కాలం చెల్లిన రూ.2000 నోటు!.. ఖాతాలలో డిపాజిట్ కు ఇక ఒక్క రోజే గడువు | no value for 2000 note| last| date| deposite| modi
posted on Sep 29, 2023 9:29AM
రెండు వేల రూపాయల నోట్ల చెలామణికి శుక్రవారంతో గడువు ముగియనుంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2016 నవంబర్ 18న రెండు వేల రూపాయల నోటును ప్రవేశపెట్టింది. అప్పట్లో అవినీతి, నల్లధనం, నకిలీ కరెన్సీని అరికట్టేందుకు మోడీ సర్కార్ పెద్ద నోట్లను రద్దు చేసింది. అప్పటికి చెలామణిలో ఉన్న 500, 1000 రూపాయల నోట్లను రద్దు చేసింది.
కొత్తగా 500 రూపాయలు, రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టింది. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను ప్రవేశ పెట్టి ఈ ఏడాది నవంబర్ 18కి ఏడేళ్లు పూర్తి అవుతుంది. అయితే పెద్ద నోట్ల రద్దు అంటూ మళ్లీ పెద్ద నోటు రెండువేల రూపాయలను ప్రవేశ పెట్టడంపై అప్పట్లోనే విమర్శలు వెల్లువెత్తాయి. అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు కూడా పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని స్వాగతిస్తూనే.. రెండు వేల రూపాయల నోటును ప్రవేశ పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.
సరే అది పక్కన పెడితే రెండు వేల రూపాయల నోటు ప్రవేశ పెట్టిన లక్ష్యం నెరవేరిందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాటి చెలామణిని రద్దు చేసింది. వాటిని ఖాతాలలో జమ చేసుకోవడానికి చివరి గడువుగా సెప్టెంబర్ 30ని నిర్ణయించింది. దీంతో ఇక శుక్రవారం (సెప్టెంబర్ 2 నుంచి రెండు వేల రూపాయల నోటకు కాలం చెల్లినట్లే.
ఇప్పటికీ ఇంకా ఎవరి వద్దనైనా రెండు వేల రూపాయల నోటు భద్రంగా ఉండి ఉంటే దానికి తమ ఖాతాలలో జమ చేసుకోవడానికి తుది గడువుకు ఇక ఒక్క రోజే ఉందన్నమాట. ఆ తరువాత ఎంత భద్రంగా దాచుకున్నా రెండు వేల రూపాయల నోటు విలువలేని రంగుకాగితం మాత్రమే అవుతుంది.