Leading News Portal in Telugu

తెలుగుదేశం జనసేన కూటమి క్లీన్ స్వీప్ పక్కా.. బీజేపీని కలుపుకుంటే మాత్రం బొక్కబోర్లా! | sri atma sakshi survey says tdp win sure| alliance| janasena| sweep| add| bjp


posted on Oct 3, 2023 3:18PM

ఏపీలో వచ్చే ఎన్నికలలో  తెలుగుదేశం, జనసేన కూటమి విజయం పక్కా అని ఆత్మసాక్షి సర్వే నిర్ద్వంద్వంగా తేల్చేసింది శ్రీ ఆత్మసాక్షి సర్వే. చంద్రబాబు అరెస్టు తరువాత ఈ సెప్టెంబర్ 30 వరకూ నిర్వహించిన ఈ సర్వేలో  తెలుగుదేశం, జనసేన పొత్తు వచ్చే ఎన్నికలలో ప్రభంజనం లాంటి విజయాన్ని అందిస్తుందనీ, అదే ఈ కూటమి బీజేపీని కూడా కలుపుకుంటే మాత్రం బొక్క బోర్లా పడుతుందనీ తేల్చింది. అంతే కాదు ఒంటరిగా పోటీ చేసినా తెలుగుదేశం విజయం ఖాయమని, అయితే బీజేపీతో జతకడితే మాత్రం తీవ్రంగా నష్టపోక తప్పదని పేర్కొంది.

 తెలుగుదేశం,జనసేన పొత్తుగా ఎన్నికలు వెడితే ప్రస్తుతం  జగన్ కేబినెట్ లో ఉన్న మంత్రులలో 17 మంది పరాజయం పాలు కావడం తథ్యమని పేర్కొంది.  ఇప్పటి వరకూ శ్రీ ఆత్మసాక్షి సర్వే మూడు విడతలు గా సర్వే నిర్వహించింది. విడత విడతకూ తెలుగుదేశం పుంజుకుంటున్నదని సర్వే  ఫలితం తేల్చింది. చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో జనం తెలుగుదేశం పార్టీకి మరింత దగ్గరయ్యారని సర్వే పేర్కొంది.  వైసీపీపై ప్రజా వ్యతిరేకత పెరిగి పరిస్థితులన్నీ తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతున్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది.  2019 ఎన్నికలలో వైసీపీ ఘన విజయం సాధించి  151 స్థానాలను తన ఖాతాలో వేసుకోగా, అప్పట్లో తెలుగుదేశం 23 స్థానాలకే పరిమితమైన సంగతి తెలిసిందే.  అప్పటి ఎన్నికలలో మొత్తం పోలైన ఓట్లలో 50 శాతం ఓట్లు వైసీపీ ఖాతాలో పడ్డాయి. అయితే జగన్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన తొలి ఆరు నెలలలోనూ ప్రజలలో అసంతృప్తికి బీజం పడింది. ప్రజా వేదిక కూల్చివేతతో మొదలైన జగన్ విధ్వంస పాలనపై ప్రజాగ్రహం రోజు రోజుకూ పెరుగుతూ వస్తోంది.  

రెండేళ్ల కిందట ఇదే ఆత్మసాక్షి సర్వే తెలుగుదేశం కు వైసీపీ కంటే నాలుగు శాతం ఓట్లు అదనంగా వస్తాయని పేర్కొనగా తాజా సర్వేలో  తెలుగుదుశం, జనసేన కూటమికి 54% ఓట్లు ఖాయమనీ, వైసీపీ 43 శాతానికి పరిమితం అవుతుందనీ పేర్కొంది. అంటే వైసీపీ కంటే తెలుగుదేశం,జనసేన కూటమి 11% అధిక ఓట్లతో అధికారం చేపట్టడ తథ్యమని పేర్కొంది. ఇందులో తెలుగుదేశం ఓట్ల షేర్ 44 శాతం ఓట్లు, జనసేన షేర్10 శాతం ఓట్లు అని పేర్కొంది.  రానున్న రోజులలో తెలుగుదేశం, జనసేనకు ఓటింగ్ శాతం గణనీయంగా  పెరిగే పరిస్థితులు ఉన్నాయని అంచనా వేసింది.  చంద్రబాబు అరెస్టుతో సానుభూతి పెరిగిందని.. చంద్రబాబు అరెస్ట్, జనసేనతో పొత్తు ప్రకటన తర్వాత ప్రజల ఆదరణ పెరిగినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు అరెస్ట్ టీడీపీకి ప్లస్ అయి జగన్ సర్కార్ పై ప్రజా వ్యతిరేకత మరింత పెరిగిందన్నారు. ఇదే క్రమంలో జనసేన పార్టీ టీడీపీతో జతకట్టడంతో రాజకీయ సమీకరణలు పూర్తిగా మారిపోయాయని శ్రీఆత్మసాక్షి సర్వే వివరించింది. 

కాగా, బీజేపీని కూడా తమతో చేర్చుకుంటే మాత్రం టీడీపీ, జనసేన కూటమి భారీగా నష్టపోతుందని శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. బీజేపీతో  కాకుండా లెప్ట్ పార్టీలతో జతకడితే తెలుగుదేశం,జనసేన కూటమి మంచి ఫలితాలు సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయని పేర్కొంది.  తెలుగుదేశం, జనసేన, లెప్ట్ పార్టీలు కలిసి ఎన్నికలకు వెడితే 120కి పైగా స్థానాలను గెలుచుకునే అవకాశాలు ఉన్నాయని సర్వే గణాంక సహితంగా వెల్లడించింది. సామాజిక వర్గాలు, పేద, మధ్యతరగతి ప్రజలను విభజించి మూడు శాంపిల్స్ రూపంలో సర్వే నిర్వహించినట్లు వివరించింది.  ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాలతో పాటు నిరుద్యోగులు వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నట్లు పేర్కొంది. అటు అర్బన్ ఓటర్ల నుండి గ్రామీణ ఓటర్ల వరకూ ఎటు చూసినా వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తున్నట్లు ఈ సర్వేలో తేల్చారు. మొత్తంగా వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం ఘన విజయం సాధించి అధికారం చేపట్టడం పక్కా అని సర్వే ఫలితం తేల్చింది.