కాషాయ దళం.. నీతుల మాటున రోత రాజకీయం? | bjp crucked politics behind morals| modi| shah| jagan| babu| arrest| corruption
posted on Oct 12, 2023 5:59PM
కాషాయ దళం నీతుల మాటున రోత రాజకీయం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ కన్నా తాము విలక్షణమైన రాజకీయ పక్షంగా ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన కమలనాథులు కాంగ్రెస్ కంటే ఎక్కువగా మురికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు. మోదీ పాలన పదేళ్లుగా ఆసాంతం అసత్యమేవ జయతే అన్న రీతిలో సాగింది.మోదీ మాటల్లో ఉన్న నీతి, నిబద్దత, నిజాయితీ చేతల్లో లేదని రుజువైంది. అవినీతి అంతం నా పంతం అని ప్రగల్భాలు పలికి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన అవినీతిపరులతో చేతులు కలిపి రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చు కొంటుంన్నారు. ఆర్ధిక నేరస్తుల అంతుచూస్తానని బూటకపు వాగ్దానంతో దేశ ప్రజల్ని బురిడి కొట్టించారు. ఆర్దిక నేరస్తులకు, కార్పొరేట్ వర్గాలకు చౌకీదారుగా మోదీ వ్యవహరిస్తున్నారు తప్ప దేశ ప్రయోజనాలకు మాత్రం కాదు. తాము అధికారంలోకి వస్తే చట్టసభలకు ఎన్నికైన నేరచరితుల ప్రమాణ పత్రాలను సుప్రీం కోర్టుకు అందించి ఆయా కేసులపై సత్వర విచారణ జరిపి ఏడాదిలోగా తీర్పు వెల్లడించాలని కోరుతామని 2014ఎన్నికల ప్రచారంలో మోదీ ఇచ్చిన హామీ ఏమయింది? మీ రాజకీయ అవసరాల కోసం ఎన్ని వేలకోట్లు ప్రజాధనం లూటీ చేసినా వెనుకేసుకొస్తారా? ఇదేనా అవినీతి నిర్మూలన? ఇదేనా ఆర్ధిక నేరగాళ్ల భరతం పట్టడం? ఇదేనా మోదీ సత్య సంధత? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఆర్ధిక నేరగాళ్లను నిరపరాధులుగా తీర్మానించే దుష్ట రాజకీయం మోదీ పాలనలో కొత్త కోరలు తొడుక్కుంది. దేశంలో తనకు అనుకూలమైన ఆర్ధిక నేరగాళ్ళు బోరవిరుచుకుని తిరిగే సౌలభ్యం కలిగిస్తున్నారు మోదీ. అది మరిన్ని నేరాలకు దారితీసే ప్రమాదముందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు
నీతుల మాటున రోతరాజకీయాలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని అడ్డదారులు తొక్కుతు అనైతిక పద్దతులు అవలంబిస్తున్నారు. మోడీ పాలనలో దేశ ప్రజాస్వామ్యానికి చీకట్లు కమ్ముకొన్నాయి.14 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా వున్న చంద్రబాబు పై ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమ కేసు పెట్టి జైలులో పెట్టడం వెనుక కేంద్ర ప్రభుత్వం పాత్ర ఉండని దేశమంతా కోడై కూస్తున్నది. చంద్రబాబు పై ఎందుకoత అక్కసు వెళ్లగక్కుతున్నారో అర్ధం