Leading News Portal in Telugu

మోదీ జగన్ క్విడ్ ప్రో కో! | modi jagan quidproco| ap| debts| financial| anarchy| center| support| progress


posted on Oct 12, 2023 11:19AM

అవసరానికి అప్పుచేయి, తప్పులేదు. అయితే, చేసిన అప్పును సద్వినియోగం చేసుకో… ఆదాయాన్ని పెంచుకునే ఇంధనంగా మార్చుకో … ఆర్థిక వేత్తలే కాదు, అమ్మా నాన్నలు కూడా అదే చెపుతారు. అంతకంటే ముందు, ఆర్థిక క్రమశిక్షణ అలవరచుకో మంటారు.  అనవసర వ్యయాలను,వ్యసనాలను తగ్గించుకో మని హితవు పలుకుతారు. అప్పు చేసి పప్పుకూడు వద్దని, అప్పుల పాలవుతావని పెద్దలు హెచ్చరిస్తుంటారు. 

ఇది కేవలం వ్యక్తులు, కుటుంబాలకు మాత్రమే కాదు. ప్రభుత్వాలకు కూడా వర్తిస్తుంది. అయితే  ఆంధ్రుల దురదృష్టం అదేమో కానీ  ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అదుపు తప్పి అప్పుల మీద అప్పులు చేస్తోంది. ఎఫ్ఆర్బీఎం పరిమితి దాటి ఇంకా ఇంకా అప్పులు చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం కళ్ళు మూసుకుని  అనుమతులు ఇచ్చేస్తోంది. ఇదేమిటని ప్రశ్నించడం లేదు. అంతేకాదు  ఇంకా ఇంకా అప్పులు చేయమని ప్రోత్సహిస్తోంది. అడిగిందే తడవుగా కాదు కాదు అడగక ముందే కొత్త అప్పులకు అనుమతులు ఇచ్చి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా చేయడంలో కేంద్రం రాష్ట్రానికి ఇతోధిక సహాయ సహకారాలు అందిస్తోంది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం తాజాగా  ఆర్బీఐ బాండ్ల వేలం ద్వారా ఏడున్నర శాతం వడ్డీకి  మరో రూ. 450 కోట్లు అప్పు చేసింది. ఇదిగాక, కార్పొరేషన్ల ద్వారా మరో రూ. 23వేల కోట్లు .. ఇలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లోనే రూ.67 వేల 500 కోట్లు అప్పు చేసింది. అయినా ఇంత  వరకూ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు పడలేదు.  ఇలా కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర అప్పులు పెంచుకుంటూ పోతోంది. అంతే కాదు ఉద్యోగులకు సకాలంలో జీతాలివ్వాలన్న స్ఫృహ కూడా లేకుండా వ్యవహరిస్తోంది. 

ఫలితంగా వైసీపీ ప్రభుత్వ నాలుగున్నరేళ్ల పాలనలో  కేంద్రంలోని జగన్ ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల ప్రదేశ్ గా మార్చి వేశారు. అభివృద్ధి కుంటుపడింది.కుంటు పడడం కాదు అడుగంటి  కనిపించకుండా పోయింది. కాగితాల మీద మాత్రమే కనిపించే అభివృద్ధి నిధులు, బడ్జెట్ కేటాయింపులు, వాస్తవంలో వడ్డీల చెల్లింపు ఖాతాలలో చేరి పోతున్నాయి. ఈ నాలుగున్నరేళ్లలో పట్టాలు తప్పి పరుగులు తీస్తున్న  జగన్ పాలనలో  అప్పులపై అసలు, వడ్డీ చెల్లింపులు రెట్టింపయ్యాయి. మూలధన వ్యయం  పూర్తిగా పడకేసేసింది.రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు 100శాతం సొమ్ము రాష్ట్రమే భరించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలైతే 50 నుంచి 90 శాతం ఖర్చు కేంద్రం భరిస్తుంది. మిగిలింది మాత్రమే రాష్ట్రం భరించాలి. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇచ్చే అవకాశం ఉంది.  కానీ రాష్ట్ర వాటా చెల్లించే పరిస్థితి లేక రాష్త్రం పెద్ద మొత్తంలో కేంద్ర నిధులను కోల్పోతోంది. ఫలితంగా, అప్పులు పెరిగి, ఆదాయం తరిగి  అప్పులపై కట్టే వాయిదాలు రెండింతలు పెరిగాయి. 

