బీఎల్ సంతోష్ హంగ్ ఆశల వెనుక మర్మం ఇదేనా? | reason behind blsantosh hung hopes| brs| bjp| bteam| congress| ts| elections| surveys| babu| arrest
posted on Oct 10, 2023 11:56AM
తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వెలువడింది. ఎన్నికల సన్నాహాల విషయంలో ఏ పార్టీ ముందున్నది.. ఏ పార్టీ వెనుకబడింది అన్న సంగతి పక్కన పెడితే.. కేంద్ర ఎన్నికల సంఘం మాత్రం తన పని తాను చేసేసి తాంబూలాలిచ్చేశాం తన్నుకు చావండి అనేసింది. తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులను గమనిస్తే త్రిముఖ పోటీ అనివార్యం అనే అనిపిస్తుంది.
అయితే ఈ పోటీలో ఇప్పటికే బీజేపీ అస్త్ర సన్యాసం చేసేసింది. నిన్న మొన్నటి వరకూ రాష్ట్రంలో అధికారం మాదే అని ధీమాగా చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు రాష్ట్రంలో హంగ్ వస్తుంది. అప్పుడు తిమ్మిని బమ్మిని చేసైనా, బమ్మిని తిమ్మిని చేసైనా అధికారం చేపడతామని చెబుతున్నారు. అలా బీజేపీ హంగ్ ఆశలపల్లకీలో ఊరేగుతుంటే.. సర్వేలు మాత్రం వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ కు స్పష్టమైన మెజారిటీ వచ్చే అవకాశాలున్నాయని పేర్కొంటున్నాయి. అదే సమయంలో అధికార బీఆర్ఎస్ స్ట్రాంగ్ గా రెండో స్థానంలో నిలుస్తుందని చెబుతున్నాయి. మొత్తంగా ఇప్పటి వరకూ వెలువడిన రెండు సర్వేలూ కూడా రాష్ట్రంలో బీజేపీ సింగిల్ డిజిట్ కు మించి స్థానాలు సాధించే అవకాశాలు మృగ్యమేనని తేల్చేశాయి. తాజాగా వెలువడిన సీఓటర్ సర్వే కాంగ్రెస్ కు 48 నుంచి 60 స్థానాలు, బీఆర్ఎస్ కు 43 నుంచి 55 స్థానాలు వచ్చే అవకాశం ఉందని పేర్కొంది.
అయితే రెండు పార్టీల మధ్యా ఓ పదిహేసు స్థానాలలో తీవ్రమైన పోటీ ఉండటం వల్లే గెలిచే సీట్ల అంచనాలో గ్యాప్ ఎక్కువ ఉందని సర్వే పేర్కొంది. సరే ఎలా చూసినా తెలంగాణలో సప్పోజ్, ఫర్ సప్పోజ్ హంగ్ వస్తే చక్రం తిప్పే అవకాశం మాత్రం బీజేపీకి ఏ మాత్రం ఉండదన్నది మాత్రం వాస్తవమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 119 స్థానాలున్న అసెంబ్లీలో ఓ తొమ్మిది స్థానాలతో అధికారాన్ని చేపట్టే అవకాశం బీజేపీకి ఇసుమంతైనా ఉండదన్నది వారి విశ్లేషణ. ఈ విశ్లేషణలన్నీ ఇటీవల వెలువడిన రెండు సర్వేల ఆధాకరంగా జరిగినవే.
ఇక ఓట్ల శాతం పరంగా చూసిన బీజేపీ కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు దూరంగా మూడో స్థానంలో నిలిచింది. సీవోటర్ సర్వే మేరకు కాంగ్రెస్ 39 శాతం ఓట్లు సాధిస్తుంది, బీఆర్ఎస్ 37శాతం ఓట్లతో రెండు స్థానానికి పరిమితమౌతే.. బీజేపీ 16 శాతం ఓట్లతో మూడో స్థానంలో నిలుస్తుంది. ఈ నేపథ్యంలో బీజేపీ హంగ్ అంచనా అయితే గియితే నిజమైనా.. అధికారం చేపడతామన్న ఆశలు మాత్రం నెరవేరే అవకాశం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే విమర్శకులు బీజేపీ అగ్రనేత బీఎల్ సంతోష్ చేసిన హంగ్ తప్పదు.. అధికారం మాదే అన్న వ్యాఖ్యల వెనుక మర్మాన్ని ఎత్తి చూపుతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ ఎప్పటి నుంచో ఉన్న భావన వాస్తవమే అనడానికి సంతోష్ వ్యాఖ్యలు నిదర్శనమని అంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారానికి దూరంగా ఉంచడం అనే ఏకైక లక్ష్యంతో బీఆర్ఎస్ ఉద్దేశపూర్వకంగా రాష్ట్రంలో బీజేపీ గ్రాఫ్ పెంచిందని చాలా కాలంగా ఆరోపణలు ఉన్న సంగతి విదితమే. రాష్ట్ర కాంగ్రెస్ నేతలు, మరీ ముఖ్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఈ విషయంపై పలు మార్లు సోదాహరణంగా చెప్పారు.
ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొన్న అందరినీ అరెస్టు చేసిన ఈడీ కవితకు మాత్రం అరెస్టు నుంచి వెసులుబాటు ఇవ్వడాన్ని ఆయన ప్రధానంగా ఎత్తి చూపారు. ఈ నేపథ్యంలోనే బీఎల్ సంతోష్ హంగ్ తధ్యం అధికారం మాదే అన్న మాటను అర్ధం చేసుకోవాల్సి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక పరిశీలకుల అంచనా ప్రకారం రానున్న 50 రోజులలో అంటే ఎన్నికల నాటికి తటస్థ ఓటర్లు కాంగ్రెస్ వైపు పోలరైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చంద్రబాబు అరెస్టు తరువాత బీఆర్ఎస్ పై ప్రజాగ్రహం వ్యక్తం అవుతోందని, ఇంత కాలం ఆ పార్టీకి మద్దతుగా నిలిచిన సెటిలర్లు, తెలుగుదేశం క్యాడర్ అధికార పార్టీకి దూరం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. దానికి తోడు కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు ప్రజల నుంచి సానుకూల స్పందన వ్యక్తం అవుతున్నదని చెబుతున్నారు.