లోకేష్, అమిత్ షా భేటీ తెలంగాణలో బీజేపీకి కలిసివస్తుందా? | will bjp benifit in telangana with amit shah meet with lokesh| ts| assembly| elections| settlers| votes| babu| arrest
posted on Oct 13, 2023 11:58AM
తెలంగాణ ఎన్నికల ముఖచిత్రం క్లారిటీ వచ్చేసింది. ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్యేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం రాష్ట్రంలో తమదే అధికారం అంటూ బిల్డప్ ఇచ్చిన బీజేపీ సైలెంట్ అయిపోయింది. పార్టీ జాతీయ స్థాయి నేతలు వరుస పర్యటనలతో రాష్ట్ర నాయకత్వంలోనూ, క్యాడర్ లోనూ జోష్ నింపడానికి చేస్తున్న ప్రయత్నాలు పెద్దగా ఫలించడం లేదు. దీంతో కమలనాథుల్లో అంతర్మథనం ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాలలో ఇంత కాలం రాష్ట్ర నాయకత్వాన్ని విస్మరించి అనుసరించిన విధానం ఫలితమే ఈ పరిస్థితి అన్న అవగాహనకు వచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో ఆలస్యమైనా, సమయం మించి పోలేదని భావిస్తున్న బీజేపీ హై కమాండ్ నష్ట నవారణకు చర్యలు చేపట్టింది.
అందులో భాగంగానే రాష్ట్రంలో సెటిలర్స్ మద్దతు చూరగొనే ప్రయత్నాలలో భాగంగా లోకేష్ తో అమిత్ షా భేటీ అయ్యారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. చంద్రబాబును ఏపీ సర్కార్ అక్రమంగా అరెస్టు చేసిన క్షణం నుంచీ తెలంగాణలో జనం స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగారు. మరీ ముఖ్యంగా సెటిలర్లు ఎక్కువగా ఉండే ప్రాంతంలోనూ, ఐటీ కారిడార్ లలోనూ ఎవరి ప్రమేయం లేకుండా జనం, ఉద్యోగులే స్వచ్ఛందంగా ప్రజా ఉద్యమాలు చేపట్టారు. చంద్రబాబు అక్రమ అరెస్టుతో తెలంగాణలో చంద్రబాబు, తెలుగుదేశం పట్ల ఒక్క సారిగా సానుభూతి పెల్లుబుకింది. తెలంగాణ ప్రగతి, హైదరాబాద్ అభివృద్ధికి చంద్రబాబు పునాది వేశారనీ, ఆ విషయాన్ని తెలంగాణ ఐటీ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పలు సందర్భాలలో చెప్పారు.
అయితే ఏపీ సర్కార్ చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత మాత్రం ఏపీలో ఏదో జరిగితే.. తెలంగాణలో ఆందోళనలేమిటి? కావాలంటే అక్కడకు పోయి చేసుకోండంటూ వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు అక్రమ అరెస్టు ఎఫెక్ట్ బీఆర్ఎస్ పై కూడా గట్టిగా పడిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో 32 నుంచి 35 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేయగలిగేంత సంఖ్యలో సెటిలర్ల ఉన్నారన్నది అంచనా. కేటీఆర్ వ్యాఖ్యల తరువాత బీఆర్ఎస్ లో అనూహ్యమైన కుదుపు వచ్చింది. అనివార్యంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలూ, నాయకులూ కూడా చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ఆందోళనల్లో పాల్గొనాల్సి వచ్చింది. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం పార్టీలో క్రియాశీలంగా ఉండి.. ఆ తరువాత బీఆర్ఎస్ గూటికి చేరిన నేతలు, ఎమ్మెల్యేలూ వారి వారి నియోజకవర్గాలలో బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనల్లో పాల్గొన్నారు. ఐయామ్ విత్ బాబు అంటూ నినదించారు.
అప్పుడు గానీ కేటీఆర్ కు తన వ్యాఖ్యల వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏమిటో అర్ధం కాలేదు. వెంటనే గొంతు సవరించుకున్నారు. మరో కీలక మంత్రి హరీష్ రావు అయితే బాబు అరెస్టును ఖండించారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. అదే విధంగా బీజేపీ కూడా చంద్రబాబు అరెస్టు విషయంలో వ్యవహరించిన తీరుతో తెలంగాణలో తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. అది గ్రహించిన రాష్ట్ర నాయకత్వం విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో మోడీ లోకేష్ తో మాట్లాడాల్సిందిగా అమిత్ షాను ఆదేశించారని బీజేపీ వర్గాలే చెబుతున్నాయి. మోడీ ఆదేశాల మేరకే అమిత్ షా స్వయంగా లోకేష్ ను పిలిపించుకుని మాట్లాడారనీ, దాదాపు గంటన్నరకు పైగా చర్చించారనీ చెబుతున్నారు. బాబు అరెస్టు విషయంలో బీజేపీకి ఏ మాత్రం సంబంధం లేదనీ, జగన్ చెబుతున్నట్లుగా తమ పాత్ర లేదనీ అమిత్ షా లోకేష్ కు వివరణ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. ఈ భేటీ కారణంగా కనీసం తెలంగాణ వరకైనా బాబు అరెస్టు కారణంగా బీజేపీపై వచ్చిన వ్యతిరేకత ఏదో మేరకు తగ్గుతుందని బీజేపీ అగ్రనేతలు భావిస్తున్నారు. ముఖ్యంగా బీజేపీ తెలంగాణ మాజీ అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి తదితరులు చంద్రబాబు అరెస్టు విషయంలో బీజేపీ నాయకత్వం వ్యవహరించిన తీరు తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి తీరని నష్టం వాటిల్లేలా చేసిందనీ, ముఖ్యంగా తెలంగాణలో బీజేపీకి ఈ నాలుగున్నరేళ్లలో వచ్చిన సానుకూల వాతావరణాన్ని ప్రతికూలంగా మార్చేశాయనీ సోదాహరణంగా వివరించడంతోనే బీజేపీ హై కమాండ్ పునరాలోచనలో పడి నష్ట నివారణ చర్యలకు నడుంబిగించిందనీ, అందులో భాగమే లోకేష్ తో అమిత్ షా భేటీ అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ భేటీతో తెలంగాణలో సెటిలర్స్, తటస్థులు, తెలుగుదేశం అభిమానులు బీజేపీ పట్ల సానుకూలంగా మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. అలాగే బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు గంపగుత్తగా కాంగ్రెస్ వైపు వెళ్లకుండా నిరోధించేందుకు దోహదం చేస్తుందని చెబుతున్నాయి.