తెలంగాణలో షర్మిల పార్టీ పరిస్థితి ఏంటి? | ysrtp in telangana nominal| merger| praposal| congress| ap| politics| revanth
posted on Oct 12, 2023 2:46PM
ఏపీ కాంగ్రెస్ పగ్గాలు చేపట్టడమే తారువాయి అనుకున్న వైఎస్ షర్మిల పరిస్థితి నిస్సందేహంగా దయనీయంగా మారింది. ఆమె రాజకీయాలకు ఇక ఫుల్ స్టాపేనా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అసలు ఆమె తెలంగాణలో రాజకీయం ప్రారంభించినప్పుడే.. చాలా మందిలో చాలా చాలా అనుమానాలు వ్యక్తం అయ్యాయి. సాటి తెలుగు రాష్ట్రం ఏపీలో ఆమె సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయనకు ఆ పదవి దక్కడంలో షర్మిల పాత్రను విస్మరించడం సాధ్యం కాదు. అక్రమాస్తుల కేసులో అన్న జగన్ జైలులో ఉండగా ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది.
అప్పట్లోనే ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే,ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం నడిచేశారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేసి ఆమె బాటలో ఆమె రాజకీయంగా అడుగులు వేశారు. తెలంగాణలో ఆమె అధికార పార్టీ బీఆర్ఎస్ పైనా, ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కుమారుడు కేటీఆర్, కుమార్తె కవితపై ప్రధాన ప్రతిపక్షాలుగా ఉన్న బీజేపీ, కాంగ్రెస్ ల కంటే దూకుడుగా విమర్శలు గుప్పించారు. దీంతో ఆమె తెలంగాణలో ఎవరు వదిలిన బాణం అన్న చర్చ అప్పట్లో విస్తృతంగా వచ్చింది. విపక్ష ఓట్లను చీల్చేందుకు జగన్ ఆశీస్సులతో కేసీఆర్ కోసం ఆమె తెలంగాణలో రాజకీయ అరంగేట్రం చేశారా అన్న అనుమానాలూ కూడా అప్పట్లో వ్యక్తం అయ్యాయి.
అయితే తరువాత తరువాత ఆమె సొంతంగా తెలంగాణలో రాజకీయ శక్తిగా నిరూపించుకునే ప్రయత్నంలో ఉన్నట్లు కనిపిస్తోందని కూడా పరిశీలకులు విశ్లేషణలు చేశారు. అయితే ఎప్పుడైతే తన వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి తహతహలాడారో అప్పుడే తెలంగాణలో ఇక సొంత గుర్తింపు అన్న ప్రశ్నే లేకుండా పోయింది. అప్పటి వరకూ ఆమె నడిచిన రాజకీయ నడకకు అర్ధం లేకుండా పోయింది. ఆమె కాంగ్రెస్ విలీనం అంశం తెరమీదకు రాగానే.. కాంగ్రెస్ పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయ్యింది. తెలంగాణలో ఆమె రాజకీయం చేస్తు అంగీకరించేది లేదని పార్టీ సీనియర్లు కుండబద్దలు కొట్టేశారు. ఇదే విషయాన్ని అధిష్ఠానానికి కూడా ఎరుక పరిచారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే తాను పార్టీ అధ్యక్షుడిగా ఉన్నంత వరకూ షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడానికి అంగీకరించేది లేదని విస్ఫష్టంగా ప్రకటించారు. కావాలంటే పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఆమె ఏపీలో పని చేస్తే అభ్యంతరం లేదనీ, ఏపీ పీసీసీ పగ్గాలు చేపట్టినా స్వాగతిస్తానని తేల్చేశారు. ఇంకా వీహెచ్ వంటి సీనియర్లు కూడా షర్మిల తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణలో వైఎస్ షర్మిలకు ఏం పని అంటూ తీసి పారేశారు.
అయితే హై కమాండ్ వైఎస్ ఇమేజ్ అంటూ షర్మిల కాంగ్రెస్ ప్రవేశానికి దాదాపు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. అయితే తెలంగాణ సెంటిమెంట్ కారణంగా ఆమె పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసినా ఆమె ఏపీలో పని చేయాలన్న షరతు విధించారని కాంగ్రెస్ వర్గాలు అప్పట్లో చెప్పాయి. అయితే షర్మిల మాత్రం తన కార్యక్షేత్రం తెలంగాణ మాత్రమేనని పట్టుబట్టారని అంటున్నారు. ఒక దశలో ఆమె కాంగ్రెస్ ఏపీ ప్రతిపాదనను అంగీకరించినట్లు కనిపించినా.. అది తన సోదరుడు, ఏపీ సీఎం జగన్ తో ఉన్న ఆస్తి పంపకాలను సెటిల్ చేసుకునేందుకేననీ, ఒక సారి అవి సెటిల్ అయిపోయిన తరువాత ఆమె తాను తెలంగాణకే పరిమితమౌతానని కాంగ్రెస్ హై కమాండ్ కు స్పష్టం చేయడంతో విలీనం ప్రక్రియకు తెరపడిందని అంటున్నారు. వైఎస్సార్టీపీ విలీనం వార్తలతో అప్పటిదాకా షర్మిల పార్టీకి అంతో కొంతో ఉన్న బలం కూడా ఆవిరైపోయింది. దీంతో ఆమె పార్టీ ప్రస్తుతం తెలంగాణలో ఉనికి మాత్రంగానే మిగిలిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
దీంతో ఇప్పుడు ఆమె పార్టీ తరఫున పోటీకి అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితుల్లో పడ్డారు. తన తల్లి విజయమ్మను కూడా రంగంలోకి దింపుతున్నారు. పాలేరు, లేదా సికిందరాబాద్ నియోజకవర్గాలలో ఏదో ఒక స్థానం నుంచి విజయమ్మ వైఎస్సార్టీపి అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇక షర్మిల పాలేరు, మిర్యాలగూడలలో ఒక స్థానం నుంచి కానీ, రెండింటి నుంచి కానీ పోటీ చేసే అవకాశాలు ఉన్నాయంటున్నారు. మొత్తం మీద షర్మిల పోటీ తెలంగాణలో నామమాత్రంగానే ఉంటుందనీ, తెలంగాణ ఎన్నికల అనంతరం మళ్లీ షర్మిల పార్టీ కాంగ్రెస్ లో విలీనం ప్రతిపాదన తెరమీదకు వస్తుందనీ, అప్పుడు కూడా ఆమె వైఎస్ బ్రాండ్ తో ఏపీలో ప్రచార బాధ్యతలు చేపట్టేందుకు అంగీకరిస్తేనే విలీనం ప్రతిపాదనకు కాంగ్రెస్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉంటాయనీ లేకుంటే.. ఉనికి మాత్రపు పార్టీగా షర్మిల వైఎస్సార్టీపీ తెలంగాణలో కొనసాగాల్సి ఉంటుందని చెబుతున్నారు.