షిక్కటి చిరునవ్వుల మర్మమేంటి?..ష్ గప్ చుప్! | what is the mystery behind jagan smile| adani| tadepalli| palace| babu| arrest
posted on Sep 29, 2023 10:25AM
ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెదవుల మీద చిరు నవ్వు చెరగదు. కానీ, ఆ చిరు నవ్వుల వెనక, ఏమి దాగుంది? అ నవ్వుల మర్మం ఏమిటి అనేది కొద్ది మందికి తప్ప అందరికీ అర్ధమయ్యే విషయం కాదు. ఈ మాటలు అంటున్నది ఎవరో కాదు ఆయన రక్త సంబంధీకులు, బంధు వర్గమే. జగన్ చిరునవ్వుల వెనక ఎలాంటి కుట్రలు, కుయుక్తులు పురుడు పోసుకుంటున్నాయో గుర్తించ లేమని అంటారు. అది బాబాయ్ మర్డరే, అయినా, తల్లీ చెల్లిని ఆర్థికంగా, రాజకీయంగా సైలెంట్ గా దెబ్బ తీయడమే అయినా జగన్ రెడ్డి తన చేతికి మరకలు అంటకుండా నవ్వుతూనే కానిచ్చేశారని చెబుతున్నారు.
అలాగే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో వీస్తున్న చంద్రబాబు ప్రభంజనాన్ని ఎదుర్కునేందుకు జగన్ రెడ్డి మరో మారు సైలెంట్ స్ట్రాటజీ అమలు చేస్తున్నారని రాజకీయ వర్గాలు సైతం అనుమానిస్తున్నాయి. అందులో భాగంగానే చిరునవ్వులు చిందిస్తూనే, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షడు,ఆంధ్ర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని ప్రజలలో తిరగకుండా చేసేందుకు జగన్ రెడ్డి కుట్రలకు తెర తీశారని అంటున్నారు. ఆ కుట్రలో భాగంగానే చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగిందని, అలాగే, ఆయన్ని జైలుకే పరిమితం చేసే కుట్రలు జరుగుతున్నాయని అంటున్నారు.
అదలా ఉంచితే ఓ వంక చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా రాష్ట్రం మొత్తం అట్టుడికి పోతుంటే, మరో వంక జగన్ రెడ్డి ఇటు అసెంబ్లీలో అటు ప్యాలెస్ లో గుట్టు చప్పుడు కాకుండా, గప్ చుప్’గా తమ పొలిటికల్ అండ్ పర్సనల్ అజెండాలను ముందుకు తీసుకుపోతున్నారని అంటున్నారు.
ముందుగా అసెంబ్లీ తంతు విషయానికి వస్తే సమావేశాలు మొదలైన రోజునే పొమ్మన కుండా పొగ పెట్టి తెలుగు దేశం సభ్యులను బయటకు పంపి అడ్డు తొలగించుకున్నారు. ఇక అక్కడి నుంచి, సభ్యత, సంస్కారం, సభా మర్యాదలను పక్కన పెట్టి, చంద్రబాబు సహా సభలో లేని సమాధానం చెప్పుకునే అవకాశం లేని సభ్యులను ఉద్దేశించి ఇష్టారీతిన ఆరోపణలు చేశారు. సభలో లేనివారిపై ఆరోపణలు కూడదన్న సభా నియమాలను పూర్తిగా తుంగలోకి తొక్కారు. జగనన్న మెప్పు కోసం మంత్రి రోజా, మరి కొందరు జగన్ ను ఇద్రుడు చంద్రుడు అని ఆకాశానికి ఎత్తేశారు. జబర్దస్త్’ రోజుల నుంచీ రోజాకు అది అలవాటైన విద్యే అనుకోండి. సరే అది పక్కన పెడితే..
ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లోనే జగన్ రెడ్డి గప్ చుప్ గా గుట్టు చప్పుడు కాకుండా ఉద్యోగుల మెడకు ఉచ్చు బిగించారు. అసెంబ్లీ సమావేశాల ఆఖరి రోజున ఆమోదించిన జీపీఎస్ బిల్లులో 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించ వచ్చనే నిబంధన వచ్చి చేరింది, అంటే, వయసుతో సంబంధం లేకుండా 33 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉద్యోగులను మెడ పట్టి బయటకు గెంటే విధంగా కంపల్సరీ రిటైర్మెంట్ క్లాజును తీసుకొచ్చింది. నిజమే, సెంట్రల్ సివిల్ సర్వీస్ పెన్షన్ నిబంధనలతోపాటు రివైజ్డ్ స్టేట్ పెన్షన్ రూల్స్-1980లోని 44వ నిబంధన ప్రకారం… ఉద్యోగులకు 33 ఏళ్ల సర్వీసు పూర్తయితే పదవీ విరమణ ప్రకటించవచ్చు,
అయితే ఇంత కాలం కేవలం కాగితాల్లో మాత్రమే ఉన్న నిబంధనను తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే విషయంలో నానా యాగీ చేసిన జగన్ రెడ్డి ఇప్పడు గుట్టు చప్పుడు కాకుండా, జీపీఎస్ బిల్లులో చేర్చారు. నిజానికి అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తామని మాటిచ్చి ఇప్పడు జీపిఎస్ బిల్లు తీసుకురావడమే ఇచ్చిన హామీని వెనక్కి తీసుకోవడం. అలాంటిది, అందుకు అదనంగా ఇప్పడు .. వయసుతో పనిలేకుండా ఉద్యోగుల మెడ మీడకు సర్వీసు కత్తిని తెచ్చారు.
మరో వంక ఎవరికీ తెలియకుండా ఎవరికీ చెప్ప కుండా ఛార్టర్డ్ ఫ్లైట్ లో దిగిన వివాదస్పద పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీకి జగన్ రెడ్డి ప్రభుత్వం రాచమర్యాదలు చేసింది. ఎలాంటి అధికారిక హోదాలేని ఆయనకు… పోలీసు ఎస్కార్ట్ ఏర్పాటు చేసింది. తాడేపల్లి ప్యాలెస్ ఆయనకు విందు ఏర్పాటు చేసింది. సుమారు రెండుగంటలకు పైగాన అయన ప్యాలెస్ లో ఉన్నారు. ఏ అధికార హోదా లేని ఒక వ్యాపార వేత్తకు ప్రభుత్వం రాచ లాంఛనాలతో స్వాగతం పలకడం ఏమిటి? ఆయనతో ఏమి చర్చించారు? దీపం ఉండగానే ఇల్లు చక్కపెట్టుకునే ఉద్దేశంతో అధికారంలో ఉండగానే, ఆదానీకి మరిన్ని మేళ్ళు చేసేందుకు జగన్ రెడ్డి సిద్డమయ్యారా? అనే సందేహాలు పరిశీలకుల్లో వ్యక్త మవుతున్నాయి.
చంద్రబాబు అరెస్ట్ తరువాత రాష్ట్రం, దేశం మొత్తం అదే విషయంపై దృష్టిని కేద్రీకరించిన సమయంలో చోటు చేసుకుంటున్న పరిణామాలను గమనిస్తే జగన్ రెడ్డి, రాష్ట్రాన్ని మింగేసే పెద్ద స్కెచ్ ఏదో వేసినట్లే అనుమానించ వలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. అవును ఐదు రోజుల అసెంబ్లీ సమావేశాల్లో సభా నాయకుడు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి నవ్వులు చిందించారు కానీ పెదవి విప్పలేదు ఒక్క మాట మాట్లాడ లేదు. అందుకే ఈ చిరు నవ్వుల మర్మమేమీ, అనే ప్రశ్న ప్రముఖంగా వినిపిస్తోంది ? అదే ఇప్పడు రాష్ట్రం ముందున్న పెద్ద ప్రశ్న.