కావడంలేదు. చంద్రబాబు చేసిన నేరం ఏమిటి? గతంలో రాష్ట్ర హక్కుల కోసం, రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని నిలదీయడమేనా చంద్రబాబు చేసిన నేరం? బిజెపి తమ భావజాలం వదిలిపెట్టి జగన్ భావజాలం వంటపట్టించుకొని వికృతంగా వ్యవహరిస్తున్నదని ప్రజలే అంటున్నారు. చంద్రబాబు అక్రమ అరెస్టు వెనుక బిజెపి, వైసిపి ఆడుతున్న నాటకం ప్రస్పుటం అవుతున్నది. అడ్డదారిలో చంద్రబాబును బంధించి అధికారంలోకి రావడం కొరకు బిజెపి, వైసిపి లు సిద్ద పడినట్లు కనిపిస్తుంది. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు అధికారాన్ని అడ్డుకొనేందుకు మహా కుట్రల సిద్దాంతాన్ని బిజెపి-వైసిపి ప్రయోగించారు. గతంలో ప్రజాస్వామ్య సంప్రదాయాల పరిరక్షణకు నిరంతరం పనిచేసిన చరిత్ర బీజేపీదని, ప్రజాస్వామ్య వ్యవస్థల స్వేచ్చా స్వాతంత్ర్యంల పరిరక్షణలో తమ క్రియాశీల పాత్రను అద్వాణీ ఆ మధ్య గుర్తు చేసారు. విలక్షణ రాజకీయ పక్షంగా బీజేపీని నిలబెట్టే క్రమంలో తాము పెంచి పోషించిన విలువలకు వలువలు ఊడతీస్తున్నారని అద్వాణీ ఆవేదన చెందారు. సమకాలీన రాజకీయపక్షాల పట్ల శతృత్వ భావన పోవాలని, ప్రజాస్వామ్య విలువలు పెంపొందించుకోవాలని, రాజ్యాంగ వ్యవస్థల ఔన్నత్యాన్ని నిలబెట్టాలని అద్వాణీ హితబోధ చేసారు. రాజకీయంగా విభేదించే వారిని శత్రువులుగా చూడరాదని అద్వాణీ అనడం మోదీ పెడ ధోరణికి, నియంత మనస్తత్వానికి అద్దం పడుతుంది. దీనిని బట్టి మోదీ ఎంత ప్రమాదకారో అడ్వాణి ప్రకటనలను బట్టి అర్ధం అవుతుంది. అధికారంలో కొనసాగడానికి అనైతిక పద్ధతులు అవలంబిస్తూ మురికి రాజకీయాల్లో మునిగి తేలుతున్నారు కమలనాధులు.
ఎటువంటి ఆధారాలు లేకుండా నిరపరాధి, 73 ఏళ్ల చంద్రబాబును అత్యంత దారుణాతి దారుణంగా వేధిస్తూ అరెస్టు చేసి అర్ధరాత్రి రాజమండ్రి జైలులో బంధించి 30 రోజులు దాటినా కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఖండించేందుకు నోరు తెరవ లేదంటే వారి వ్యూహం ఏమిటో పక్కాగా అర్ధం అవుతున్నది. తెలంగాణా ప్రభుత్వం జగన్ చెల్లెలు షర్మిలను అరెస్టు చేస్తే తెల్లవారి పాటికి ఫోన్ చేసి పరామర్శించిన ప్రధాని మోడీ, 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 45 ఏళ్ల రాజకీయ చరిత్ర వున్నచంద్రబాబు ను అరెస్టు చేస్తే ఖండించలేదంటే మోడీ ,షా ఎంత విద్వేషంతో వున్నారో అర్ధం అవుతున్నది. వారికి సంబంధలేక పోతే చంద్రబాబుని అరెస్టు పై ఎందుకు మాట్లాడరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.1999 నుండి 2004 వరకు 29 మంది ఎంపీలతో చంద్రబాబు కేంద్రానికి మద్దతు ఇవ్వక పొతే కేంద్రంలో