Leading News Portal in Telugu

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? | political equations change in telugu states| amit| shah| lokesh| meet| kishanreddy


posted on Oct 13, 2023 10:52AM

ఏపీలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి.  అపాయింట్‌మెంట్ కోరకుండానే తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నుంచి కబురు వచ్చింది. తాను లోకేష్ తో బేటీ కావాలని భావిస్తున్నట్లు ఆయన కిషన్ రెడ్డి ద్వారా కబురు పంపించారు. దాంతో లోకేష్ బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ భేటీలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు,కేంద్రమంత్రి  కిషన్‌రెడ్డి, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కూడా ఉన్నారు. ఉన్నారు అనడం కంటే ఇరువురూ లోకేష్ ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్దకు లోకేష్ ను తోడ్కొని పోయారు అని చెప్పడం కరెక్ట్. భేటీ అనంతరం మీడియాతో మాట్లాడిన లోకేష్ తాను అప్పాయింట్ మెంట్ కోరలేదనీ, స్వయంగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి తనకు ఫోన్ చేసి అమిత్ షా మీతో మాట్లాడాలని భావిస్తున్నారు. రండి కలిసి వెడతాం అని చెప్పడంతోనే మర్యాద పూర్వకంగా ఆయనను కలిశాననీ, ఆ భేటీలో ఏపీలో అరాచక పాలన గురించి, చంద్రబాబు అక్రమ అరెస్టు గురించి, తనపై కేసుల గురించి ఫిర్యాదు చేశానని చెప్పారు.

 సరే అది పక్కన పెడితే.. ఉభయ తెలుగు రాష్ట్రాల బీజేపీ సారథులతో పాటు అమిత్ షాతో లోకేష్ భేటీ కావడం పలు ఊహాగానాలకు తావిచ్చింది. సహజంగానే ఆ ఊగాహాన సభలన్నీ.. తెలుగు రాష్ట్రాలలో తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుల చుట్టూ సాగాయి. ఔను ఇప్పటికే ఏపీలో తెలుగుదేశం, జనసేన పొత్తు ఖరారైంది. జనసేనాని పవన్ కల్యాణ్ స్వయంగా పొత్తు విషయాన్ని ఖరారు చేస్తూ ప్రకటన చేశారు. ఇక తెలంగాణలో కూడా తెలుగుదేశం, జనసేన కలిసే వెడతాయనీ, ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని టీడీపీ తెలంగాణ అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ ప్రకటించారు. త్వరలో రాజమహేంద్రవరం వెళ్లి బాబుతో ములాఖత్ అవుతాననీ, ఆ తరువాత జనసేనానితో కూడా భేటీ అవుతాననీ ఆయన ప్రకటించారు.

దీంతో తెలుగు రాష్ట్రాలలో  తెలుగుదేశం, జనసేన కూటమితో బీజేపీ కూడా కలిసే అవకాశాలు ఉన్నాయా అన్న చర్చ లోకేష్, అమిత్ షా భేటీతో జోరందుకుంది. ఇప్పటికే ఏపీలో తెలుగుదేశంతో కలిసే వెడతామని ప్రకటించిన పవన్ కల్యాణ్ ఇప్పటికీ జనసేన, బీజేపీ మైత్రి కొనసాగుతోందనీ, తెలుగుదేశం, జనసేనతో కలిసి బీజేపీ నడుస్తుందని భావిస్తున్నాననీ అన్నారు. ఈ నేపథ్యంలోనే లోకేష్ తో భేటీకి అమిత్ షా తనంత తానుగా చొరవ తీసుకోవడంతో తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తెలుగుదేశం, జనసేనల అండ కోరుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తం అయ్యాయి. మామూలుగా లోకేష్ అప్పాయింట్ మెంట్ తీసుకుని అమిత్ షాతో భేటీ అయితే ఈ స్థాయిలో చర్చలు జరిగేవి కావు. కానీ అమిత్ షా స్వయంగా భేటీ కోరుకుని, తెలుగు రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులను లోకేష్ ను తోడ్కొని రమ్మని పురమాయించడం, తెలుగు రాష్ట్రాలలో బీజేపీ తెలుగుదేశం అండ కోరుకుంటోందా? అన్న అనుమానాలు రావడానికి కారణమైంది. 

అదీ కాక చంద్రబాబు అక్రమ అరెస్టు వ్యవహారంలో వైసీపీ బీజేపీని లాగడం, కేంద్రంలోని మోడీ, షాల అండతోనే చంద్రబాబును అరెస్టు చేశామంటూ ఆ పార్టీ నేతలు బాహాటంగానే ప్రకటనలు చేయడం, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ స్వయంగా చంద్రబాబు అరెస్టు విషయంలో తనకు ఏ మాత్రం సంబంధం లేదనీ, అంతా కేంద్రంలోని బీజేపీ సర్కారే చేయించిందన్నట్లు మాట్లాడటంతో సహజంగానే కేంద్రం డిఫెన్స్ లో పడింది. ఒక్క ఆధారం లేకుండా 32 రోజులుగా చంద్రబాబును అక్రమంగా ఖైదులో ఉంచడం తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశ వ్యాప్తంగా నిరసన వ్యక్తం అవుతోంది. విదేశాలలో కూడా బాబు అరెస్టుకు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇది బీజేపీకి ఇబ్బందికరంగా మారింది. జగన్ లాగే మోడీది కూడా కక్ష పూరిత రాజకీయమేనన్న భావన మెజారిటీ ప్రజలలో వ్యక్తం అవుతుండటంతో.. బాబు అరెస్టులో తమ పాత్ర లేదని చెప్పుకోవలసిన పరిస్థితి బీజేపీకి ఎదురైంది. అందుకే అమిత్ షా స్వయంగా లోకేష్ తో భేటీకి ఆసక్తి చూపి, కిషన్ రెడ్డి ద్వారా కబురు చేశారని అంటున్నారు. అలాగే భేటీ అనంతరం చంద్రబాబు అక్రమ అరెస్ట్ లో బీజేపీ పాత్ర లేదనడానికి అమిత్ షా స్వయంగా లోకేష్ తో భేటీ అవ్వడమే తార్కానమని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ట్వీట్ చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.