Leading News Portal in Telugu

కాంగ్రెస్ లో మళ్లీ చేరికలలొల్లి.. రేవంత్ ది ఓవరేక్షన్ అంటూ సీనియర్ల విమర్శలు | jonings dispute in congress again| reventh| seniors| mynampally| son| tickets| medak


posted on Sep 29, 2023 12:30PM

తెలంగాణ కాంగ్రెస్ లో మళ్లీ  చేరికల లొల్లి మొదలైంది. పార్టీ అధిష్ఠానం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేసే పనిలో తలమునకలై ఉన్న వేళ.. పార్టీలో చేరికలు రాష్ట్ర పార్టీలో విభేదాలకు కారణమౌతున్నాయి. ముఖ్యంగా తెరాస హైకమాండ్ తో విభేదించి.. ఆ పార్టీకి రాజీనామా చేసి మైనంపల్లి హనుమంతరావు కాంగ్రెస్ లో చేరడంతో మళ్లీ రాష్ట్ర పార్టీలో సీనియర్లు అలకపాన్పు ఎక్కారు. మైనంపల్లి పార్టీలో చేరకముందే తనకూ, తన కుమారుడికీ టికెట్ కన్ఫర్మ్ చేయించుకున్నారనీ, ఆ తరువాతే ఆయన హస్తిన వెళ్లి పార్టీ కండువా కప్పుకున్నారనీ చెబుతున్నారు.

ఈ విషయంలోనే తెలంగాణ కాంగ్రెస్ సీనియర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు  ఇంత కాలం పార్టీని నమ్ముకుని సేవలందించిన వారిని కాదని, కొత్త వారిని అందలం ఎక్కిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా మైనంపల్లిని స్వయంగా హస్తినకు తోడ్కొని పోయి మరీ మల్లిఖార్జున్ ఖర్గే సమక్షంలో పార్టీలో చేర్పించిన విధానాన్ని సీనియర్లు తప్పుపడుతున్నారు.  కేవలం మూడు రోజుల వ్యవధిలో మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడికి టికెట్ కన్ఫర్మ్ హామీనీ, పార్టీలో వారి చేరికనూ పూర్తి చేయడంలో రేవంత్ రెడ్డి తన స్థాయిని మించిన చొరవ చూపారని సీనియర్లు విమర్శలు గుప్పించారు.  

రేవంత్ రెడ్డి తీరు ఉదయ్ పూర్ డిక్లరేషన్ ను తుంగలో తొక్కే విధంగా ఉందన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. ఉదయ్ పూర్ డిక్లరేషన్ ప్రకారం ఒకే కుటుంబంలో రెండు టికెట్లు ఇవ్వడానికి వీలుపడదు. కానీ ఇందుకు మినహాయింపుగా ఐదేళ్లూ పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారి విషయంలో కన్సిడరేషన్ ఉంటుంది. అంతే కానీ ఎన్నికల ముందు పార్టీలోకి వచ్చి చేరేవారికి ఆ మినహాయింపు వర్తించే అవకాశం లేదు.  అంటే ఎట్టి  పరిస్థితుల్లోనూ మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు మైనంపల్లి రాహుల్ లలో ఒకరికి మాత్రమే టికెట్ రావలి. కానీ రేవంత్  తన పలుకుబడి ఉపయోగించి మైనంపల్లి, ఆయన కుమారుడు ఇద్దరికీ వచ్చే ఎన్నికలలో పోటీ చేయడానికి వీలుగా టికెట్లు ఇప్పించారని సీనియర్లు అంటున్నారు.   మైనంపల్లి కుటుంబానికి మెదక్, మల్కాజిగిరి టికెట్లు కేటాయించినట్లే తమ కుటుంబాలకు చెందిన వ్యక్తులకూ ఇవ్వాలని ఢిల్లీ హైకమాండ్ పై రాష్ట్ర పార్టీ సీనియర్లు ఒత్తిడి తేవాలని నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తున్నది.  

