చంద్రబాబుకు అస్వస్థత.. జైలుకు వైద్యుల బృందం | babu fell ill| doctors team to jail| skill| case| jagan| government| heat
posted on Oct 13, 2023 7:20AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి అస్వస్థతకు గురయ్యారు. రెండు తెలుగు రాష్ట్రాలలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండడం.. రాజమహేంద్రవరంలో ఎండలు మరీ ఎక్కువగా ఉండటం ఉక్కపోత కారణంగా చంద్రబాబు అలర్జీకి గురయ్యారు. జైలు అధికారులకు చంద్రబాబు తన సమస్యను వివరిస్తూ సమాచారం ఇవ్వటంతో అధికారులు రాజమండ్రి ప్రధాన ఆస్పత్రికి సమాచారం ఇచ్చారు. దీంతో గురువారం సాయంత్రం ఆస్పత్రి నుంచి ప్రత్యేక వైద్యుల బృందం రాజమండ్రి సెంట్రల్ జైలుకు వచ్చింది. తీవ్ర ఎండ వేడిమి, ఉక్కపోత కారణంగా ఆయన అలర్జీతో ఇబ్బంది పడుతున్నట్టు ధృవీకరించిన వైద్య బృందం చంద్రబాబుకు ప్రత్యేకంగా కేటాయించిన బ్యారక్ లోనే చికిత్స అందిస్తున్నారు.
కాగా, ఇది వరకే చంద్రబాబు సతీమణి ఆయన ఆరోగ్యం గురించి ప్రస్తావిస్తూ ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు రోజూ వేడినీటితో స్నానం చేస్తారని, కానీ జైల్లో చన్నీళ్లు, దోమలతో ఇబ్బంది పడుతున్నారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, గత వారం రోజుల నుంచి ఎండ తీవ్రత ఎక్కువ ఉండటంతో చంద్రబాబు ముందుగా డీహైడ్రేషన్‌కు గురైయ్యారు. ఇప్పుడు మరోసారి ఉక్కపోతతో ఆయనకు అలర్జీ సమస్య వచ్చింది. జైలు అధికారులకు భువనేశ్వరి ఫిర్యాదు చేసిన నాలుగు రోజుల వరకు పట్టించుకోకపోవడంతోనే ఈ సమస్య వచ్చినట్లు టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు భద్రత, ఆరోగ్యంపై మొదటి నుంచి తెలుగుదేశం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జైల్లో చంద్రబాబుకు ప్రాణహాని ఉందని ఆరోపిస్తున్నారు. కానీ, ప్రభుత్వం మాత్రం ఈ అంశాన్ని పట్టించుకున్న దాఖలాలు లేవు. కనీసం ప్రభుత్వం నుండి స్పందన కూడా రాలేదు.
ఆ తర్వాత జైల్లో చంద్రబాబుకు కనీస సౌకర్యాలు కూడా కల్పించడం లేదని చంద్రబాబు కుటుంబ సభ్యులు ఆరోపించారు. జైల్లో దోమలు విపరీతంగా స్వైర్యవిహారం చేస్తున్నాయని, కనీసం చంద్రబాబుకు నిద్ర కూడా లేదని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కుటుంబ సభ్యులు జైల్లో దోమల బెడదపై ఫిర్యాదు చేసిన ఒకటి రెండు రోజులలోనే జైల్లో ఖైదీలలో ఒకరు డెంగ్యూతో మృతి చెందారు. . ఆ తర్వాత జైల్లో ఖైదీల మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఓ ఖైదీ గాయపడ్డాడు. ఈ విషయాన్నీ జైలు అధికారులు గోప్యంగా ఉంచారు. దీనిపై స్పందించిన జైళ్ల శాఖ డీఐజీ రవికిరణ్ ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పుకొచ్చారు. కానీ, గాయపడిన ఖైదీ అప్పటికే మీడియా ముందే జైల్లో తొక్కిసలాట గురించి చెప్పారు.
ఇప్పుడు జైల్లో వెంటిలేషన్ లేకపోవడం, విపరీతమైన ఉక్కపోతతో చంద్రబాబుకు అలర్జీ సమస్య తలెత్తింది. గతంలో సైతం చంద్రబాబుకు ఇంటి నుంచి భోజనం, మందులు, తదితర అంశాలపై భువనేశ్వరి కోర్టుకు వెళ్లగా కోర్టు అనుమతి ఇచ్చింది. కానీ, ఇప్పుడు జైల్లో సౌకర్యాల లేమితో చంద్రబాబుకు సమస్య తలెత్తింది. ప్రస్తుతం చంద్రబాబు విడుదల కోసం ఎదురు చూస్తూ భువనేశ్వరి రాజమండ్రిలోనే ఉంటున్నారు. తరచూ ఆయనతో ములాఖత్ అవుతూ ఆయన యోగక్షేమాలు తెలుసుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే తరచుగా ఆయన సమస్యలు బయటకి వస్తున్నాయి. ఇప్పుడు తలెత్తిన అలర్జీ సమస్య కూడా అలాగే బయటకు పొక్కగా.. జైలు అధికారులు హుటాహుటిన వైద్యులను తీసుకొచ్చి వైద్యం అందిస్తున్నారు. స్కిల్ కేసులో ఆయనను అక్రమంగా అరెస్టు చేసిన ప్రభుత్వం నెల రోజులు దాటినా ఒక్కటంటే ఒక్క ఆధారం కూడా చూపలేకపోయింది. ఏ తప్పు చేసినట్లు నిరూపించలేకపోయినా ప్రభుత్వం ఆయన్ను జైల్లో పెట్టి కక్షపూరితంగా వేధిస్తున్నది.
కాగా అసోసియేట్ ప్రొఫెసర్ ఆప్ డెర్మటాలజీ డాక్టర్ జి సూర్యనారాయణతోపాటు అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఆప్ డెర్మటాలజిస్ట్ డాక్టర్ సిహెచ్. వి. సునీత దేవితో కూడిన నిపుణులైన వైద్య బృందం చంద్రబాబుకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ లక్ష్మీ సూర్య ప్రభ.. ఓ ప్రకటన విడుదల చేశారు.