Leading News Portal in Telugu

మోగిన ఎన్నికల నగారా.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 30న | telangana assembly elections on november 30| five| states| counting of votes


posted on Oct 9, 2023 12:55PM

కేంద్ర ఎన్నికల సంఘం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసింది.  ఛత్తీస్ గఢ్ ,రాజస్థాన్, మధ్య ప్రదేశ్, మిజోరం, తెలంగాణ  రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది జరగాల్సి ఉన్న సంగతి తెలిసిందే.  వచ్చే ఏడాది జరగనున్నసార్వత్రిక ఎన్నికలకు ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను సెమీ ఫైనల్ గా భావిస్తున్నారు.   దీంతో  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను   బీజేపీ  కూటమి (ఎన్డీయే), కాంగ్రెస్ కూటమి (ఇండియా), ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలూ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రస్తుతం రాజస్థార్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్, మధ్యప్రదేశ్‌లో బీజేపీ అధికారంలో ఉన్నాయి. తెలంగాణలో బీఆర్‌ఎస్, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ (ఎంఎన్‌ఎఫ్) అధికారంలో ఉన్నాయి. ఈ ఐదు రాష్ట్రాలలో నవంబర్ రెండవ వారం, డిసెంబర్ మొదటి వారం మధ్య పోలింగ్ జరిగే అవకాశం ఉందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.  

తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఈ ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ప్రకటించిన షెడ్యూల్ మేరకు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ఒకే దఫాలో జరుగుతాయి. 

వచ్చే నెల 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది.  ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నెల 3న విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు నవంబర్ 10 చివరి తేదీ. నామినేషన్ల పరిశీలన అదే నెల 13న జరుగుతుంది. ఇక నామినేషన్ల ఉప సంహరణకు తుది గడువు నవంబర్ 15. నవంబర్ 30 పోలింగ్ తేదీ కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న  జరుగుతుంది.

కాగా ఛత్తీస్ గఢ్ అసెంబ్లీ ఎన్నికలు రెండు విడతలుగా జరుగుతాయి. ఇక రాజస్థాన్, మిజోరం, మధ్య ప్రదేశ్ లలో  ఒకే విడతలో ఎన్నికలు జరుగుతాయి. 

మధ్య ప్రదేశ్ లోని 230 స్థానాలకు ఒకే దఫాలో నవంబర్ 17న ఎన్నికలు జరుగుతాయి. నోటిఫికేషన్ ఈ నెల 21న వెలువడుతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు అక్టోబర్ 30. నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 31. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 2. పోలింగ్ నవబంబర్ 17 కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్ 3న జరుగుతుంది. 

ఇక రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకే దఫాలో జరుగుతాయి. రాష్ట్రంలోని 200 అసెంబ్లీ స్థానాలకూ ఒకే విడతలో  నవంబర్ 23న పోలింగ్ జరుగుతుంది. నోటిఫికేషన్ అక్టోబర్ 30న విడుదల అవుతుంది. నామినేషన్ల దాఖలుకు తుది గడువు నవంబర్ 6 కాగా నామినేషన్ల పరిశీలన నవంబర్ 7న జరుగుతుంది. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు నవంబర్ 9. పోలింగ్ నవంబర్ 23 కాగా ఓట్ల లెక్కింపు డిసెంబర్3న జరుగుతుంది. 

ఛత్తీస్ గఢ్ లో రెండు విడతలుగా నవంబర్ 7, 17 తేదీలలో రెండు విడతలుగా పోలింగ్ జరుగుతుంది. మొదటి విడత కు అక్టోబర్ 13న, రెండో విడతకు అక్టోబర్ 23న నోటిఫికేషన్ విడుదల అవుతుంది. తొలి విడతకు నామినేషన్ల దాఖలుకు అక్టోబర్ 20 తుదిగడువు కాగా, రెండో విడతకు అక్టోబర్ 30 చివరి తేదీ. ఇక తొలి విడత నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 21న, రెండో విడత నామినేషన్ల పరిశీలన అక్టోబర్ 31న ఉంటుంది. తొలి విడత నామినేషన్ల ఉపసంహరణకు తుది గడువు అక్టోబర్ 23 కాగా రెండో విడత నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 2. రెండు విడదల ఓట్ల లెక్కింపూ కూడా డిసెంబర్ 3న ఉంటుంది.  ఇక మిజోరాం విషయానికి వస్తే ఆ రాష్ట్రంలో కూడా ఒకే విడతలో  నవంబర్ 7,పోలింగ్ జరుగుతుంది.