ఇప్పటికే ఒకే కుటుంబం నుంచి రెండు టికెట్ల కోసం అప్లై చేసుకున్న కీలక నేతల్లో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మల్ రెడ్డి రంగారెడ్డి తదితర ఫ్యామిలీలు ఉన్నాయి. వీళ్ల కుటుంబాల నుంచి రెండు టికెట్లు కోరుతూ ఇప్పటికే దరఖాస్తు కూడా చేశారు. అయితే వీరి విషయంలో స్క్రీనింగ్ కమిటీ ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. 

అయినా అసలు తెలంగాణ కాంగ్రెస్ అంటేనే గ్రూపు విభేదాలకూ, అసమ్మతికి పెట్టింది పేరు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డికి పగ్గాలు అప్పగించిన తొలి నాళ్లలో కాంగ్రెస్ లో విభేదాల సంస్కృతి పీక్స్ కు చేరింది. కాంగ్రెస్ సీనియర్లంతా తమ విభేదాలను పక్కన పెట్టి రేవంత్ కు వ్యతిరేకంగా ఒక్కటయ్యారు. ఓ దశలో రేవంత్ కూడా విసిగిపోయి పార్టీకి రాజీనామా చేయాలన్న ఆలోచన కూడా చేసినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అయితే హై కమాండ్ రేవంత్ కు మద్దతుగా గట్టిగా నిలబడటం.. అదే సమయంలో కర్నాటక అసెంబ్లీ ఎన్నికలలో హస్తం హవా చూపడంతో  సీనియర్లు దిగి వచ్చారు. అన్నిటికీ మించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం అందుకునే ఆశలు సజీవంగా ఉండటానికి కారణం పీసీసీ పగ్గాలు చేపట్టిన అనంతరం అందరినీ సమన్వయ పరచుకుంటూ రేవంత్ రెడ్డి చేసిన కృషే కారణమని చెప్పాల్సి ఉంటుంది.

వరుస పరాజయాలతో డీలా పడిన కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపి వారిని రాజకీయ పోరాటానికి సమాయత్తం చేయడంలో లోకేష్ పాత్రను ఎవరైనా సరే తక్కువ చేసి చూపే అవకాశం లేదు. అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించడాన్ని బహిరంగంగా వ్యతిరేకించినా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి, ఆ పార్టీ ద్వారా వచ్చిన శాసనసభ సభ్యత్వానికీ రాజీనామా చేసి మునుగోడు ఉప ఎన్నికకు కారణమైనా హై కమాండ్ పట్టించుకోలేదు. కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి తరచుగా అసమ్మతి రాగం ఆలపించి హైకమాండ్ పై ఒత్తిడి తేవడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు సరికదా? ఒక దశలో ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవడానికి కూడా కాంగ్రెస్ హై కమాండ్ వెనుకాడలేదు.  రాష్ట్రంలో అధికారం కోసం అందరూ రేవంత్ నాయకత్వంలో సమష్టిగా కృషి చేసి తీరాల్సిందేనన్న విస్పష్ట సంకేతాలను ఇచ్చింది. అంతే కాకుండా కాంగ్రెస్ కీలక నేత ప్రియాంక గాంధీ స్వయంగా తెలంగాణ పార్టీ వ్యవహారాలన పర్యవేక్షిస్తుండటంతో ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ లో గతంలో ఎన్నడూ కనిపించని ఐక్యత ప్రస్ఫేటంగా కనిపించింది. ఆల్ ఈజ్ వెల్ అనుకుంటున్న ఈ తరుణంలో కాంగ్రెస్ కప్పులో మైనంపాటి తుపాను చెలరేగింది. ఇలా పార్టీలోకి చేరి అలా రెండు టికెట్లను మైనంపాటి తన్నుకుపోవడాన్ని, అందుకు రేవంత్ దగ్గరుండి మరీ లైన్ క్లియర్ చేయడాన్నీ పార్టీ సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నట్లుగా కనిపిస్తున్నది.