Leading News Portal in Telugu

ప్రకాశం బ్యారేజికి   ప్రపంచ వారసత్వ కట్టడం అవార్డు


posted on Oct 7, 2023 1:58PM

కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజికి   ప్రపంచ వారసత్వ కట్టడం అవార్డుకు ఎంపికైందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సెంట్రల్ వాటర్ కమీషన్ ఇఎన్ సి ఐడి     డైరెక్టర్ అవంతి వర్మ  రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శికి వ్రాసిన ఒక లేఖలో తెలియజేశారు.

వ్యవసాయంలో సమర్ధవంతంగా నీటిని వినియోగించే వారసత్వ కట్టడాలను గుర్తించేందుకు ఈరంగంలో పరిశోధనలు జరిపే పరిశోధకులను ప్రోత్సహించే లక్ష్యంతో ఐసిఐడి ఈఅవార్డులను ఏర్పాటు చేసిందని  ఆయన తెలిపారు. ప్రపంచ వారసత్వ కట్టడాలు -2023 అవార్డులకు ఐసిఐడి,ఐఎన్ సి డిల తరపున నామినేషన్లు కోరగా వచ్చిన నామినేషన్లలో 19 నిర్మాణాలను ఈఅవార్డులకు ప్యానల్ న్యాయమూర్తులు  సిఫార్సు చేసి ఎంపిక చేశారు. వాటిలో భారతదేశం నుండి 4 నిర్మాణాలను ఈ  ప్రపంచ వారసత్వ కట్టడాలు-2023 అవార్డుకు ఎంపిక చేయడం జరిగిందని డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు.

భారతదేశం నుండి ఎంపికైన 4 నిర్మాణాలలో కృష్ణా నదిపై గల ప్రకాశం బ్యారేజితో పాటు ఒడిస్సా లోని బలిద్హిహా ప్రాజెక్టు , జయమంగళ ఆనకట్టలు,తమిళనాడులోని శ్రీవాయికుంటం ఆనకట్ట ఈఅవార్డుకు ఎంపికైనట్టు తెలిపారు.ఈవిధంగా ఎంపికైన నిర్మాణాలను   ప్రపంచ వారసత్వ కట్టడాలకు సంబంధించిన ఐసిఐడి రిజిష్టర్ లో నమోదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు.

ఈ  ప్రపంచ వారసత్వ కట్టడాల  అవార్డుకు ఎంపికైన రాష్ట్రాలకు నవంబరు 2నుండి 8 వరకూ విశాఖపట్నంలో జరిగే 25వ ఐసిఐడి కాంగ్రెస్, 74వ ఐఇసి సమావేశంలో ఈ అవార్డులను ఆయా రాష్ట్రాలకు ప్రదానం చేయనున్నట్టు డైరెక్టర్ అవంతి వర్మ తెలియజేశారు.

ఈ సమావేశానికి సంబంధించిన ఆహ్వానపత్రికను త్వరలో ఆయా రాష్ట్రాలకు పంపడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. ఈఅవార్డులకు ఎంపికైన రాష్ట్రాలు 25వ ఐసిఐడి కాంగ్రెస్, 74వ ఐఇసి సమావేశానికి హాజరు కావడానికి  రిజిష్టర్ చేసుకోవాల్సిందిగా ఆయన విజ్ణప్తి చేశారు.