ఇంత భయమేల జగన్ రెడ్డి? | why such fear jagan| Five|fold|security| including| family| hundres| crores| people
posted on Oct 9, 2023 6:53AM
సింహం సింగిల్ గా పోటీ చేస్తుంది.. వెన్ను చూపని ధీరుడు, వెనకడుగు వేయని మొనగాడు.. రాయలసీమ ముద్దుబిడ్డ.. పులివెందుల పులి బిడ్డ.. రాజన్న బిడ్డ, రాయలసీమ రత్నం.. ఇవీ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి గురించి వైసీపీ నేతలూ, శ్రేణుల నినాదాలు, ఇచ్చే బిల్డప్ లు. కానీ, ఆయనేమో పోలీసులు లేకుండా తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకి రారు. పరదాలు, బారికేడ్లు లేకుండా గేటు దాటరు. రెండు మూడు కిలోమీటర్ల రోడ్డు ప్రయాణం చేయడానికి కూడా ధైర్యం చేయరు. అసలు జనాలకు కనిపించకుండా ఆకాశమార్గానే ప్రయాణిస్తున్నారు. ఇక బటన్ నొక్కేందుకు ఆయన పర్యటనను చేసినా.. ఆ పర్యటన మార్గంలో మార్గంలో మనుషులనే వారు కనిపించకుండా పోలీసులు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆయన పర్యటనకు ఒక రోజు ముందు నుంచే మల్లింపులు, ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేసి ఆయన ప్రజల కంటికి కూడా కనిపించకుండా పరదాలు కట్టేస్తున్నారు. పరదాటు కట్టేందుకు అడ్డం వస్తాయనుకుంటే చెట్లను నరికేస్తున్నారు. జగన్ కనిపిస్తే ప్రజలు దాడి చేస్తారని భయమో లేక ఓటేశాక వాళ్ళతో ఇంకేం అవసరం ఉందిలే అనుకున్నారో ఏమో కానీ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ముఖం చూపించేందుకు కూడా ఇష్టపడటం లేదు. సరే అదంతా పక్కన పెడితే.. ఇప్పుడు ఏకంగా జగన్ కు, ఆయన కుటుంబానికి ఐదంచెల భద్రత ఏర్పాటు చేసుకుంటున్నారు.
సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు దేశంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కోసం ఏకంగా చట్టమే తీసుకొచ్చారు. తనకు, తన భార్య, పిల్లలకు, తల్లికి, దేశంలో ఉన్నా.. విదేశాల్లో ఉన్నా అత్యంత సమీపం నుంచి భద్రత కల్పించడానికి స్పెషల్ సెక్యూరిటీ గ్రూపుని ఏర్పాటు చేశారు. ఇందు కోసం ఏకంగా ప్రత్యేక చట్టమే తీసుకొచ్చారు. దేశంలో తొలిసారిగా, ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికీ లేనివిధంగా ఏపీ సీఎం, ఆయన కుటుంబ భద్రత కోసం ఇలా ప్రత్యేకంగా ఎస్ఎస్జీని ఏర్పా టు చేస్తున్నారు. ఈ చట్టంతో ఇప్పటికే ఉన్న వందలాది మంది సీఎం భద్రతా సిబ్బందితో పాటు జగన్ భద్రత కోసం మరికొంత మంది తోడు కానుండగా.. తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే జగన్ భార్య భారతీకి, హైదరాబాద్ నగరంలో ఉన్న జగన్ తల్లి విజయమ్మకు, ప్రస్తుతం విదేశాల్లో ఉన్న జగన్ ఇద్దరు కుమార్తెలకు కూడా భద్రత కల్పించనున్నారు. ఎస్ఎస్జీ చట్టం ప్రకారం జగన్ కుమార్తెలకు అక్కడ కూడా భద్రత కల్పించాల్సి ఉంది.
ఈ ఎస్ఎస్జీ భద్రత గ్రూపు కోసం ఏటా ఐదు వందల కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ కేటాయించనున్నారు. సీఎం ఫ్యామిలీ ఎక్కడికి వెళ్లినా, విదేశాలకు వెళ్లినా వీరు తోడుగా ఉంటూ రక్షణ కల్పిస్తారు. సీఎంకు సాధారణంగానే నాలుగైదు అంచెల సెక్యూరిటీ ఉంటుంది. వారికి తోడుగా ఇప్పుడు ఈ ఎస్ఎస్జీ భద్రత కూడా కలవనుంది. ఇలాంటిదే దేశ ప్రధానికి ఉంటుంది. ప్రధాని భద్రత కోసం ప్రత్యేకంగా ఎస్పీజీ ఉంటుంది. అదే స్థాయిలో ఇప్పుడు జగన్, ఆయన కుటుంబ సభ్యుల భద్రత కోసం ఎస్ఎస్జీని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే దీని కోసం చట్టం తీసుకురాగా ఇక గవర్నర్ ఆమోదం లభిస్తే గెజిట్ నోటిఫికేషన్ విడుదల అవుతుంది. ఆ వెంటనే ఎస్ఎస్జీ చట్టం అమల్లోకి వస్తుంది.
అయితే, అసలు సీఎంకు, ఆయన కుటుంబానికి ఇప్పటికిప్పుడు ఈ స్థాయి భద్రత ఏం అవసరం వచ్చిందన్నదే చర్చ. రాష్ట్రంలో మావోయిస్టుల ఊసేలేదని ప్రభుత్వమే కేంద్రానికి రిపోర్ట్ ఇచ్చింది. తాజాగా ఢిల్లీలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాలతో అమిత్ షా నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న జగనే స్వయంగా రాష్ట్రంలో మావోయిస్టులను కట్టడి చేశామని చెప్పారు. ఇక ఏపీలో మాఫియా ఉందా అంటే,, ఉంటే గింటే ఆ మాఫియా వైసీపీ నేతల అండదండలతోనే సాగుతున్నది కనుక దాంతో ప్రజలకే తప్ప సీఎంకు వచ్చిన నష్టం లేదు. పోనీ తెలుగుదేశం నుండి థ్రెట్ ఉందా అంటే.. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా బయటకొచ్చిన కార్యకర్తలను కూడా పోలీసులు లోపలేసి కేసులు పెడుతున్న పరిస్థితి. మరి ఇప్పటికిప్పుడు ఏడాదికి రూ.ఐదు వందల కోట్ల ఖర్చు పెట్టి ఈ ప్రత్యేక భద్రత ఎందుకు తీసుకొచ్చారన్నది ఆ జగన్మోహనరెడ్డికే తెలియాలి. హక్కుల్ని కాలరాస్తూ, అణచివేత, అరాచకాలు, ప్రతీకారం, రాజకీయ కక్ష సాధింపు పాలన చేస్తున్న జగన్ రెడ్డి తన నీడను చూసి తానే భయపడుతున్నట్లు కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.