Leading News Portal in Telugu

బాబుపై అంబటి, గుడివాడ వ్యాఖ్యలు.. వైసీపీని నిండా ముంచేసినట్లే? | huge loss to ycp| ambati| gudiwada| comments| babu| jagan| hands


posted on Oct 12, 2023 10:29AM

తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ చెరో వైపు నుంచి వైసీపీ సర్కార్ వైఫల్యాలు, జగన్ అరాచకాలను విమర్శలతో చెండాడుతుంటే  తట్టుకోలేక ఉక్కిరిబిక్కిరి అయ్యో, ఓటమి తథ్యమనే భయమో.. లేక లేక ఎలాగూ ఓడిపోతాం అధికారం ఉన్నప్పుడే   కక్ష తీర్చుకోవాలని చేసిందో  ఓమో కానీ తెలుగుదేశం అధినేత చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసి వైసీపీ ప్రభుత్వం పెద్ద తప్పు చేసింది. ఈ అక్రమ  అరెస్టుపై తెలుగు రాష్ట్రాలు, దేశంలోనే కాకుండా  ఖండాలు దాటి కూడా ఖండనలు, నిరసనలు వెల్లువెత్తుతుండటంతో వైసీపీ పెద్దలకు తాము చేసిన తప్పు తెలిసొచ్చింది.

దీంతో సాక్షాత్తు ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని, బీజేపీ మీదకి నెట్టి చేతులు దులుపుకోవాలని ప్రయత్నించారు. సంబంధం లేదని జగన్ చెప్పినా నమ్మే పరిస్థితిలో ఏపీ ప్రజలు లేకపోగా.. తన  ప్రభుత్వంలో ఏం జరుగుతోందో తనకే తెలియదని తనంతట తనే చెప్పుకొని ప్రజలలోనే కాదు.. పార్టీ శ్రేణులలోనూ పలుచన అయ్యారు. ఇంత కాలం తెరవెనుక నుంచే అయినా ఇంత కాలం అన్ని విధాలుగా అండాదండాగా నిలుస్తున్న బీజేపీకి సైతం ఆగ్రహం కలిగింది. ఇంత జరిగినా, స్వయంగా  సీఎం చంద్రబాబు అరెస్టుతో తనకు సంబంధం లేదని చెప్పినా మంత్రులు మాత్రం లేదు లేదు చంద్రబాబు అక్రమ అరెస్టు తమ పనేనని  బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అయితే, ప్రజా సమస్యలపై కనీసం స్పందించని మంత్రులు చంద్రబాబు అరెస్టుపై మాత్రం విరామం లేకుండా ప్రెస్ మీట్లు పెట్టడంపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చంద్రబాబు అరెస్ట్ వైసీపీ కుట్రని తెలుగుదేశం శ్రేణులు బలంగా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా చంద్ర‌బాబు అరెస్టుపై మరోసారి స్పందించిన మంత్రి అంబ‌టి రాంబాబు తెలుగుదేశం ఆరోపణలకు బలం ఇచ్చేలా వ్యాఖ్యలు చేశారు.  అబ్బే తమకు క‌క్ష సాధింపు లేదంటూనే.. “ఏం పీకుతాడు.. ఏం పీకుతాడు.. అని చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు రెండు పీకి సెంట్ర‌ల్ జైల్లో పెట్టాం అంటూ అంబటి బాబుని తమ సర్కారే.. అక్రమంగా, అడ్డగోలుగా అరెస్టు చేసిందని అన్యాపదేశంగానైనా అంగీకరించేశారు. రాజ‌శేఖ‌ర‌ రెడ్డే న‌న్నేం పీక‌లేక‌పోయాడు.. జ‌గ‌నేం పీకుతాడ‌ని చంద్ర‌బాబు అన్నాడు. అందుకే రెండు పీకి జైల్లో పెట్టాం.. నోరు పారేసుకుంటే ఇలానే ఉంటుంది.. ఒళ్లు జాగ్ర‌త్త‌గా పెట్టుకుంటే మంచిది అంటూ అంబ‌టి  చెలరేగిపోయారు. అంబటి వ్యాఖ్యలు చూస్తే చంద్రబాబు అరెస్ట్ కు స్కిల్  కేసు కేవలం సాకు మాత్రమేనని, అసలు విషయం ఆయన జగన్ ను విమర్శించినందుకు కక్షసాధింపుతో చేసిన అరెస్టేననీ స్పష్టంగా అర్ధమౌతోందని  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కాగా, తాజాగా చంద్ర‌బాబు నాయుడు జైల్లో తీవ్ర ఉక్కపోత కారణంగా అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. జైల్లో స‌రైన వెంటిలేష‌న్ లేక‌పోవ‌డం, బ‌య‌ట ఉష్ణోగ్ర‌త‌లు పెర‌గ‌డం, జైలు గ‌దిలో ఏసీ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌క‌పోవడం వంటి కార‌ణాల‌తో చంద్ర‌బాబు  అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యార‌ని స్వ‌యంగా జైలు అధికారులే తెలిపారు. దీనిపై స్పందించిన మంత్రి గుడివాడ అమ‌ర్నాథ్ వెటకారంగా మాట్లాడారు.  చంద్ర‌బాబు ఉన్న‌ది ప్ర‌కృతి వ‌నంలో కాదు.. జైల్లో అన్న సంగ‌తిని ఆయ‌న మ‌రిచిపోయారు  అని మంత్రి గుడివాడ వ్యాఖ్యానించారు. అంతేకాదు, జైల్లో ఉన్న చంద్ర‌బాబు సింప‌తీ కోసం అనారోగ్యం అంటూ త‌న అనుకూల మీడియా ద్వారా ప్ర‌చారం చేయించుకుంటున్నార‌ని ఎద్దేవా చేశారు. మంత్రి గుడివాడ వ్యాఖ్య‌ల‌పై తెలుగుదేశం శ్రేణులే కాదు ప్రజలు కూడా తీవ్ర‌స్థాయిలో మండిపడుతున్నారు. ఆధారాలు లేకుండా జైల్లో నిర్బంధించ‌డ‌మే కాకుండా.. చంద్ర‌బాబు అనారోగ్యంపై కూడా వెటకారంగా మాట్లాడడం వైసీపీ నేతల సైకోయిజానికి నిదర్శనమంటున్నారు.

అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్.. ఇద్దరూ కీలక శాఖలకు మంత్రులు. ఒకరు రాష్ట్రానికి ప్రాణాధారమైన నీటి పారుదల శాఖకి మంత్రి కాగా మరొకరు రాష్ట్రానికి తిండిపెట్టే పరిశ్రమలు, ఉపాధి, ఐటీ శాఖల  మంత్రి. కానీ, ఈ ఇద్దరూ చంద్రబాబు జైల్లో ఉన్న ఈ నెల రోజులలో ఆయా శాఖలకు సంబంధించి ఒక్క మాట మాట్లాడలేదు. ఒక్క రివ్యూ మీటింగ్ లేదు. కానీ, ఈనెల రోజులలో చంద్రబాబు అరెస్టుపై డజనుకుపైగా మీడియా సమావేశాలు నిర్వహించారు. వీళ్ళే జడ్జీల మాదిరి చంద్రబాబు అవినీతి పరుడని గొంతు చించుకోవడం, చంద్రబాబును జైల్లో వేశామని చొక్కాలు చించుకోవడం. ఇప్పటికే చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తీరుపై మండిపడుతున్న ప్రజలు.. మంత్రుల మీడియా సమావేశాలను చూసి చీదరించుకొనే పరిస్థితికి వచ్చారు. దీంతో ఇప్పుడు వీళ్ళు ఎంత ఎక్కువగా చంద్రబాబు అరెస్టుపై మాట్లాడితే వైసీపీకి అంత ఎక్కువ నష్టం వాటిల్లడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.