జగనన్నతో మాట్లాడి సెట్ చేస్తా.. ఏపీ అంటే కేటీఆర్ కు ఇంత చులకనా? | ktr levity on ap| telangana| minister| it| industries| talk
posted on Oct 7, 2023 1:41PM
అదేంటో పాపం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంటే అందరికీ చులకన అయిపొయింది. ఇప్పటికే ఏపీలో పరిస్థితులపై పలుమార్లు ఎగతాళిగా మాట్లాడిన తెలంగాణ నేతలు మరోసారి కూడా అలాంటి వ్యాఖ్యలే చేశారు. గతంలో ఏపీలో రోడ్లు, మౌలిక వసతులపై అయ్యో పాపం అన్న తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇప్పుడు.. కాస్త ఏపీలో కూడా కంపెనీలు పెట్టె ఆలోచన చేయండి.. కావాలంటే ఏపీ సీఎం జగనన్నతో తానే స్వయంగా మాట్లాడి సెట్ చేస్తానని కేటీఆర్ ఐటీ కంపెనీల యాజమాన్యాన్ని కోరారు. హనుమకొండలోని మండికొండలో ఐటీ పార్క్ ప్రారంభించిన కేటీఆర్ ఇక్కడ మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాబోయే పదేళ్లలో హైదరాబాద్‌కు, వరంగల్‌కు పెద్ద తేడా ఉండదన్న మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో భవిష్యత్తు టైర్ 2 నగరాలదే అని చెప్పారు. అలాగే ఏపీలోనూ ఐటీ సంస్థలు పెట్టాలని కేటీఆర్ ఎన్నారైలను కోరారు. కావాలంటే జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తానని హామీ ఇచ్చారు. దీంతో కేటీఆర్ వ్యాఖ్యలు, ఏపీ పరిస్థితులు, ఏపీ మంత్రుల పనితీరుపై మరోసారి రాష్ట్రంలో చర్చకు దారి తీస్తుంది.
వైసీపీ ప్రభుత్వ పాలనలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఎలాంటి సంస్థలు ముందుకు రావడం లేదు. వైసీపీ నేతలు ఎంత బుకాయించినా ఈ మాట మాత్రం వాస్తవం. కొత్త సంస్థలు రావడం దేవుడెరుగు నానా కారణాలతో పాత కంపెనీలను కూడా వెళ్లగొట్టేస్తున్నారు. దీనిపై టీడీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. నిజానికి అమరావతి అనుకున్న రీతిలో పూర్తి అయి ఉంటే పలు రకాల నాన్ ఐటీ సంస్థలతో పాటు ప్రముఖ ఐటీ కంపెనీలు పదుల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్ కు క్యూ కట్టేవి. అధికారం చంద్రబాబు చేతిలో ఉంటే కాళ్ళకు బలపాలు కట్టుకొని అయినా కంపెనీలను పట్టుకొచ్చేవారు. కానీ, నాలుగేళ్ల జగన్ పాలనలో ఏపీ వైపు చూసే వారే లేకుండా పోయారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో అభివృద్ధితో పాటు ఐటీ రంగంలో తెలంగాణ దూసుకుపోతోంది. హైదరాబాద్ తో పాటు వరంగల్, కరీంనగర్ లాంటి ద్వితీయ శ్రేణి నగరాలను కూడా అభివృద్ధి చేసుకుంటూ ఐటీని విస్తరిస్తున్నారు. ఎన్నారైలను, పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వం రకరకాల కార్యక్రమాలు కూడా నిర్వహిస్తుంది.
ఏపీ విషయానికి వస్తే తెలంగాణకు పూర్తి విరుద్ధం. ఇక్కడ అసలు ఏ శాఖకి మంత్రి ఎవరో కూడా ప్రజలకు తెలియదు. అందునా పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి ఏం చేస్తారో, అసలు ఎక్కడ ఉంటాడో కూడా తెలియదు. అలాంటిది ఆయన పరిశ్రమలను ఆకర్షించేందుకు ఏం చేస్తారన్నది ఊహించడం కూడా కష్టమే. సీఎం జగన్ కూడా ఏపీలో ఉద్యోగ, ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చిందే లేదు. కనీసం కంపెనీల రాకకోసం కానీ.. పెట్టుబడి దారులను ఆకర్షించేందుకు కానీ ఎలాంటి ప్రణాళికలు లేవు. ఈ క్రమంలోనే అసలు ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందని వ్యాపార వర్గాలలో అందరూ మర్చిపోయారు. ఇటువంటి నేపథ్యంలోనే, ఏపీ రాష్ట్రంపై, సీఎం జగన్ పై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చేసిన తాజా వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
తెలంగాణలో ఇప్పుడు ఎన్నికల సీజన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. కనుక తెలంగాణ పార్టీలకు సీమాంధ్ర సెటిలర్ల ఓట్లు కూడా కీలకమే. ఇందులో భాగంగానే బీఆర్ఎస్ కొద్దిరోజులుగా సీమాంధ్ర ఓటర్లకు రకరకాలుగా గాలమేస్తుంది. ఈ క్రమంలోనే ఇప్పుడు మంత్రి కేటీఆర్ ఏపీలో కుంటుపడిన అభివృద్ధి దృష్టిలో అయ్యో పాపం అనే భావనలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. ఆంధ్రా కూడా అభివృద్ధి చెందాలన్నదే తమ అభిమతం అనేలా బీఆర్ఎస్ వైఖరి ఉందనేలా కేటీఆర్ ఈ తరహా వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కేటీఆర్ ఏ కోణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేసినా ఇది జగన్ ప్రభుత్వానికి మాత్రం కొరకురానిదే. పక్క రాష్ట్ర మంత్రి అయ్యో పాపం అంటూ ఏపీపై జాలి చూపించడం.. కంపెనీలు ఏర్పాటు చేయండి కావాలంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో తాను మాట్లాడతానని చేసిన వ్యాఖ్యలు ఏపీలో ఎంతటి అసమర్ధ పాలన కొనసాగుతుందో తేటతెల్లం చేస్తుంది.