్టి ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనలో ఉన్నటు భావిస్తున్నారు. అధినాయకత్వాన్ని దెబ్బకొట్టి క్యాడర్ లో నిరాశను పెంచి తాను లబ్ది పొందే కుట్రలో భాగమే ఈ అరెస్టులని విశ్లేషిస్తున్నారు. అయితే, ఈ అరెస్టులు.. ప్రభుత్వ నిర్ణయాలు రోజురోజుకూ ప్రజలలో అసంతృప్తి, అగ్రహాలను పెంచుతున్నాయి. ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలలోనే ఈ అసంతృప్తి ఎక్కువగా కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుపై నిరసన కార్యక్రమాలను అడ్డుకొనేందుకు ప్రభుత్వం పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నా బలహీన వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి నిరసన దీక్షలు చేపడుతున్నారు. జగన్ ప్రభుత్వ కక్షపూరిత నిర్ణయాలపై ప్రజలలో చర్చ జరిగేలా చేస్తున్నారు. ఇప్పుడు లోకేష్ ను కూడా అరెస్ట్ చేస్తే ప్రభుత్వంపై వ్యతిరేకత నషాళానికి ఎక్కడం ఖాయంగా కనిపిస్తుంది.