posted on Oct 8, 2023 8:59PM
విభజించు పాలించు.. అప్పుడెప్పుడో రాజరికాలు ఉన్న సమయంలో కొందరు రాజులు ఈ సిద్ధాంతం ఆధారంగా ప్రజల మధ్య చిచ్చు పెట్టి విడగొట్టి పాలన సాగించారని చెప్పుకొనేవారు. ఇప్పుడు సీఎం జగన్ అచ్చం అలాంటి సిద్ధాంతాన్నే నమ్ముకొని ఏపీలో పాలన సాగించాలని భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ సిద్ధాంతం ఆధారంగానే తన రాజకీయ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుండే వైఎస్ జగన్ ఈ తరహా వ్యూహాలతోనే ఇంతవరకూ వచ్చారు. అధికారం చేపట్టిన ఈ నాలుగున్నరేళ్లుగా ఇదే వ్యూహంతో రాష్ట్రంలో పరిపాలన సాగించారు. మరోసారి విజయం సాధించడం కోసం కూడా ఇదే వ్యూహాన్ని నమ్ముకున్నారు. అయితే ఇక ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి వ్యూహం బెడిసి కొట్టినట్లేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పదేళ్లుగా జగన్ వ్యూహాలను అర్ధం చేసుకోలేని ప్రజలు.. ఆయన అధికారంలోకి వచ్చిన తరువాత పాలన సాగించిన తీరుతో ఆయన వ్యూహాలతో పాటు మనస్తత్వాన్ని కూడా అర్ధం చేసుకోగలిగారు. అందుకే ఇప్పుడు వైసీపీకి గడ్డు పరిస్థితులు వచ్చాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
విశాఖ క్యాపిటల్.. ఏమో ఏపీకి కూడా మూడు రాజధానులు రావచ్చు. పరిపాలన, న్యాయ, శాసన రాజధానులుగా మూడు ప్రాంతాలలో మూడు ఏర్పాటు చేస్తే తప్పేముంది అని సీఎం జగన్ మూడేళ్ళ క్రితం ఒక శీతాకాలం నిండు అసెంబ్లీలో సంచలన ప్రకటన చేశారు. ఆ తర్వాత హడావుడిగా దాన్ని చట్టం కూడా చేశారు. అక్కడ నుండి రాష్ట్రం రావణకాష్టంలా మారింది. నిత్యం ఏదో ఒక వివాదం అన్నట్టుగానే ఉంది. ఇంతవరకూ ఒక్క రాజధానికి కూడా ఒక్క ఇటుక పెట్టిన పాపాన పోలేదు కానీ.. ఈ నినాదంతో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు మాత్రం పెట్టారు. మూడు రాజధానులు న్యాయ సమీక్షకు నిలబడకపోవడంతో హైకోర్టులో విచారణకు ముందే తాము చేసిన మూడు రాజధానుల చట్టాన్ని వైసీపీ ఉపసంహరించుకుంది. దీనిపై వైసీపీ సుప్రీం కోర్టులో సవాల్ చేయగా అది ఈ డిసెంబర్ నుంచి విచారణ జరగనుంది.
అయితే, వైసీపీ ఇలా మూడు రాజధానులుగా విడదీయడం వెనక ఓ ఎత్తుగడ ఉంది. మరోసారి అధికారంలోకి రావాలంటే రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను మూడు ముక్కలుగా విడదీసి సీట్లు లెక్కేసి వైసీపీ ఈ మూడు రాజధానుల వ్యూహాన్ని తెరమీదకి తీసుకొచ్చినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అమరావతిని అభివృద్ధి చేస్తే తనకు ఒరిగేదేమీ లేదన్న భావనలోనే జగన్.. మూడు రాజధానులు అంశాన్ని తెరమీదకి తెచ్చి లబ్ది పొందాలని ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు. విశాఖ సహా ఉత్తరాంధ్ర జిల్లాలలో మొత్తం 34 అసెంబ్లీ సీట్లు ఉండగా అయిదు ఎంపీ సీట్లు ఉన్నాయి. ఇందులో 2019 ఎన్నికల్లో 28 అసెంబ్లీ, నాలుగు ఎంపీ సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి కూడా అదే మ్యాజిక్ ని రిపీట్ చేయాలని చూస్తున్న జగన్, ప్రభుత్వ వ్యతిరేకతను రూపుమాపేలా అనధికారికంగానైనా విశాఖ నుండి పాలన చేసి ఉత్తరాంధ్ర తన అడ్డాగా మార్చుకోవాలని చూస్తున్నారు. ఇందు కోసం ఇప్పటికే విశాఖలో ఏర్పాట్లు కూడా మొదలవగా.. ఈ దసరా నుండి జగన్ అక్కడ నుండే పాలన చేయాలని భావిస్తున్నారు.
అటు ఉత్తరాంధ్రతో పాటు అమరావతిలోనే శాసన రాజధాని ఉంటుందని, రాయలసీమలో న్యాయరాజధానిని ఏర్పాటు చేస్తామని వైసీపీ నేతలు అదే పాట పాడుతున్న సంగతి తెలిసిందే. గత ఎన్నికల మాదిరి కోస్తాంధ్ర, రాయలసీమలో కూడా ఫలితాలు రాబట్టాలని వైసీపీ ఈ మూడు రాజధానుల పాట పాడుతూనే ఉంది. అయితే, ఈ ప్లాన్ బెడిసికొట్టింది. కోస్తాంధ్రలోని గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా గుంటూరు జిల్లాలలో 67 అసెంబ్లీ సీట్లు ఉండగా.. ఈసారి ఇక్కడ వైసీపీకి భారీ గండి పడుతుందని విశ్లేషణలు ఉన్నాయి. రాయలసీమలో మొత్తం 52 అసెంబ్లీ సీట్లు ఉండగా.. 2019లో 49 సీట్లను వైసీపీ గెలుచుకుంది. ఈసారి అక్కడ కూడా ఆ స్థాయి హవా లేదు. నెల్లూరులో గతంలో పదికి పది గెలుచుకుంటే ఈసారి పదికి పది స్థానాలలో పరాజయం వైసీపీకి పరాజయమే ఎదురౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. పన్నెండు సీట్లు ఉన్న ప్రకాశం జిల్లాలో కూడా ఈసారి టీడీపీ పది స్థానాలు దక్కించుకునే ఛాన్స్ ఉందంటున్నారు. మొత్తంగా చూస్తే వైసీపీ ఒక ఆలోచనలో ఈ మూడు ముక్కలాట మొదలెట్టినా అది బెడిసికొట్టిందని పరిశీలకులు అంటున్నారు.