బిజెపి ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో కొనసాగేదా? చంద్రబాబు బీజేపీకి చేసిన ద్రోహం ఏమిటి? కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన హామీలు నెరవేర్చమని చంద్రబాబు గట్టిగా అడగడమే చంద్రబాబు చేసిన నేరమా? రాష్ట్రాలలో తమ ప్రభుత్వాలు అయినా వుండాలి. లేకుంటే తమ కనుసన్నల్లో నడిచే, తమ అడుగులకు మడుగులోత్తే ప్రభుత్వాలు అయినా వుండాలి ఇదీ బిజెపి లక్ష్యం గా కనిపిస్తున్నది. ప్రధాని మోడీకి అందరు అవినీతి పరులుగా కనిపిస్తారు. కానీ బిజెపికి మద్దతు ఇచ్చే వారు ఎన్ని కోట్ల రూపాయల అవినీతికి పాల్పడినా వారి అవినీతి కనిపించదు. వారి గురించి మాట్లాడరు. ప్రధాని మోడీ దృష్టిలో వారు అవినీతి పరులుకారు. బిజెపికి మద్దతుగా నిలిచేవారు నీతి మంతులే. బిజెపిని వ్యతిరేకించే వారుఅందరూ అవినీతి పరులే. అధికారం కోసం, రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను అక్కున చేర్చుకోవడాన్ని ఏమనాలి? ప్రధాని మోదీ అవినీతిపరుడు కాక పోవచ్చు.. కానీ రాజకీయ అవసరాల కోసం అవినీతి పరులను ఆదరించడం అవినీతి పరులను కాపాడటం కూడా అవినీతి కిందికే వస్తుంది. అత్యంత అవినీతి పరుల విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రదర్శిస్తున్న ఔదార్యం దేనికి సంకేతం? రాజకీయంగా తమకు మద్దతు ఇవ్వని ప్రతిపక్ష నాయకుల పట్ల అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న కేంద్ర ప్రభుత్వం, ఎందుకు భయంకరమైన అవినీతి కేసుల్లో పీకల్లోతు కూరుకుపోయిన వారిపై డజన్లు కొద్ది సీబీఐ కేసులు నమోదై పన్నెండు ఏళ్ళు దాటినా ముందుకు పోకుండా అడ్డుకుంటున్నది. 2019 ఎన్నికల్లో అత్యంత అవినీతి పరుడు జగన్ గద్దె నెక్కడానికి మద్దతుగా నిలిచింది బిజెపి ? నేడు రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నా అండగా నిలిచింది బిజెపి. ప్రతిపక్షం తెలుగు దేశాన్ని అణచివేసే భాధ్యతను వైసీపీ కి అప్పగించింది బిజెపి అధిష్టానం. అందుకే అరాచక పాలన చేస్తూ,అక్రమ కేసులు పెడుతూ, ప్రతిపక్షం సభలను,రోడ్ షోలను అడ్డుకొంటూ నిర్భందించడం అందులో భాగమే. కేంద్రం అండదండలు లేకుండా జగన్ ఇంత నిరం కుశంగా పాలన సాగించలేరు. జగన్ భుజం పై తుపాకి పెట్టి తెలుగుదేశాన్ని కాల్చాలని చూస్తున్నది బిజెపి అధిష్టానం.ముందు చంద్రబాబుని దెబ్బతీస్తే, జగన్ రెడ్డిని ఎప్పుడైనా దెబ్బతీయవచ్చని బిజెపి ఆలోచన. జగన్ రెడ్డి వేదింపులు,ప్రతీకారం తట్టుకోలేక చంద్రబాబు తమ వద్దకు వచ్చి లొంగి పోవాలని బిజెపి భావిస్తున్నది. అందుకే రాష్ట్రంలో ఫాసిస్టు పాలనకు అండగా నిలుస్తున్నది బిజెపి.
