posted on Oct 10, 2023 12:57PM
ఒకే రోజు కామారెడ్డి, గజ్వేల్ నియోజక వర్గాలలో తన నామినేషన్ ప్రక్రియ ముగిసిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల ప్రచారం మీద దృష్టి కేంద్రీకరించనున్నారు. ప్రగతిభవన్ నుంచే 20 రోజుల నుంచి అటు పార్టీ కార్యకలాపాలతో ముఖ్యమంత్రి విధులు నిర్వహిస్తున్న కల్వకుంట్ల చంద్రశేఖర్ రావ్ ఆరోగ్యం ఇంకా పూర్తిస్థాయిలో కోలు కోలేదని తెలుస్తోంది. తొలుత వైరల్ ఫీవర్ అని చెప్పిన రాష్ట్ర ఐటీ శాఖామంత్రి కెటీఆర్ గత వారం కెసీఆర్ కు చెస్ట్ ఇన్ ఫెక్షన్ సోకిందని ప్రకటించారు. ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటికీ ముఖ్యమంత్రి ప్రగతిభవన్ నుంచి బయటకు రాకపోవడం పార్టీ కార్యకర్తలు ఆందోళన చెందారు. అయితే ముఖ్యమంత్రి నేరుగా ఎణ్నికల ప్రచారంలో పాల్గొననున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన రోజే ముఖ్యమంత్రి కెసీఆర్ సతీమణి తిరుమల దర్శించుకున్నారు. తొలుత తొమ్మిదో తేదీన నామినేషన్ వేయాలని కెసీఆర్ సంకల్పించినప్పటికీ మరో రోజుకు తన నామినేషన్ పత్రాల సమర్పణ కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు.
వరుస బహిరంగ సభలతో సీఎం కేసీఆర్ ప్రజల్లోకి వెళ్లనున్నారు. మొదట ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అక్టోబర్ 15న భారత రాష్ట్ర సమితి అభ్యర్థులతో సమావేశంకానున్నారు. తెలంగాణ భవన్‌లో జరిగే సమావేశంలో అభ్యర్థులకు బీ ఫారాలను అందజేయనున్నారు. అదేరోజున పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించనున్నారు. అంతేగాక, అదే రోజు నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు కేసీఆర్. అక్టోబర్ 15న సాయంత్రం హైదరాబాద్ నుంచి బయలుదేరి.. హుస్నాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు కేసీఆర్. 16న జనగామ, భువనగిరి నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే బహిరంగ సభలకు హాజరవుతారు. 17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో జరిగే సభలకు హాజరవుతారు.
అక్టోబర్ 18న మధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రంలో జరిగే బహిరంగ సభ, సాయంత్రం 4 గంటలకు మేడ్చల్‌లో జరిగే సభకు హాజరై ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. దీంతో ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ దూసుకుపోనుంది. మూడోసారి సీఎం కేసీఆర్ కావడం ఖాయమని ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రస్తుతం అనారోగ్య కారణాలతో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలిసిందే.