జగన్ ఇక సర్దేసుకుంటున్నారా? | jagan trying to escape| babu| arrest| foriegn| tour| cid| decide| march| election| party| cadre| confidence
posted on Oct 10, 2023 10:58AM
జగన్ సర్దేసుకుంటున్నారా? ఓటమి ఖeయమని నిర్ణయానికి వచ్చేసి.. ఇక తన హయాంలో జరిగిన అక్రమాలతో తనకేమాత్రం సంబంధం లేదని పార్టీ నేతలకు చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారా? ప్రభుత్వ వ్యతిరేకత, ప్రజాగ్రహం పీక్స్ కు చేరిందని గమనించి ప్రజలకు ముఖం చాటేయడానికే నిర్ణయించుకున్నారా? అయినా వచ్చే ఎన్నికలలో విజయం మనదే అని పార్టీ నేతలను క్యాడర్ ను నమ్మించడానికి విస్తృతస్థాయి సమావేశాన్ని వేదికగా చేసుకున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.
అయితే ఆ విస్తృత స్థాయి సమావేశంలో కూడా జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమాలలో చేసే ప్రసంగమే చేయడంతో దీని కోసం ఈ సమావేశం ఎందుకు అంటూ పార్టీ నేతలు ఉసూరుమన్నారు. ఎప్పడూ చెప్పే ఆవుకథకు తోడు ఈ సమావేశంలో జగన్ వచ్చే మార్చిలోనే ఎన్నికలు ఉంటాయనీ, అందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని పిలుపు నిచ్చారు. ఈ నెల 25 నుంచీ డిసెంబర్ వరకూ రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను బస్సు యాత్రలతో చుట్టేయాలనీ, రోజుకు మూడు బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని నేతలకు దిశా నిర్దేశం చేశారు. అయితే ఈ సభలు వేటిలోనూ జగన్ పాల్గొనరు. అసలు తాను బటన్ నొక్కడం తప్ప ఇంకేమీ చేయనని పరోక్షంగా నేతలకు స్పష్టం చేసేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారా అని పార్టీ వర్గాలే సెటైర్లు వేసుకుంటున్నాయంటే.. జగన్ ప్రసంగం వారిని ఎంత ప్రభావితం చేసిందో అర్ధమౌతుంది. ఎన్నికలు సన్నద్ధం కావాలనీ, తాను చేసిన సంక్షేమాన్ని ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ చెప్పిన జగన్ చంద్రబాబు అరెస్టు విషయంలో తనపై వచ్చిన వ్యతిరేకత తీవ్రతతో ఎంత భయపడుతున్నారో కూడా పరోక్షంగా నేతలకు ఎరుకపరిచారు.
దీంతో జగన్ ప్రసంగం నేతలలో ఉత్సాహం నింపడం అటుంచి, వారిలో భయాన్ని ప్రోది చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు తదననంతర పరిణామాలతో జగన్ కంగారు పడుతున్నారనీ, బాబు అరెస్టుతో తనకు ఎటువంటి సంబంధం లేదని చెప్పుకోవడానికి తాపత్రేయపడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే జనమే కాదు, సొంత పార్టీ నేతలు కూడా జగన్ మాటలు నమ్మడం లేదని అంటున్నారు. చంద్రబాబు అరెస్టు గురించి తనకు ఏ మాత్రం తెలియదనీ, తాను లండన్ పర్యటనలో ఉన్న సమయంలో ఆ అరెస్టు జరిగిందని జగన్ పార్టీ విస్తృత సమావేశంలో చెప్పి తనలోని భయాన్ని మరోసారి చాటుకున్నారు. చంద్రబాబు అరెస్టు తరువాత తన విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన జగన్.. ఆ వెంటనే నిర్వహించిన సమీక్షల్లో చంద్రబాబు అరెస్టు గురించి గొప్పగా చాటారు. అరెస్టు చేసిన సీఐడీని అభినందించారు. ఎవరినీ వదలొద్దు.. అంటూ భుజం తట్టారు. దీంతో సీఐడీ చీఫ్ రెచ్చిపోయి తన స్కాన్ లో లోకేష్ సహా ఎవరెవరున్నారో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ ప్రకటించేశారు.
అయితే ఆ తరువాత చంద్రబాబు అరెస్టు వలన వ్యక్తిగతంగా తనకూ, ప్రభుత్వానికీ, పార్టీకీ జరిగిన డ్యామేజీ జగన్ కు అర్ధమైందనీ, అందుకే ఆ అరెస్టుతో తనకు సంబంధం లేదనీ, విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చే వరకూ తనకా విషయమే తెలియదనీ చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టుకు రాష్ట్రంలోనే కాదు, దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతుండటం, రాజకీయాలకు అతీతంగా బాబుకు మద్దతు పెరుగుతుండటం, ఎంతగా నిర్బంధకాండను అమలు చేసినా, రాష్ట్రం మొత్తాన్ని ఆంక్షల వలయంలో నింపేసినా నిరసనలు ఆగకుండా కొనసాగుతుండటంతో జగన్ ఈ అరెస్టు వల్ల రాజకీయంగా జరిగిన నష్టం ఏమిటన్నది బోధపడింది. చంద్రబాబు అరెస్టు తరువాత వైసీపీ గ్రాఫ్ అధ:పాతాళానికి పడిపోయిందన్న సంగతి సర్వేలు చెబుతున్నాయి. ఇక ఇప్పుడు నష్ట నివారణ కోసం జగన్ ఆ అరెస్టుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన చెప్పే మాటలు కనీసం పార్టీ నేతలూ, శ్రేణులే నమ్మడం లేదు. ఇక జనమెలా నమ్ముతారని పరిశీలకులు అంటున్నారు.
చంద్రబాబు అరెస్టు తరువాత పార్టీ నేతల్లో, క్యాడర్ లో ఉత్పన్నమైన ఓటమి భయాన్ని పక్కన పెట్టేందుకే మార్చిలోనే ఎన్నికలు.. సిద్ధం కండి అంటూ పిలుపు నిచ్చారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే ఆ ఎన్నికల సన్నద్ధతకు తాను మాత్రం దూరం అంటూ ముక్తాయించడాన్ని పార్టీ శ్రేణులు జీర్ణించుకోలేకపోతున్నాయి. గతంలో కూడా గడపగడకకూ అంటే తమను జనం ముందు దోషులుగా నిలబెట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రజాగ్రహానికి తమను బలి చేసి ఆయన మాత్రం ప్రగతి భవన్ లో భద్రంగా కూర్చుంటారా? అని అంతర్గత సంభాషణల్లో పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే జనం వై ఏపీ నీడ్స్ జగన్ అని తమను ముఖం మీదే ప్రశ్నిస్తున్నారని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు జగన్ తాను మాత్రం ప్రజల ముందుకు రాను మీరు వెళ్లి వ్యతిరేకతను సానుకూలతగా మార్చండని ఆదేశించడమేమిటని ప్రశ్నించుకుంటున్నారు.