ముందే అనుకున్నట్లుగా తెచ్చిన అప్పులు రాష్ట్రానికి ఆదాయం తెచ్చిపెట్టే పనులు, ప్రాజెక్టుల కోసం ఖర్చు చేస్తే, అంతో ఇంతో అభివృద్ధి జరిగేదే. కానీ  అప్పు తెచ్చిన లక్షల కోట్లను జగన్‌ వ్యక్తిగత ప్రతిష్ఠను పెంచుకోవడం కోసం బటన్ లు నొక్కేందుకే ఉపయోగించుకున్నారు.   ఈ అప్పులు, వడ్డీల చెల్లింపుల వల్ల రాష్ట్రానికి నష్టం జరిగినా సరే  ఖాతరు చేయడం లేదు.  ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలకు రివర్స్ పాలనను రిటర్న్ గిఫ్ట్ గా ఇచ్చారు.  

టీడీపీ హయాంలో చివరి ఏడాది 2018-19లో కేంద్ర ప్రభుత్వ పథకాలకు మ్యాచింగ్‌ డబ్బు ఇవ్వడం కోసం నిర్ణయించిన బడ్జెట్‌ కేటాయింపుల్లో 70.34 శాతాన్ని ఖర్చుచేశారు. కాగ్‌ నివేదిక ప్రకారం, 2022-23 ఆర్థిక సంవత్సరంలో జగన్‌ సర్కారు.. కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం చేసిన బడ్జెట్‌ కేటాయింపుల్లో ఖర్చు చేసింది 55 శాతం మాత్రమే. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గడచిన ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వం పేపర్‌పై వేసిన గణాంకాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వ పథకాల కోసం రాష్ట్రం ఇచ్చిన మ్యాచింగ్‌ డబ్బు కేవలం 43.51 శాతమే. ఇందులో చాలావరకు వాస్తవిక ఖర్చు కంటే పీడీ ఖాతాలకు చేసిన సర్దుబాట్లే ఉంటాయి. కాబట్టి, ఈ ఆరు నెలల్లో కేంద్ర పథకాల కోసం జగన్‌ ప్రభుత్వం చేసిన ఖర్చు 43.51 శాతం కంటే కూడా తక్కువగా ఉంటుందని ఆర్థిక రంగ నిపుణులు చెపుతున్నారు. 

అంటే, రాష్ట్ర ప్రభుత్వం అప్పులు పెంచుకునేందుకు కేంద్రం ఉదారంగా అనుమతులు మంజూరు చేస్తే.. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పథకాలకు మ్యాచింగ్ గ్రాంట్ సమకూర్చుకోలేక కేంద్రం వాటాను వదులుకుని కేంద్రం ఖర్చులు తగిస్తోంది. ఒక విధంగా చూస్తే.. కేంద్ర రాష్ట్ర త్వాల  మధ్య  జగన్ రెడ్డి మార్క్  క్విడ్ ప్రో కో  వ్యవహరం నడుస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంటే  కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ,  రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీలు  బానే ఉన్నాయి. అయితే  మోడీ, జగన్ చాటు మాటు వ్యహరాలతో రాష్ట్రం వందల ఏళ్ళు వెనక్కి పోతోంది. నిజానికి, తప్పు చేయడమే కాదు, తప్పును సమర్ధించడం కూడా నేరమే అవుతుంది. అందుకే  ఈరోజు ఆంధ్ర ప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకు పోయేలా చేసిన  జగన్ రెడ్డి ఆర్థిక నేరస్థుడు అయితే  అ నేరంలోమోడీకీ వాటా ఉందని పరిశీలకులు అంటున్నారు.