Leading News Portal in Telugu

ఏపీ సీఐడీ చేతికి నారా భువనేశ్వరి ఐటీ రిటర్న్స్.. లోకేష్ సీరియస్! | bhuvaneswari it returns to ap cid hands| lokesh| serious| irr| case| | cbdt


posted on Oct 13, 2023 1:24PM

వ్యక్తిగత స్వేచ్ఛ, ప్రజాస్వామ్య హక్కులు ఇప్పటికే ఏపీలో నిర్వీర్యమైపోయాయి. ప్రభుత్వం తలుచుకుంటే ఎవరినైనా అరెస్టు చేసేయవచ్చు. ఆ తరువాత ఎందుకు అరెస్టు చేయాల్సిందో దర్యాప్తు చేసి తేలుస్తామంటూ కోర్టుల ముందు చెప్పవచ్చు. స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన ఏపీ సీఐడీ అలాగే వ్యవహరించింది. అంతే కాదు.. ఇఆర్ఆర్ కేసులో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను ఏ 14గా చేర్చి విచారించింది. ఆ సందర్భంగా  ఏపీ సీఐడీ నారా లోకేష్ తల్లి భువనేశ్వరికి సంబంధించిన ఐటీ రిటర్న్స్  గురించి లోకేష్ ను ప్రశ్నించింది. ఆమె ఐటీ శాఖకు సబ్ మిట్ చేసిన ఐటీ రిటర్న్స్ ను లోకేష్ ముందు ఉంచింది. ఇక్కడే ఏపీ సీఐడీకి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ ఎలా వచ్చాయా అన్న ప్రశ్న ఉత్పన్నమౌతోంది. కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థలు, కేంద్ర ఆర్ధిక సంస్థలకు మాత్రమే తెలియాల్సిన వ్యక్తులు, సంస్థల ఆదాయ  వివరాలు.. రాష్ట్ర స్థాయి దర్యాప్తు సంస్థ ఏపీ సీఐడీ చేతికి ఎలా వచ్చాయి. ఆదాయపన్ను శాఖకు సమర్పించిన  ఐటీ రిటర్న్సు వివరాలు ఏపీసీఐడీ వద్దకు ఎలా చేరాయి?  ఎలా చూసినా ఇది నేరం. ఒక రాష్ట్ర దర్యాప్తు సంస్థే ఇలాంటి నేరానికి పాల్పడిందంటే అంత కంటే దారుణం మరేమైనా ఉంటుంది. తాను చేసిన నేరాన్ని తానే ఘనంగా మరో కేసులో  మరో నిందితుడి నేరానికి ఆధారంగా చూపడమంటే.. ఏపీ సీఐడీ ఎంతగా బరితెగించేసిందో అర్ధమౌతుంది.  ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో లోకేష్ ను రెండు రోజుల పాటు విచారించిన సీఐడీ.. ఆ విచారణ సందర్భంగా.. లోకేష్‌ తల్లి భువనేశ్వరికి సంబంధించిన ఐటీ రిటర్న్సు వివరాలను సీఐడీ అధికారులు, లోకేష్‌ ముందు పెట్టి విచారించారు. అదే ఇప్పడు పెను వివాదంగా మారింది.  

తన తల్లి ఐటీ రిటర్న్స్ వివరాలు  సీఐడీకి ఎలా చేరాయి?  అని లోకేష్ ప్రశ్నించారు. ఆ విషయం తేలాల్సిందే అని నిలదీశారు.  దీనితో సీఐడీకి భువనేశ్వరి ఐటీ వివరాలు ఎలా వచ్చాయి? ఎవరు ఇచ్చారు?  ఆ వివరాలకు కోరుతూ ఏపీ సీఐడీ ఏమైనా కేంద్ర దర్యాప్తు సంస్థలకు లేఖలు రాసిందా?  అన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. కేసు దర్యాప్తులో భాగంగా ఆ వివరాలు కావాలని సీఐడీ కనుక లేఖ రాస్తే.. ఆ లేఖకు ఏ శాఖ స్పందించి వివరాలు వెల్లడించింది అన్న వివరాలు వెల్లడించాల్సిందేనని లోకేష్ డిమాండ్ చేశారు. అసలు సీఐడీకి ఆ వివరాలు ఎలా అందాయి అన్న విషయంపై దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు.  ఆ దిశగా దర్యాప్తు జరిగితే  సీఐడీకి ఆ వివరాలు ఎలా, ఎక్కడ నుంచి అందాయన్న విషయం వెల్లడౌతుందని అంటున్నారు. అయినా వ్యక్తులు, సంస్థలకు సంబంధించిన ఐటీ రిట్నర్స్ ఎవరికి పడితే వారికి అందబాటులోకి రావనీ, ఒక వేళ దర్యాప్తులో భాగంగా వాటి అవసరం ఉన్నా.. అందుకు సంబంధించిన దర్యాప్తును చేయాల్సింది కూడా కేంద్రానికి చెందిన సంస్థలేనని నిపుణులు చెబుతున్నారు. 

సీబీఐ, ఈడీ, డైరక్టరేట్‌ ఆఫ్‌ రెవిన్యూ ఇంటలిజన్స్‌, సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌డైరక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ కస్టమ్స్‌, డైరక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ జీఎస్టీ ఇంటెలిజన్స్‌, నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో, ఎన్‌ఐఏ వంటి ఏజెన్సీలకు ఐటీ రిటర్న్స్ వివరాలు అధికారికంగా తీసుకునే అధికారం ఉంటుంది. అది కూడా దర్యాప్తునకు సంబంధించి, సాక్షాధారాల కోసమే తీసుకుంటారు. ఈ వివరాలన్నీ ఈ దర్యాప్తు సంస్థలు అధికారికంగానే తీసుకుని, కోర్టులో వాటిని ఆధారాలుగా సమర్పిస్తాయి. 

కానీ  రాష్ట్ర దర్యాప్తు సంస్థ అయిన సీఐడీ, ఆ పద్దతులేవీ పాటించలేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  వైసీపీ సర్కార్ వ్యవస్థలను మేనేజ్ చేసి ఈ వివరాలను సీఐడీకి  దొడ్డిదారిన చేరవేసిందని అంటున్నారు. తెలుగుదేశం సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఒకరు వైసీపీ ఎంపీల బంధువుల్లో ఉన్న ఐఆర్ఎస్ అధికారులు  వివిధ హోదాల్లో పలు దర్యాప్తు సంస్థల్లో పని చేస్తున్నారనీ, వారిలో ఎవరి ద్వారానే ఈ వివరాలు అక్రమంగా భువనేశ్వరి ఐటీ వివరాలను లీక్ చేసి సీఐడీకి అందజేసి ఉంటారని ఆరోపించారు.  

కాగా తన తల్లి ఐటీ రిటర్ను వివరాలు సీఐడీకి లభించడాన్ని యువనేత లోకేష్‌ సీరియస్‌గా తీసుకోవడంతో సీఐడీ చిక్కుల్లో పడిందనే చెప్పాలి. ఆయన దీనిపై సీబీడీటికి ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు. అదే జరిగి భువనేశ్వరి ఐటీ రిటర్న్స్ వివరాలు సీఐడీకి ఎలా చేరాయన్నదానిపై దర్యాప్తు జరిగితే.. అన్ని వివరాలూ బయటపడతాయనడంలో సందేహం లేదు.