Leading News Portal in Telugu

జగన్ హస్తిన పర్యటన సరే.. మోడీ, షా అప్పాయింట్ మాటేమిటి? | jagan delhi tour ok| what|about|modi| shah| appointment| babu| arrest| skill| case| bjp| hand


posted on Oct 5, 2023 3:09PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన ఒక రోజు ముందుకు జరిగింది. ముందుగా ప్రకటించినట్లు శుక్రవారం కాకుండా ఒక రోజు ముందే ఆయన హస్తినకు బయలుదేరారు. ఆయన హస్తిన పర్యటన సరే.. అయితే వైసీపీ ప్రచారం చేసుకుంటున్న విధంగా జగన్ కు ఇప్పటికే ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లు కన్ ఫర్మ్ అయ్యాయా అంటూ  అనుమానమే అంటున్నారు పరిశీలకులు.

జగన్ విదేశీ పర్యటనలో ఉండగా  మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు అరెస్టు జరిగింది. ఆయనను ఏపీ సీఐడీ స్కిల్ కేసులో అరెస్టు చేసింది. ఆ అరెస్టు అక్రమమంటూ రాజకీయాలకు అతీతంగా దేశ వ్యాప్తంగానే కాదు, విదేశాలలో సైతం ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. సరే అరెస్టు తరువాత ఆయన క్వాష్ పిటిషన్ ను తొలుత ఏసీబీ కోర్టు, తరువాత హైకోర్టు కొట్టివేశాయి. ప్రస్తుతం సుప్రీం కోర్టులో ఆయన క్వాష్ పిటిషన్ పై సోమవారం వాదనలు జరిగే అవకాశం ఉంది. మరో వైపు మరిన్ని కేసులలో ఆయనను విచారించాలంటూ కోర్టులో పీటీ వారంట్లు దాఖలు చేసింది.అదలా ఉండగా..  జగన్ విదేశీ పర్యటన నుంచి ఇలా వచ్చీ రాగానే హస్తిన  పర్యటనకు వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లూ చేసేసుకున్నారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అప్పాయింట్ మెంట్లు తీసుకున్నారనీ, చంద్రబాబు అరెస్టు, స్కిల్ కేసులో ఆయన పాత్ర తదితర అంశాలపై వారికి వివరిస్తారనీ వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. కానీ ఏమయ్యిందో కానీ ఆయన హస్తినకు వెళ్లలేదు. అసలా ఊసే ఎత్తలేదు. అదే సమయంలో చంద్రబాబు అరెస్టుపై కేంద్రం పెద్దలు స్పందించనూ లేదు.

ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక  కేంద్రం పెద్దల హస్తం ఉందా అన్న అనుమానాలు బలంగా వ్యక్తమయ్యాయి. అయితే ఆ విషయంపై తెలుగుదేశం పార్టీ నుంచి ఎటువంటి విమర్శలూ, వ్యాఖ్యలూ రాలేదు. కానీ వైసీపీ నేతలు మాత్రం బాహాటంగా.. చంద్రబాబు అవినీతి రుజువైంది కనుకనే బీజేపీ పెద్దలు (మోడీ, షా)లు చంద్రబాబు అరెస్టుపై స్పందించలేదంటూ పెద్ద ఎత్తున ప్రకటనలు గుప్పించారు. అన్నిటికీ  మించి మరిన్ని అరెస్టులు అంటూ పేర్లు  చెబుతూ హడావుడి చేశారు. అందుకు తగ్గట్టుగానే ఏపీ  సీఐడీ చీఫ్ నారా లోకేష్ ను సైతం అరెస్టు చేస్తామంటూ మీడియా సమావేశంలోనే ప్రకటించారు. అయితే చంద్రబాబు అక్రమ అరెస్టు ప్రకంపనలు హస్తిననూ కుదిపివేయడంతో కేంద్రం పెద్దలు జగన్ తీరుపై ఒకింత గుర్రుగా ఉన్నారంటూ వార్తలు వెలువడ్డాయి.

ఈ నేపథ్యంలోనే జగన్ హస్తిన పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ముందుగా శుక్రవారం (అక్టోబర్ 6)హస్తినకు బయలుదేరుతారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన ఒక రోజు ముందే హడావుడిగా ఢిల్లీ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. హస్తినలో ఆయన కార్యక్రమాల షెడ్యూల్ చూస్తే మోడీ, షాలతో భేటీ ఉన్నట్లు కనిపించడం లేదు. సీఎంవో ప్రకటించిన మేరకు జగన్ గురువారం (అక్టోబర్ 5) ఉదయం హస్తినకు బయలు దేరి వెడతారు. ఆ రోజుకు ఆయన ఎవరెవరిని కలుస్తారు, ఆయన కార్యక్రమాలేమిటి అన్నది ఆ ప్రకటనలో లేదు. గురువారం రాత్రి (అక్టోబర్ 5) ఆయన నంబర్ 1 జన్ ఫథ్ నివాసంలో బసచేస్తారని మాత్రమే ఉంది. ఇక శుక్రవారం (అక్టోబర్ 6) ఉదయం ఆయన విజ్ణాన్ భవన్ లో వామపక్ష తీవ్రవాదంపై కేంద్రం నిర్వహించే సమీక్షా సమావేశంలో పాల్గొని తిరిగి జన్ పథ్ నివాసానికి చేరుకుంటారు.  అంతకు మించి జగన్ హస్తిన పర్యటన గురించి సీఎంవో విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఏమీ లేదు.

ఒక వేళ నిజంగానే ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో జగన్ భేటీలు ఖరారై ఉంటే సీఎంవో కచ్చితంగా ఆ వివరాలను వెల్లడించి ఉండేది. కానీ అలా జరగక పోవడంతో ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో అప్పాయింట్ మెంట్ క న్ ఫర్మ్ అన్నది వైసీపీ ప్రచారార్భాటంలో భాగంగానే భావించాల్సి ఉంటుంది. చంద్రబాబు అరెస్టు విషయంలో జగన్ కు మోడీ, షా మద్దతు ఉందని చాటుకోవడానికి  వైసీపీ చేస్తున్న ప్రయత్నాలలో భాగమే జగన్ హస్తిన పర్యటనలో వారితో భేటీ కన్ఫర్మ్ అన్న ప్రాచారం సాగుతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్ లండన్ పర్యటన నుంచి వచ్చిన వెంటనే హస్తిన వెళ్లి మోడీ, షాలతో భేటీ కావాలని భావించారు. అయితే ఎంత ప్రయత్నించినా వారి అప్పాయింట్ మెంట్లు దొరకలేదని హస్తిన వర్గాల సమాచారం. చివరాఖరకు ఎట్టకేలకు గురువారం (అక్టోబర్ 5) ఆయన హస్తిన వెళ్లినా హోంశాఖ సమీక్ష ఉండటంతో నే వెడుతున్నారు. హస్తినలో ఉండే మోడీ, అమిత్ షాల అప్పాయింట్ మెంట్ కోసం ప్రయత్నించే అవకాశాలున్నా.. ఆ ప్రయత్నాలు ఫలిస్తాయన్న నమ్మకం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే చంద్రబాబు అరెస్టు వెనుక మోడీ, షాల ఆశీస్సులు, ప్రొత్సాహం ఉన్నాయన్న  అనుమానాలు బలంగా వ్యక్తం అవుతున్నందున వాటికి మరింత బలం చేకూర్చేలా జగన్ కు మోడీ, షాలు అప్పాయింట్ మెంట్ ఇచ్చే అవకాశాలు దాదాపు శూన్యం అని అంటున్నారు.