Leading News Portal in Telugu

బాబు అరెస్టుకు నిరసనగా ఆగని ఆందోళనలు.. ఆయన విడుదల కోరుతూ కొనసాగుతున్న పూజలు | protests continue opposing babu illegal arrest| temples| prayers| chandrababu


posted on Oct 7, 2023 10:49AM

ఏపీ స్కిల్ కేసులో తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి అక్రమ అరెస్ట్ కు నిరసనగా ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ, విదేశాలలోనూ గత 29 రోజులుగా నిరంతరాయంగా నిరసన ప్రదర్శనలు, ఆందోళనలూ కొనసాగుతున్నాయి. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆందోళనలన్నీ శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా సాగుతున్నా.. ఎక్కడా లేని విధంగా తెలుగు రాష్ట్రాలలో మాత్రం వాటిపై ఉక్కుపాదం మోపుతూ అణచివేత విధానాలను అనుసరిస్తున్నాయి. దీనిపై ప్రజాస్వామ్య వాదులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలలో  ప్రజాస్వామ్యం కాదు.. నియంతృత్వం కొనసాగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలుగుదేశం పార్టీ వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తోంది. అందులో భాగంగానే శనివారం (అక్టోబర్7) రాత్రి ఏడు గంటల నుంచి ఐదు నిముషాల పాటు.. అంటే 7.05 గంటల వరకూ కాంతితో క్రాంతి పేరిట నిరసన తెలపాలని పిలుపు నిచ్చింది.  

ప్రగతి వెలుగులు పంచే చంద్రుడుని ఫ్యాక్షన్ పాలకులు చీకట్లో నిర్బంధించారని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ధ్వజమెత్తారు.  అందుకే శనివారం రాత్రి రాత్రి 7.00 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు ఇళ్లలో లైట్లు ఆపి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్ లైట్లు వెలిగించి నిరసన తెలపాలనీ, అలాగే రోడ్లపై ఉన్న వారు తమ వాహనాల లైట్లు బ్లింక్‌ చేయడం ద్వారా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకి సంఘీభావం తెలపాలని లోకేష్ పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమాన్ని బాబుతో నేను.. అంటూ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయాలని కోరారు. వాకిళ్లు, బాల్కానీలు, వీధుల్లోకి వచ్చి దీపాలు, కొవ్వొత్తులు, మొబైల్ టార్చ్‌లు, టార్చ్ లైట్లు.. ఇలా ఎవరికి తోచిన విధంగా వారు వెలుగులు ప్రసరింప చేసి చంద్రబాబు అరెస్టును నిరసించాలని కోరారు.  

ఇదే విషయాన్ని నారా లోకేశ్ సతీమణి నారా బ్రాహ్మణి   ట్విట్టర్ వేదికగా  చంద్రబాబు అనే చైతన్యాన్ని నిర్బంధించి తిరుగులేదని కొందరు విర్రవీగుతున్నారనీ,  కానీ రాష్ట్రంలో చీకటిని తరిమికొట్టే క్రాంతి మొదలైందని వారికి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొనడం ద్వారా తెలియజేయాలని కోరారు.  రాష్ట్రాన్ని,  భవిష్యత్తును చీకటి చేసి.. దాన్ని కనిపెట్టకుండా మనల్ని కళ్లు మూసుకోమంటున్న పాలకులకు కళ్లు బైర్లు కమ్మేలా కాంతితో క్రాంతిని చూపాలని పిలుపునిచ్చారు.  ఒక వైపు పార్టీ పిలుపు మేరకు ప్రజా భాగస్వామ్యంలో నిరసనలు వెల్లువెత్తుతుంటే.. మరో వైపు చంద్రబాబు విడుదల కోరుతూ ఎక్కడికక్కడ ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, యాగాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగానే  నారా చంద్రబాబునాయుడు అరెస్టును నిరసిస్తూ , ఆయన జైలు నుంచి కడిగిన ముత్యంలా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ  ఉమ్మడి నంద్యాల జిల్లా చాగలమర్రి పట్టణంలో  అభిమానులు కార్యకర్తలు గ్రామ దేవత చాగలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి  కొట్టారు.

  నంద్యాల జిల్లా తెలుగుదేశం బీసీసెల్ స్పొక్ పర్సన్ సల్లా నాగరాజు, టీఎన్ టీయూసీ ప్రధాన కార్యదర్శి గుత్తినరసింహులు, కొలిమి మాబు షరీఫ్ , అలాంసాగారి మౌలాలి , టిడిపి  మండల ప్రధాన కార్యదర్శి హనీఫ్ , మండల ప్రజార కార్యదర్శి ముల్లాగఫార్, క్లస్టర్ ఇంచార్జ్ ముల్లా అజిముద్దీన్ , అబ్దుల్లా, కామిశెట్టి రమేష్, కామిశెట్టి మధు , నాయకులు కొలిమి షరీఫ్ , ఖాసిం, హుస్సేన్ భాష , గాంధీ , వీరంరెడ్డి భాస్కర్రెడ్డి , సంజీవరెడ్డి , బషీర్ , కసినేని ఓబులేసు తదితరుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఐయామ్ విత్ బాబు అంటూ నినాదాలు చేశారు.