చంద్రబాబు స్వ్యాష్ పిటిషన్ పై నేడు సుప్రీంలో విచారణ | babu quash petition hearing in supreme court today| ludhra| apcid| skill
posted on Oct 3, 2023 7:33AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కిల్ కేసులో తన అరెస్ట్ అక్రమమంటూ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై మంగళవారం (సెప్టెంబర్3) విచారణ జరగనుంది. జస్టిస్ అనిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ ముందు ఈ కేసు విచారణకు రానుంది. ఈ కేసులో తమ వాదనలు వినకుండా తీర్పు వెలువరించవద్దంటూ ఏపీ సర్కార్ ఇప్పటికే కేవియెట్ దాఖలు చేసింది.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఏపీ సీఐడీ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన వెంటనే తన అరెస్ట్ అక్రమమని కొట్టివేయాలని కోరుతూ ఏసీబీ కోర్టులో చంద్రబాబు తరపున సిద్ధార్ధ్ లూథ్రా వాదనలు విన్పించారు. అయితే సుదీర్ఘంగా సాగిన వాదనల అనంతరం ఏసీబీ కోర్టు కేసు కొట్టివేసి రిమాండ్ విధించింది. ఆ తరువాత చంద్రబాబు తరపున న్యాయవాదులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏపీ హైకోర్టులో సిద్ధార్థ్ లూధ్రాతో పాటు హరీష్ సాల్వే కూడా వాదనలు విన్పించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదించారు. ఏపీ హైకోర్టు కూడా క్వాష్ పిటీషన్ డిస్మిస్ చేయడంతో చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
వాస్తవానికి సుప్రీంకోర్టులో గత బుధవారమే జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్ ధర్మాసనంలో విచారణ జరగాల్సి ఉండగా జస్టిస్ భట్టి నాట్ బిఫోర్ మి అంటూ విచారణ నుంచి తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది. కేసు అత్యవసర పరిస్థితి దృష్టిలో ఉంచుకుని త్వరగా విచారణ చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులు సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ బెంచ్ ముందు ప్రస్తావించారు. ఇరువర్గాల వాదనల అనంతరం సుప్రీంకోర్టు సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ కేసు విచారణను మంగళవారం(అక్టోబర్ 3)కు వాయిదా వేశారు. ఈ కేసు విచారణను జస్టిస్ నిరుథ్ బోస్, జస్టిస్ బేలా త్రివేది బెంచ్ విచారించనుంది.