Leading News Portal in Telugu

వైసీపీ రుణమాఫీ హామీ.. నమ్మెదెలా అంటున్నజనం ! | people lost faith in jagan| loan|waiver| promise| ycp| election| manifesto| belief| vote


posted on Oct 9, 2023 6:22AM

ఏపీలో ఎన్నికలకు నిండా ఆరేడు నెలల సమయం కూడా లేదు. ఇప్పటికే ప్రభుత్వంపై రాష్ట్ర ప్రజలలో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. సంక్షేమ పథకాల పేరుతో పప్పుబెల్లాల్లా సొమ్ములు పంచినట్లే పంచి అంతకు అంతా   ముక్కు పిండి వసూలు చేస్తున్నారన్న అసంతృప్తి ప్రజలలో వ్యక్తమవుతోంది. భూతద్దం పెట్టి చూసినా అభివృద్ధి కనిపించని పరిస్థితుల్లో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ ప్రభుత్వాన్ని సాగనంపాలా అని వేచి చూస్తున్నారు. గత ఎన్నికలకు ముందు వైసీపీ ఇచ్చిన హామీలలో ఎన్ని నెరవేర్చారో లెక్కలేసి మరీ ప్రతిపక్షాలు ఏకిపారేస్తున్నాయి. జనం కూడా అదే చెబుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా? జగన్ సర్కార్ ను సాగనంపుదామా అని ఎదురు చూస్తున్నారు.  

అంతకు ముందు తన తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకొచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీఎంబర్స్ మెంట్, పావలా వడ్డీ రుణాల పథకాలను కూడా నీరుగార్చి కేవలం బటన్ నొక్కడం, దీనికి దానికి అని లేకుండా పన్నులు బాది పీక్కుతినడమే పనిగా పెట్టుకోవడంతో ప్రజలు ఎప్పుడెప్పుడు ఈ నరకం నుండి విముక్తి లభిస్తుందా అని పంటి బిగువున బాధను దిగమింగి ఉంటున్నారు. అయితే వైసీపీ మాత్రం మరోసారి ఏం చెప్పి ప్రజలను నమ్మించాలా అని కొత్త కొత్త పథకాల ప్రకటనపై దృష్టి పెట్టింది.

 జగన్ ఈసారి తన ఎన్నికల ప్రణాళికలో రైతుల రుణ మాఫీ  హామీ అస్త్రాన్ని ప్రయోగించాలని భావిస్తున్నట్లు వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో రైతులు తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తామనే హామీతో వైసీపీ ఈసారి ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్నదంటున్నాయి. నిజానికి 2014 ఎన్నికల్లో టీడీపీ ఈ హామీ ఇచ్చింది. నాడు 87 వేల కోట్ల రైతుల రుణాల మాఫీ చేయాల్సి ఉండగా టీడీపీ నాలుగేళ్ళ పాలనలో నలభై వేల కుటుంబాలకు పైగా పూర్తి రుణమాఫీ చేసింది. మొత్తం కుటుంబాలకు మూడు విడతలను చెల్లించింది. యాభై వేల లోపు రుణాలను ఒకేసారి మాఫీ చేసిన టీడీపీ ప్రభుత్వం అంతకు పైగా ఉన్న రుణాలను ఐదు విడతలలో మాఫీ చేసే టార్గెట్ పెట్టుకుంది. మూడు విడతల రుణాలను చెల్లించగా చివర ఏడాదిలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం, అప్పటి ప్రతిపక్షం వైసీపీతో చేతులు కలిపిన బీజేపీ అడుగడుగునా టీడీపీ ప్రభుత్వాన్ని దెబ్బకొట్టే ఏకైక లక్ష్యంతో  చివరి రెండు విడతల రుణమాఫీ  విడుదల చేసినా ఎలక్షన్ కమిషన్ ను అడ్డం పెట్టుకొని  లబ్ది దారులకు  ఆ సొమ్ములు అందకుండా చేయగలిగింది.  

కాగా, ఇప్పుడు వైసీపీ అదే రుణమాఫీ నినాదంతో ఎన్నికలకు వెళ్లాలని చూస్తుంది. అయితే, నినాదం ఏదైనా, హామీ ఏదైనా జగన్ ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించడం లేదు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలోని సంపూర్ణ మద్యపాన నిషేధం, అధికారంలోకి రాగానే సీపీఎస్ రద్దు, ఇల్లు, ఇంట్లో ఎంత మంది వృద్దులు ఉన్నా పింఛన్లు, ఎంత మంది పిల్లలు ఉన్నా అమ్మ ఒడి, ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి.. ఇలా చెప్పుకుంటూ పొతే ఎన్నో హామీలను జగన్ ప్రభుత్వం విస్మరించింది. జగన్ మాట తప్పను అంటూనే మాట తప్పారు. మడమ తిప్పను అంటూనే మడమ తిప్పారు.ఇచ్చిన హామీలలో కొన్ని అమలు చేసినా  అమలు చేసినా సవాలక్ష కొర్రీలు పెట్టి ప్రజలను మానసిక వేదనకు గురి చేసిన జగన్, ఇప్పుడు ఎన్నికల ముంగిట రైతు రుణమాఫీ అంటూ చెబితే   నమ్మి అధికారం కట్టబెట్టేందుకు జనం సిద్ధంగా లేరు. గత ఎన్నికల ముందు అరచేతిలో స్వర్గం చూపేలా వాగ్దానాలు కురిపించి అధికారంలోకి వచ్చాకా నరకం చూపుతున్న జగన్ ను ఎలా నమ్ముతామని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. మాట్లాడితే విశ్వసనీయత, విశ్వసనీయత అనే జగన్ మోహన్ రెడ్డి ఊరూరూ తిరిగి ఇచ్చిన హామీలన్నీ గాలికొదిలేసి ఇప్పుడు కొత్త హామీలంటూ మరో సారి ఎన్నికల ముందు చెబితే  ప్రజలు ఎలా నమ్మతారని పరిశీలకులు కూడా అంటున్నారు.

నాలుగేళ్ళ పాలనలోనే రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ప్రజలను పీల్చి పిప్పి చేసిన జగన్.. మరో ఐదేళ్లు అధికారమిస్తే రాష్ట్రాన్ని ఇంకెంత అధోగతి పాలు చేస్తారు, ప్రజలను ఇంకెంతగా పీల్చి పిప్పి చేస్తారో అనే భయం సర్వులలోనూ వ్యక్తం అవుతోంది. ఇప్పటికే రాష్ట్ర ఆదాయాన్ని, ప్రభుత్వ ఆస్తులను, దేవాలయాల భూములను, చివరికి లిక్కర్ మీద ఆదాయాన్ని కూడా తాకట్టు పెట్టి అప్పు చేసిన జగన్.. మరోసారి అధికారమిస్తే ప్రజల ఆస్తులను కూడా తాకట్టు పెట్టడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అరాచకాలు, అక్రమాలును ప్రశ్నిస్తే దాడులు, కేసులతో రాష్ట్రం అంతటా అందరిలో అభద్రతా భావం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలోనే ఇచ్చిన ఒక్క ఛాన్స్ చాలని జనం నిర్ధారణకు వచ్చేశారు. ఈ సమయంలో వైసీపీ ఎన్ని ఆశలు చూపినా.. ఏ హామీలు ఇచ్చినా జనం విశ్వసించే పరిస్థితి కనిపించడం లేదని పరిశీలకులు అంటున్నారు.