Leading News Portal in Telugu

తెలంగాణ తెలుగుదేశంకు బాలయ్య దిశా నిర్దేశం! | balayya to direct telangana telugudesham| elections| bus| yatra


posted on Oct 13, 2023 2:53PM

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి దిశా నిర్దేశం కరవైందా? తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్  పార్టీని ఎన్నికలకు సమాయత్తం చేయడంలో విఫలం అయ్యారా? చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ప్రజలే స్వచ్ఛందంగా ముందుకు వచ్చినా.. పార్టీ పరంగా వారిని  ముందుండి నడిపించడంలో తెలంగాణ తెలుగుదేశం విఫలమైందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. తెలంగాణలో తెలుగుదేశం నిస్సందేహంగా బలీయమైన శక్తి అనడంలో సందేహం లేదు. రాష్ట్రంలో అన్ని పార్టీలూ కూడా తెలుగుదేశం బలం, బలగంపై స్పష్టమైన అవగాహనతోనే ఉన్నారు. తెలంగాణ తెలుగుదేశం అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తరువాత కాసాని జ్ణానేశ్వర్ మొదట్లో చాలా క్రియాశీలంగా వ్యవహరించారు.

పార్టీ శ్రేణుల్లో జవసత్వాలు నింపడంలో సఫలమయ్యారు. ఖమ్మంలో జరిగిన తెలుగుదేశం సభ బ్రహ్మాండమైన విజయం సాధించడం వెనుక జ్ణానేశ్వర్ పాత్ర విస్మరించలేనిది. అయితే ఆ తరువాత ఆ చురుకుదనం ఆయనలో కొరవడింది. పార్టీ కార్యక్రమాలు రూపొందించడంలో, వాటిని అమలు చేయడంలో విఫలమయ్యారు. దాంతో చంద్రబాబు అక్రమ అరెస్టు తరువాత దేశ వ్యాప్తంగా ఆందోళనలు వెల్లువెత్తినా, తెలంగాణలో మాత్రం ప్రజలు, ఐటీ ఉద్యోగులు స్వచ్ఛందంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు కానీ పార్టీ పరంగా ఆయన అరెస్టును నిరసిస్తూ పెద్దగా కార్యక్రమాలేవీ జరగలేదు. పార్టీ పరంగా దిశా నిర్దేశం లేకపోవడంతో శ్రేణులు కూడా దిగాలు పడ్డాయి. సరిగ్గా ఈ సమయంలో  రాష్ట్రంలో పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేయడానికి, వారిలో ధైర్యం నింపడానికీ నందమూరి బాలకృష్ణ రంగంలోకి దిగారు.

పార్టీ నేతలతో ఎన్టీఆర్ భవన్ లో నిర్వహించిన సమావేశంలో ఆయన ప్రసంగం పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. రాష్ట్రంలో పార్టీ పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు తాను నడుంబిగించానని బాలయ్య ప్రకటించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి బాలయ్య ఆశాకిరణంగా మారారు.  హైదరాబాద్‌లోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి తరచూ వస్తూ, పార్టీ సమన్వయకమిటీతో భేటీలు నిర్వహిస్తూ పార్టీకి దిశా నిర్దేశం చేస్తున్నారు. అంతే కాదు తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం తాను ఎక్కువ సమయాన్ని కేటాయిస్తాననీ, రాష్ట్రంలో పార్టీకి పూర్వ వైభవం తీసుకు వచ్చేందుకు కలిసికట్టుగా కృషి చేద్దామనీ ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో తాను ముందుంటానని బాలకృష్ణ పార్టీ శ్రేణులకు హామీ ఇచ్చారు. రాష్ట్రం మొత్తం బస్సు యాత్రతో చుట్టేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు ఆయన పార్టీ సమన్వయ కమిటీ భేటీలో చెప్పారు. 

రాష్ట్రంలో పార్టీ బలంగా  ఉన్న హైదరాబాద్-రంగారెడ్డి-నిజామాబాద్- ఖమ్మం నియోజకవర్గాలతోపాటు, వరంగల్-నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాలపై దృష్టి సారించాలని బాలయ్య చెబుతున్నారు. టీడీపీ ఆత్మీయ సమ్మేళనాల పేరుతో, స్తబ్దుగా ఉన్న పార్టీ క్యాడర్‌లో తిరిగి చైతన్యం తీసుకురావడమే పార్టీ ఉనికిని వచ్చే ఎన్నికలలో బలంగా చాటడమే ధ్యేయంగా బాలయ్య అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నది.  తెలంగాణలో టీడీపీ నేతలకు కొరత ఉన్నప్పటికీ..  30 నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు  పార్టీల జయాపజయాలను నిర్దేదిస్తుంది. దీంతో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో తెలుగుదేశం సత్తా చాటుతుందన్న భావన పార్టీ వర్గాల్లో  శ్రేణుల్లో బలంగా వ్యక్తం అవుతోంది. ముందుండి నడిపించే నేతగా బాలయ్య నిలిస్తే పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నెలకొనడం  తథ్యమని పరిశీలకులు కూడా విశ్లేషిస్తున్నారు.