posted on Oct 13, 2023 2:19PM
చంద్రబాబుకి జ్వరం లేదు, బీపీ సాధారణ స్థాయిలోనే ఉంది, పల్స్ రేటు బాగుంది, లంగ్స్ క్లియర్ గానే ఉన్నాయి, హార్ట్ ఓకే, ఫిజికల్ యాక్టివిటి గుడ్. రాజమండ్రి జైలు అధికారులు విడుదల చేసిన చంద్రబాబు హెల్త్ బులిటెన్ తాజా విశేషాలివి. అంతా బాగానే ఉంది, మరి చంద్రబాబుకి వచ్చిన సమస్య ఏంటనేది తేలాల్సి ఉంది. ఇంత ఆరోగ్యంగా ఆయన లోపల ఉంటే, బయట ఉన్న కుటుంబ సభ్యులు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నారనేది వైసీపీ నేతల ప్రశ్న. కేవలం సింపతీ కోసమే చంద్రబాబు ఆరోగ్యం గురించి ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలు, ఎల్లో మీడియా రాద్ధాంతం చేస్తున్నాయని అంటున్నారు. కానీ వాస్తవానికి చంద్రబాబు ఆరోగ్యం రోజు రోజుకు దిగ జారుతోంది. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు ధృవీకరిస్తున్నారు. తాజాగా నారా బ్రాహ్మణి, నారా లోకేష్, నారా భువనేశ్వరి, నారా సుహాసిని ఎక్స్ వేదికగా ట్వీట్ చేయడం పలువురిని ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పుడు చంద్రబాబు బరువు తగ్గిపోయారని, అది ఇతర సమస్యలకు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు. జైలులో వసతులు కల్పించకుండా శారీరకంగా ఇబ్బందులు పెడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.
తన భర్త చంద్రబాబునాయుడు ఆరోగ్యంపై నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. ఆయనకు సకాలంలో వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. చంద్రబాబు ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంకా ఆయన బరువు తగ్గితే అది కిడ్నీలపై ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు.ఓవర్‌హెడ్ వాటర్ ట్యాంకులు అపరిశుభ్రంగా ఉండడంతో చంద్రబాబు ఆరోగ్యానికి తీవ్ర ముప్పు వాటిల్లుతోందని, ఈ భయంకరమైన పరిస్థితులు తన భర్త జీవితానికి తక్షణ ముప్పు సృష్టించేలా ఉన్నాయని భువనేశ్వరి ఎక్స్ ద్వారా ఆందోళన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ప్రాణాలకు ముప్పు ఉందంటూ లోకేష్ భార్య బ్రాహ్మణి ట్వీట్ చేశారు. చంద్రబాబును అపరిశుభ్రమైన జైల్లో నిర్బంధించటం హృదయవిదారమని ఆవేదన చెందారు. ఇది చంద్రబాబు ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోందని తెలిపారు.
రాజకీయ కుట్రలో చంద్రబాబుని బాధితుడిగా మార్చారని నందమూరి సుహాసిని మండిపడ్డారు. చట్టవిరుద్ధంగా నిర్భంధించారని, ఈ కష్టకాలంలో అంతా చేతులు కలిసి సంఘీభావం తెలియజేద్దామని ఆమె కోరారు. ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుందామని ఈ సందర్భంగా నందమూరి సుహాసిని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఐదు కిలోల బరువు తగ్గిన చంద్రబాబుకు కిడ్నీలపై ప్రభావం పడవచ్చని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఆరోగ్యం దెబ్బతింటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బాధ్యత వహించాలని ఆమె హెచ్చరించారు. చంద్రబాబు కుటుంబ సభ్యురాలిగా తాను ఆవేదన చెందుతున్నాను అని సుహాసిని ట్వీట్ చేశారు.
రాజమండ్రి జైల్లో తన తండ్రికి దోమలు కుడుతున్నాయని, కలుషిత నీరు, ఇన్ ఫెక్షన్స్, ఎలర్జీలు బాధిస్తున్నాయని, దీనికి తోడు బరువు కూడా తగ్గినట్లు నారా లోకేష్ ట్వీట్ చేశారు.