బిజెపి -వైసీపీ మధ్య క్విడ్ -ప్రోకో ఒప్పం జరిగింది. చట్టం ముందు అందరు సమానమే అన్న సూక్తి జగన్ విషయంలో ఎందుకు అమలు కావడం లేదు? రాజకీయ అవసరాల కోసమే జగన్ పై ఈగ వాలనీయడం లేదు.కేంద్ర ప్రభుత్వ పంజరంలో చిలుక లా వ్యవహరిస్తూ ప్రధాన కేసులను సీబీఐ నీరు కారుస్తున్నది. ఈ డీ,సీబీఐ కేసులే కాదు బాబాయి వివేకా హత్య కేసులలోనూ అండగా నిలుస్తున్నది బిజెపి..వివేకానంద రెడ్డి హత్యకు కారకులు ఎంపీ అవినాష్ రెడ్డి,ఆయన తండ్రి బాస్కర్ రెడ్డి అని సీబీఐ చార్జి షీట్ లో నిర్ధారించింది.అవినాష్ రెడ్డిని అరెష్టు చేయాలని సీబీఐ అధికారులు అనుకొన్నా అది జరగ లేదంటే ఇందులో కూడా కేంద్ర పెద్దల సూచనల మేరకే సీబీఐ వ్యవహరించింది .కేంద్రం తో జగన్ అనుభంధ ఫలితమే అని చెప్పాలి . పీకల్లోతు అవినీతి కేసులు నుండి జగన్ బయట పడాలి అంటే కేంద్ర బిజెపి పెద్దల చల్లని చూపు అవసరం. రాష్ట్రానికి కేంద్రం ఏమి ఇవ్వక పోయినా జగన్-కేంద్రప్రభుత్వంతో పోరాడే పరిస్తితి లేక రాష్ట్ర ప్రయోజనాలే తాకట్టు పెట్టారు.కేంద్రం రాష్ట్రానికి న్యాయం చెయ్యక పోగా,రాష్ట్రాన్ని అన్నీవిధాలా నాశనం చేస్తున్న జగన్ కేంద్రానికి ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తున్నారు.
ఎటువంటి ఆధారాలు లేకుండా అక్రమంగా చంద్రబాబుని అరెస్టు చేసిన జగన్ ప్రభుత్వానికి బిజెపి అండగా నిలవడం అత్యంత దుర్మార్గం. బిజెపికి అండగా నిలిచిన వారు,మద్దతు ఇచ్చిన వారు ఎంత అవినీతికి పాల్పడినా పర్వాలేదు. వారికి మద్దతు ఇస్తున్న అవినీతి పరులందరు నిర్దోషులని ప్రధాని మోదీ నమ్ముతున్నారు? అలా భావిస్తే ఆ మాటే ప్రజలకు చెప్పండి, మీకు మద్దతు ఇస్తున్న జగన్ పై వున్న కేసులు ఎత్తి వెయ్యండి? ఒక పక్క అవినీతి ఆరోపణలు ఉన్నవారి పట్ల ఉదాసీనత చూపిస్తూ,మరో పక్క ప్రతిపక్షాలు అవినీతిపరులని చేస్తున్న ఆరోపణలకు విలువ ఉంటుందా?బీజేపీ ప్రభుత్వాలు అధికారంలో వున్న రాష్ట్రాల్లో మంత్రులుగా ఉన్నవారు అవినీతికి పాల్పడినా, ఆ యా రాష్ట్రాల్లో బిజెపి వారి పై అవినీతి ఆరోపణలు వచ్చినా మంత్రులపై సీబీఐ, ఈడీ అధికారుల దాడులు జరగనే జరగవు, వారి పై ఈగ కూడా వాలదు. అదే ఇతర రాజకీయ ప్రభుత్వాల మంత్రులు పై ఆరోపణలు రావడమే ఆలస్యం వారి ఇళ్ల పై సీబీఐ, ఈడీ అధికారులు వాలిపోతారు.అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు బిజెపిలో జాయిన్ అవగానే పవిత్రులుగాను, అవినీతి ఆరోపణలు వచ్చిన వారు బీజేపీలో చేరకుంటే అవినీతి పరులుగా చూపిస్తున్నారు. ఇంతటి వ్యత్యాసం చూపుతున్నప్పుడు ప్రధాని మోదీ చెబుతున్న సుభాషితాలకు విలువ ఏమి ఉంటుంది?అధికారంలోకి రాగానే రాజకీయ నాయకుల పై వున్నఅవినీతి కేసుల లెక్క తేలుస్తామని,విచారణ వేగంగా పూర్తీ చేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని 2014 ఎన్నికల ప్రచార సభల్లో మోడీ హామీ ఇచ్చి పదేళ్ళు కావస్తుంది. మరి పదేళ్లుగా అవినీతి పరులు పై ఈగైనా వాలిందా?అవినీతి పరుల అంతు చూసే బలం,చేవ,ధైర్యం,సమర్ధత ఉండి కూడా చర్యలు తీసుకోక పోవడంలో ఆతర్యం ఏమిటి? 2014 ఎన్నికల్లో అధికారం ఇస్తే అచ్చే దీన్ తెస్తాను అన్నారు. మీరు అధికారంలోకి వచ్చాక ఆర్ధిక నేరస్తులకే అచ్చే దీన్ వచ్చింది నిజం కాదా?
ఆర్ధిక నేరగాళ్ల అంతు చూడటమే నా పంతం అని ప్రగల్భాలు పలికి ఎల్లలెరుగని అవినీతికి పాల్పడిన ఆర్ధిక నేరస్తులను అక్కున చేర్చుకొన్నారు. జగన్ అవినీతి కేసులు ఎన్నేళ్లకు తెములుతాయో చెప్పగల నాధుడు లేడు. న్యాయస్థానాల ఆదేశాల మేరకు విచారణ జరుగుతున్న కేసుల్లో కూడా సత్వరం దోషులకు శిక్షలు పడతాయనుకొనే వీలులేకుండా పోయింది. ఆర్ధిక నేరస్తుల పై వున్న కేసులను ఏడాదిలోగా విచారణ పూర్తి చేసి శిక్షలు పడే విధంగా చూడాలని దేశ సర్వోన్నత న్యాయ స్థానం అభిప్రాయ పడింది. ప్రభుత్వ సహకారంతో వేలకోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వారిపై విచారణ జరిగే తీరు ఇదేనా? టన్నులు కొద్దీ పత్రాలు సాక్షాధారాలు వున్న కేసుల విచారణ నత్తనడక నడవడంలో ఔచిత్యం ఏమిటి? వేలకోట్ల ప్రజాధనం దోపిడీ చేసిన వారి పట్ల కేంద్రప్రభుత్వం, సీబీఐ ఉదాసీనంగా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటి?మేం అధికారంలోకి రాగానే రాజకీయ నాయకులపై వున్న అవినీతి కేసుల లెక్క తేలుస్తాం,విచారణ వేగంగా పూర్తిచేసి రాజకీయాలను ప్రక్షాలన చేస్తామని ప్రధాని నరేంద్రమోదీ 2014 ఎన్నికల ప్రచార సభల్లో వల్లించిన ఘన ఆదర్శాలు గాలికి పోయాయి.మోడీ పాలనలో ఆర్ధిక నేరస్థుల పై ఈగైనా వాలక పోగా అపూర్వ వైభవంతో వెలిగిపోతున్నారు. అధికారంలోకి వస్తే ఆర్ధిక నేరస్థుల అంతు చూస్తానని ఇచ్చిన హామీ కూడా నేతి బీర చందమైంది..దేశ ప్రజాస్వామ్యాన్ని నాశనం చెయ్యడానికి మోడీ చెయ్యని దుర్మార్గం లేదు. అవినీతిపరులను అంతుచూస్తానని బూటకపు వాగ్దానంతో బురిడి కొట్టించి అధికారంలోకి వచ్చి అవినీతి పరుల మోచేతి నీళ్ళు తాగుతున్నారు.అవినీతి పరులు బోరవిరుచుకు తీరుతుంటే,శాసన నిర్మాతలై వెలిగిపోతుంటే ప్రధానికి కనిపించడం లేదా?ఆర్దిక నేరస్తులకే చౌకీదారుగామోదీ వ్యవహరిస్తున్నారు తప్ప దేశ ప్రజలకు మాత్రం కాదు. నీతులు మాటున రోతరాజకీయాలు చేస్తూ తిరిగి అధికారంలోకి రావాలని అడ్డదారులు తొక్కుతు అనైతిక పద్దతులు అవలంభిస్తున్నారు కాషాయదళం.
నీరుకొండ ప్రసాద్