Leading News Portal in Telugu

బీఆర్ఎస్ ప్రచార సారథి కేటీఆర్?.. నెగ్గుకు రాగలరా? | ktr to lead brs campaign| dissident| non| co operation| co ordination| doubts| kcr| health


posted on Oct 9, 2023 3:27PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ తో బాగా డీలా పడే పార్టీ ఏదైనా ఉందంటే అది అధికార బీఆర్ఎస్ మాత్రమే అని చెప్పాలి. గతంలో ఆంధ్రులకు ఆరంభ శూరత్వం అనే వారు. ఏపీ సంగతి ఎలా ఉన్నా తెలంగాణలో అధికార పార్టీ బీఆర్ఎస్ కు మాత్రం ఆ నానుడి సరిగ్గా అతికినట్లు సరిపోతుందని అని మాత్రం నిస్సందేహంగా చెప్పవచ్చు. అతి విశ్వాసమో, అతిశయమో తెలియదు కానీ.. ఎటువంటి కసరత్తూ చేయకుండానే ఊరికి ముందుగా 16 మంది అభ్యర్థులతో వచ్చే ఎన్నికలలో పోటీ చేసే వారి తొలి జాబితాను కేసీఆర్ విడుదల చేసేశారు. అన్ని పార్టీల కంటే ముందుగా ఎన్నికలకు సిద్ధమైపోయామన్న సంకేతమిచ్చేశారు. అంతే ఆ తరువాత నుంచి బీఆర్ఎస్ లో అసమ్మతి, అసంతృప్తి వినా.. ఎన్నికల సమాయత్తం దిశగా ఒక్కటంటే ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. పైపెచ్చు అసంతృప్తులను బుజ్జగించే యత్నాలూ బెడిసికొట్టాయి. 

సరిగ్గా అదే సమయంలో అనారోగ్యం కారణంగా కేసీఆర్ ప్రగతి భవన్ కే పరిమితం కావడంతో అంతా అయోమయం జగన్నాథం అన్నట్లుగా తయారైంది. వైరల్ ఫీవర్ కు తోడు ఇన్ ఫెక్షన్ కూడా సోకడంతో కేసీఆర్ మరిన్ని రోజులు ఇంటికే పరిమితమయ్యే అవకాశాలున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకు ముందుగా కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి మరిన్ని పథకాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఎన్నికల లబ్ధి పొందాలనుకున్నా అది సాధ్య పడలేదు. అంచనాల కంటే ఒక రోజు ముందుగానే కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించేయడంతో కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణక్ష్ాలపై నిర్ణయం తీసుకుందామని బీఆర్ఎస్ చేసిన కసరత్తు వృధా అయిపోయింది.  ఎన్నికల షెడ్యూల్ వెలువడటంతో ఇక ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చేసింది. దీంతో బీఆర్ఎస్ విధానపరమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. ఇక బీఆర్ఎస్ ఏం చేసినా పార్టీ పరంగా హామీలు మాత్రమే ఇవ్వగలదు.  

ఇక బీఆర్ఎస్ ను మధన పెడుతున్న అంశమేమిటంటే.. కేసీఆర్ ఎన్నికల ప్రచారం ఏ మేరకు చేస్తారు? ఎన్ని రోజులు కేటాయిస్తారు అన్నదానిపైనే ఉంది. పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు వచ్చే అసెంబ్లీ ఎన్నికల ప్రచార సారథ్యం పూర్తిగా పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కల్వకుంట్ల తారకరామారావే వహించనున్నారు. అలాగే పార్టీ అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి పగ్గాలు కూడా ఆయనే చేపట్టే అవకాశాలు ఉన్నాయి. ఉత్తర ప్రదేశ్ లో సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్ అధినేతగా ఉన్నప్పుడు, ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ పార్టీ ప్రచార సారథ్యం వహించి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చి సీఎం పగ్గాలు అందుకున్న విషయం తెలిసిందే. ఇప్పుడు కేసీఆర్ అనారోగ్యం కారణంగా విశ్రాంతి అవసరమన్న వైద్యుల సూచనల మేరకు పరిమితగానే ప్రచారంలో పాల్గొనే అవకాశం ఉండటంతో.. బీఆర్ఎస్ కూడా సమాజ్ వాదీ పార్టీ మోడల్ ను అనుసరించక తప్పని అనివార్య పరిస్థితిని ఎదుర్కొంటున్నదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. 

