మన పని అయిపోయింది.. వైసీపీ నేతలలో భయం.. భయం! | defeat confirm fear in ycp| balineni| dharmana| cadre| babu| arrest
posted on Oct 10, 2023 9:24AM
మొన్నటి వరకూ సీఎం జగన్ మోహన్ రెడ్డి వైనాట్ 175 అనే నినాదం వినిపించేవారు. సీఎం వైనాట్ 175 అంటుంటే ఆ సంగతెలా ఉన్నా మరో సారి మన పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని వైసీపీ క్యాడర్ నమ్ముతూ వచ్చింది. ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా కాస్త అటో ఇటూ మినిమం అధికారానికి సరిపడా సీట్లు దక్కుతాయన్న అభిప్రాయం వ్యక్తం చేసేవారు. కానీ ఇప్పుడు వారిలో ఆ నమ్మకం లేదు. పరిస్థితి పూర్తిగా తారుమారైంది. దీంతో వైసీపీ నేతలలో భయం మొదలైంది. ఇంకా క్లియర్ గా చెప్పాలంటే.. మనం ఓడిపోవడం ఖాయం కనుక రేపు మన పరిస్థితి ఏంటి అనే టెన్షన్ మొదలైంది.
తెలుగుదేశం గెలిస్తే మన పరిస్థితి ఏంటి అంటూ వైసీపీ నేతలే బాహాటంగా చర్చించుకుంటున్నారు. మొన్న రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఇటీవల ఓపెన్ గా ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. ఆయన తరువాత మాజీ మంత్రి బాలినేని కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతే మన పరిస్థితి ఏంటని కార్యకర్తలను ఉద్దేశించి వీళ్లు ప్రశ్నించారు.
తెలుగుదేశం గెలిస్తే రేపు మన భవిష్యత్ ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించుకోవాలని ఆందోళన వ్యక్తం చేసిన ధర్మాన, బాలినేని క్యాడర్ ను ఒకరకంగా రెచ్చగొడుతూ బ్రతిమాలుకున్నారు. తాము అధికారంలోకి వస్తే వైసీపీ నాయకుల తాట తీస్తామంటూ జనసేన, తెలుగుదేశం నాయకులు ఓపెన్ గానే హెచ్చరికలు జారీ చేస్తున్నారని.. తెలుగుదేశం నిజంగానే అధికారంలోకి వస్తే మనం తట్టుకోలేమని.. పరుగులు పెట్టాల్సిందేనని ధర్మాన, బాలినేని కార్యకర్తలను ఉసిగొల్పే ప్రయత్నం చేస్తున్నారు.
నిజానికి వైసీపీ నేతలలో ఈ భయం ఇప్పటికిప్పుడు వచ్చింది కాదు. గత కొన్ని నెలలుగా వైసీపీ చేయించుకున్న అంతర్గత సర్వే, ప్రశాంత్ కిషోర్ ఐ ప్యాక్ టీం సర్వే, ఇంటెలిజెన్స్ రిపోర్టుతో నే వచ్చే ఎన్నికలలో వైసీపీ ఓటమి ఖాయమని నిర్ధారణ అయింది. ప్రజలలో ఉవ్వెత్తున ఎగసి పడుతున్న ఆగ్రహ జ్వాలలలో మనం కొట్టుకుపోవడం ఖాయమని నిర్ధారణకు వచ్చేశారు. కానీ, ఆ విషయాన్ని దాచి పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ వచ్చారు.
అయితే.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు తర్వాత వైసీపీ నేతలలో గెలుపు ఆశలు పూర్తిగా అడుగంటాయి. దాంతో బరస్ట్ అయిపోతున్నారు. కేడర్ ను రెచ్చగొట్టి అయినా సరే ఓటమి గండం గట్టెక్కాలనుకుంటున్నారు. అయితే చంద్రబాబు అరెస్టుతో తో వైసీపీ క్యాడర్ ఉలిక్కి పడింది. కొందరు నాయకులు, కార్యకర్తలు సంబరాలు చేసుకున్నా ఎక్కువ మందిని ఆలోచనలో పడేసింది. చంద్రబాబు అరెస్ట్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలుగుదేశంతో పొత్తు ప్రకటించడంతో వైసీపీలో ఆందోళన మొదలైంది. తమ ఓటమి ఖరారైందన్న భావనలోకి వచ్చేసిన వైసీపీ నేతలు.. మనసులో మాటను దాచుకోలేక బయటపడిపోతున్నారు.
ఇప్పుడున్న పరిస్థితులు, టీడీపీతో భగ్గుమంటున్న విద్వేష వాతావరణంలో ఓటమిపాలైతే మన పరిస్థితేంటని వైసీపీ క్యాడర్ మధనపడుతోంది. అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా ప్రతీకార చర్యలకు దిగిన వైసీపీకి ఇప్పుడు అధికారం కోల్పోతే తమ పరిస్థితి ఏంటని భయపడుతోంది. కలవర పడుతోంది. ఆ కలవరమే, భయమే వైసీపీ నేతలు, మంత్రుల మాటలతో భయపడుతోంది.
ధర్మాన, బాలినేని లాంటి నేతలు మీడియా ముఖంగా బయటపడ్డారు. కానీ, వైసీపీ నేతలలో ఇప్పుడు అందరిదీ ఇదే భయం. అంతర్గత సంభాషణల్లో కూడా వైసీపీ నేతల ఆందోళన తీవ్ర స్థాయికి చేరింది. ఇన్నాళ్లు అధికారం ఉందని చెలరేగిపోయామని, ఇప్పుడు పరిస్థితి తేడాగా మారగా.. రేపు మనల్ని ఎవరు కాపాడాలని వారిలో వారు చర్చించుకుంటున్నట్లు తెలుస్తుంది. ఎందుకొచ్చిన గొడవ జరిగిందేదో జరిగింది. ఇప్పటి నుండైనా తగ్గి ఉంటే మంచిదనే భావనలో ఇప్పటికే కొంత మంది సైలెంట్ అయిపోయారు. మరికొంత మంది టీడీపీ నేతలతో పరిచయాలు పెంచుకుంటూ వీలయితే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. కొంత మంది మాత్రం కార్యకర్తలను రెచ్చగొడుతున్నారు. టీడీపీ వస్తే బతకనివ్వదని, ప్రాణాలు తెగించి గెలిపించుకుంటేనే రేపు మీ ప్రాణాలు నిలిచేది అంటూ నూరిపోస్తున్నారు. కానీ, కార్యకర్తల నుండి మాత్రం స్పందన రావడం లేదు. నాలుగేళ్ళగా పార్టీ కోసం పనిచేసినా తమకి ఒరిగిందేమీ లేదన్న భావనలో ఉన్న వైసీపీ క్యాడర్ అధికారం ఉన్నా.. లేకపోయినా తమకొచ్చే ఆదాయం ఏదీ లేదు.. జరిగే నష్టం ఏదీ లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారట.