ఒక వైపు గెలుపు ధీమా.. మరో వైపు హంగ్ ఆశలు.. తెలంగాణలో బీజేపీ వ్యూహమేంటి? | bjp win confidence and hung hopes| what| strategy| back| door
posted on Oct 11, 2023 12:05PM
తెలంగాణలో ఎన్నికల నగారా మోగిన తరువాత కూడా అయోమయంలో, గందరగోళంలో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది బీజేపీ మాత్రమే. రాష్ట్రంలో అధికారమే లక్ష్యం అంటూ గత రెండేళ్లుగా అనూహ్య దూకుడు ప్రదర్శించి ఆ తరువాత అంతే అనూహ్యంగా చతికిల పడింది. తెలంగాణలో బీజేపీది బలం కాదు వాపే అని తేలడానికి ఎన్నో రోజులు పట్టలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సైద్ధాంతిక నిబద్ధత, క్రమ శిక్షణ తమ పార్టీ ప్రత్యేకతలుగా చెప్పుకునే బీజేపీ వాటిని తిలోదకాలిచ్చేసి.. తెలంగాణలో అధికారమే లక్ష్యం అంటూ గెలపు గుర్రమైతే చాలు లాగేయండి అంటూ అందు కోసం ఎక్కడా, ఎన్నడూ లేని విధంగా చేరికల కమిటీని కూడా ఏర్పాటు చేసింది.
సరే.. తెలంగాణలో బీజేపీ గూటికి ఇతర పార్టీల నుంచి పెద్ద నాయకులు కూడా వచ్చి చేరారు. అధికార పార్టీతో విభేదించి.. ఆ పార్టీకి రాష్ట్రంలో బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమని భావించి పార్టీలో చేరారు. అయితే బీజేపీలో తొలి నుంచీ ఉన్న వారికీ, కొత్తగా వచ్చి చేరిన వారికీ మధ్య అంతరం మాత్రం రోజురోజుకూ పెరిగిపోతూ వచ్చింది. అది రాష్ట్రంలో బీజేపీ బలంగా భావిస్తున్న పరిస్థితిని కేవలం వాపు మాత్రమేనని తేల్చేసింది. బండి సంజయ్ ను పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించిన క్షణం నుంచీ తెలంగాణలో ఆ పార్టీ గ్రాఫ్ పడిపోవడం ప్రారంభమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బండి సంజయ్ స్థానంల పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు అందుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే బీజేపీలో విభేదాలు భగ్గుమన్నాయి. అసలు తెలంగాణలో బండి సంజయ్ సారథ్య పగ్గాలు చేపట్టిన తరువాతే రాష్ట్రంలో పార్టీ పుంజుకుందని బీజేపీ శ్రేణులే చెబుతాయి. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతలకు బండి సంజయ్ పార్టీని నడిపే విధానంతో వచ్చిన పొరపొచ్చాల కారణంగానే ఆయనకు రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారన్న భావన పార్టీ శ్రేణులలో వ్యక్తం అవుతోంది.
ఇక కిషన్ రెడ్డి పార్టీ రాష్ట్ర అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత చేరికల జోరు తగ్గింది. తగ్గడం అటుంచి చేరికల విషయంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. చీకోటి ప్రవీణ్ బీజేపీ తీర్థం పుచ్చుకునే విషయంలో జరిగిన ఘటనలే ఇందుకు నిదర్శనమనిపరిశీలకులు అంటున్నారు. ఇక అన్నిటికీ మించి మద్యం కుంభకోణంలో కవిత అరెస్టు కాకుండా ఉండటం వెనుక కేంద్రం ఆశీస్సులున్నాయన్న భావన రాష్ట్ర ప్రజలలోనే కాకుండా.. పార్టీ శ్రేణుల్లో కూడా వ్యక్తం అయ్యింది. ఈ విషయంలో పార్టీ రాష్ట్ర నేతలు పలు సందర్భాలలో బహిరంగంగానే తమ అసంతృప్తి వ్యక్తం చేశారు. బీజేపీకి బీ టీమ్ బీఆర్ఎస్ అన్న ఆరోపణలకు కవిత ఎపిసోడ్ బలం చేకూర్చేదిగా ఉందని అధిష్ఠానం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. అయితే రాష్ట్ర నేతల అసంతృప్తిని కమలం హైకమాండ్ ఖాతరు చేయలేదు.
కానీ రాష్ట్రంలో అధికారం మాత్రం బీజేపీదే అని వారికి ధీమా ఇస్తూ వచ్చింది. అయితే రాను రాను పార్టీ రాష్ట్ర నాయకులలో ఆ ధీమా కరవౌతూ వచ్చింది. అదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పుంజుకోవడంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో త్రిముఖ పోరు ఉంటుందన్న అంచనాలు మారిపోయాయి. ఇప్పుడు రాష్ట్రంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ల మధ్య ముఖాముఖీ పోరనన్న పరిశీలకుల విశ్లేషణలకు బలం చేకూర్చేలాగే సర్వేలు కూడా వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలోనే బీజేపీ అగ్రనేతల్లోనే రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై తమ అంచనాలు తప్పాయన్న భావన వ్యక్తం అయ్యింది. అందుకు నిదర్శనమే తెలంగాణలో వచ్చేది హంగే నంటూ ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ చేసిన వ్యాఖ్యలు అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే తాజాగా రాష్ట్ర పర్యటనకు వచ్చిన అమిత్ షా మాత్రం పాత ప్రసంగాన్నే మరింత గొంతు పెంచి చెప్పారు. కేసీఆర్ కుటుంబ అవినీతి, నియంతృత్వ పాలనపై విమర్శలు చేసిన అమిత్ షా విజయంపై వ్యక్తం చేసిన ధీమా పార్టీ శ్రేణుల్లో కనిపిస్తున్న దాఖలాలు లేవు. అయితే బీజేపీ అధికారంపై వ్యక్తం చేస్తున్న ధీమాను పరిశీలకులు మాత్రం తమదైన శైలిలో విశ్లేషిస్తున్నారు. ప్రజా తీర్పును గౌరవించకుండా దొడ్డి దారిన అధికారంలోకి వచ్చే ఎత్తుగడతోనే బీజేపీ తెలంగాణలో రాజకీయం చేస్తున్నదని అంటున్నారు.