చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనలో తారకరత్న భార్య | alekhya reddy in agitation against babu arrest| tarakaratna| wife
posted on Oct 5, 2023 10:03AM
తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి అరెస్ట్‌పై నందమూరి తారక రత్న భార్య అలేఖ్య రెడ్డి స్పందించారు. నారా చంద్రబాబు నాయుడికి ఆయన కుటుంబానికి తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆమె స్పష్టం చేశారు. చంద్రబాబు నాయుడు జైలు నుంచి బయటకు వచ్చే వరకు తమ కుటుంబం పోరాడుతూనే ఉంటుందన్నారు. అలాగే నందమూరి తారకరత్న, అలేఖ్య రెడ్డిల కుమార్తె నిషిక సైతం తనదైన శైలిలో స్పందించారు. తన తాతగారు చంద్రబాబు నాయుడికి లక్షలాది మంది మద్దతు తెలుపుతున్నారని.. అలాగే తాను సైతం తన తాత గారికి మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. తన తండ్రి తారక రత్న తుది శ్వాస విడిచే వరకు తెలుగుదేశంలోనే ఉన్నారని… తెలంగాణలో ఆయన పార్టీ ప్రచారం నిర్వహించారని ఈ సందర్భంగా నిషిక గుర్తు చేసుకున్నారు.
చంద్రబాబు అరెస్ట్ అక్రమమని, ఆయనకు న్యాయం జరగాలంటూ హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్లో ఇటీవల ఆందోళన చేపట్టారు. ఇందులో నందమూరి, నారా ఫ్యామిలీతోపాటు పార్టీ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ ఆందోళనలో నందమూరి తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి, కుమార్తె నిషిక పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆలేఖ్య రెడ్డి మాట్లాడుతూ.. తన భర్త నందమూరి తారకరత్న జీవించి ఉంటే.. ఆయన సైతం ఈ దీక్షలో పాల్గొనే వారని అన్నారు.
తారకరత్న కుటుంబాన్ని బాగా ప్రేమించే వారని… అలాగే ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ , పార్టీ ప్రచారం, పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే వారని.. టీడీపీకి ఆయన మద్దతు ఎల్లప్పుడు ఉండేదని ఈ సందర్బంగా ఆమె పేర్కొన్నారు. తాత ఎన్టీఆర్ గారితోపాటు చంద్రబాబు నాయుడు గారిలో కష్టపడి పని చేసే తత్వాన్ని తారకరత్న బాగా ఇష్టపడేవారని… ఆ క్రమంలో చంద్రబాబు నాయుడు బాటను తన భర్త తారక రత్న అనుసరించారని.. ఇక తెలుగుదేశం పార్టీ కోసం ఆయన చివరి నిమిషం వరకు ఆలోచిస్తునే ఉండే వారని.. అలాంటి తారకరత్న మధ్య లేకపోవడం బాధాకరమని ఆలేఖ్య రెడ్డి చెబుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.
అలేఖ్య రెడ్డిని నందమూరి తారకరత్న ప్రేమించి వివాహం చేసుకున్నారు. అయితే అలేఖ్య రెడ్డి వైయస్ఆర్ సీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి సమీప బంధువు. 2023, జనవరి 27వ తేదీన ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కుప్పంలో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు శ్రీకారం చుట్టారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం నందమూరి తారక రత్న తీవ్ర అనారోగ్యానికి గురై కుప్పకూలి పోయారు. దీంతో ఆయన్ని బెంగుళూరులోని నారాయణ హృదయాలయా ఆసుపత్రికి తరలించారు. ఆక్కడ చికిత్స పొందుతూ.. తారకరత్న తుది శ్వాస విడిచారు. ఆ సమయంలో అంటే.. తారక రత్న ఆసుపత్రిలో చేరిన నాటి నుంచి ఆయన మరణం.. అంత్యక్రియలు పూర్తి అయ్యే వరకు విజయసాయిరెడ్డి.. అలేఖ్య కుటుంబానికి అన్ని తానై వ్యవహరించారు. ఆ క్రమంలో తారకరత్న సమీప బంధువులు నారా చంద్రబాబు నాయుడు, లోకేశ్, నందమూరి బాలకృష్ణలతో విజయసాయిరెడ్డి అత్యంత దగ్గరగా మెలిగిన విషయం విదితమే.
అయితే ట్విట్టర్ వేదికగా టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేశ్‌లను టార్గెట్ చేస్తూ.. విజయసాయిరెడ్డి వ్యంగ్య బాణాలు సంధిస్తు ఉండేవారు. కానీ తారకరత్న మరణం తర్వాత.. చంద్రబాబు, లోకేశ్‌ని టార్గెట్ చేయడం దాదాపుగా తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం వైయస్ జగన్‌కు విజయసాయిరెడ్డి మధ్య గ్యాప్ బాగా పెరిగినట్లు ఓ చర్చ సైతం నాడు హల్ చల్ చేసింది.
ఆ తర్వాత మళ్లీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా నారా చంద్రబాబు, నారా లోకేశ్‌పై నిప్పులు చెరుగుతుండడం ప్రారంభించారు. ఆ తర్వాత.. అంటే ఇటీవల గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏపీ స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో నాటి సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రమేయం ఉందంటూ.. జగన్ ప్రభుత్వం ఆరోపిస్తూ.. ఆయన్ని అక్రమంగా అరెస్ట్ చేసింది.
ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ విదేశాల్లో సైతం చంద్రబాబు అరెస్ట్‌కు నిరసనగా వివిధ రంగాలకు చెందిన తెలుగు ప్రజలు ఆందోళనలు, ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. అందులోభాగంగానే ఎన్టీఆర్ భవన్లో చంద్రబాబుకు మద్దతుగా చేపట్టిన ఆందోళనలో అలేఖ్య రెడ్డి, నిషికా పాల్గొన్నారు. అయితే విజయసాయిరెడ్డి సమీప బంధువు అలేఖ్య రెడ్డి.. సైతం చంద్రబాబుకు మద్దతుగా నిలవడంపై ఫ్యాన్ పార్టీలో అప్పుడే గుసగుసలు మొదలైయ్యాయి.