అయితే కేటీఆర్ సారథ్య బాధ్యతలు అనగానే పార్టీలోని ఒక వర్గం పూర్తి స్థాయిలో సహకారం అందిస్తుందా అన్న అనుమానాలు బీఆర్ఎస్ నుంచే వ్యక్తం అవుతున్నాయి. 

ఇందుకు ఉదాహరణగా 2018 ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే కేటీఆర్ ను కేసీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ప్రకటించడం.. దాంతో ఈటల, హరీష్ వంటి వారు అలకపాన్పు ఎక్కారన్న వార్తలు వెలువడటం, వాటికి బలం చేకూర్చే విధంగా 2018 ఎన్నికలలో విజయం తరువాత కేసీఆర్ తన తొలి కేబినెట్ లో ఈటల, హరీష్, వారి వర్గానికి చెందిన వారెవరికీ కేబినెట్ లో స్థానం కల్పించకపోవడాన్ని చూపుతున్నారు. 

అసలు 2018 ఎన్నికలలో విజయం సాధించిన తరువాత ఏదో ఒక సమయంలో కేటీఆర్ కు సీఎం పగ్గాలు అప్పగించే కార్యక్రమం ఉంటుందని అంతా భావించారు. పలువురు మంత్రులు అయితే ఏకంగా బహిరంగ వేదికలపైనే కేటీఆర్ ను కాబోయే ముఖ్యమంత్రిగా ప్రకటించేశారు కూడా. అయితే తరువాత తరువాత పరిస్థితి మారింది. కేటీఆర్ నాయకత్వానికి పార్టీలో సంపూర్ణ ఆమోదం లేదన్న విషయం గ్రహించిన కేసీఆర్ కుమారుడికి పట్టాభిషేక ముహూర్తాన్ని వాయిదా వేసుకుంటూ వచ్చారు. ఈ కారణంగానే కేటీఆర్, కేసీఆర్ మధ్య గ్యాప్ పెరిగిందని కూడా అప్పట్లో పరిశీలకులు సోదాహరణంగా వివరించారు.

సీఎం పాల్లొన్న సభలకు కేటీఆర్ గైర్హాజర్ కావడం, అసెంబ్లీ సమావేశాలలో కూడా ఒకరికొకరు ఎదురు పడకుండా ఒకరు వచ్చి వెళ్లిన తరువాతే మరొకరు రావడాన్ని అప్పట్లో పరిశీలకులు ఎత్తి చూపారు. సరే టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్ గా మారిన తరువాత ఆ గ్యాప్ ఒకింత తగ్గిందని చెబుతున్నారు. అయితే ఇప్పుడు కేసీఆర్ అనారోగ్యం కారణంగా ఎక్కువ కాలం విశ్రాంతి తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొనడం, ఎన్నికల షెడ్యూల్ ప్రకటించేయడంతో ఇక ప్రచార రంగంలోకి దూకక తప్పని అనివార్య పరిస్థితులు ఉత్పన్నం కావడంతో కార్యనిర్వాహక అధ్యక్షుడిగా కేటీఆర్ ప్రచార సారథ్యం భుజాన మోయక తప్పని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీని విజయతీరాలకు చేర్చగలిగితే ఇక ఆయనకు సీఎం పగ్గాలు అప్పగించడానికి ఎటువంటి అడ్డంకులూ ఉండవని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే ఆయన సారథ్యంలో పార్టీ అంతా ఏకతాటిపై నిలుస్తుందా? అన్న అనుమానాలను మాత్రం గత ఉదంతాలను ఎత్తి చూపుతూ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.