ఒంగోలు వెళ్లి మరీ జ్యోతిష్యుడితో విజయమ్మ భేటీ.. మతలబేంటి? | vijayamma meet astrologer| ongole| political| intrest| ycp| leaders| sharmila| skip
posted on Oct 14, 2023 5:26PM
మాజీ సీఎం రాజశేఖరరెడ్డి సతీమణి, ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి, వైఎస్సార్ టీపీ అధినేత్రి షర్మిల మాతృమూర్తి వైఎస్ విజయమ్మ తాజాగా ఓ జ్యోతిస్యుడిని కలిశారు. దీంతో ఇప్పుడు ఈ విషయం రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒంగోలు సమీపంలో ప్రముఖ సిద్ధాంతిగా పేరున్న అద్దేపల్లి హనుమంతరావుని విజయమ్మ కలిసి చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.
అయితే, ఈ సిద్ధాంతి వద్ద సీఎం జగన్ మోహన్ రెడ్డి భవితవ్యం చెప్పించారా? లేక షర్మిల రాజకీయ భవిష్యత్ గురించి అడిగానా అన్న విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇక, వైఎస్ఆర్ కుటుంబంలోనే క్రిస్టియానిటీని బలంగా నమ్మే వారిలో విజయమ్మ ముందుటారు. ఎప్పుడు, ఎక్కడకి వెళ్లినా బైబిల్ చేతిలోనే ఉంచుకొనే విజయమ్మ ఒక్కసారిగా ఇలా జ్యోతిస్యులు, సిద్ధాంతుల వద్దకు వెళ్లడం ఆసక్తికర పరిణామంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయంపై రాజకీయవర్గాలలో కూడా ఆసక్తికర చర్చ జరుగుతోంది. విజయమ్మ ప్రస్తుతం కుమార్తె షర్మిల వద్దనే ఉంటున్న సంగతి తెలిసిందే. కాగా, అల్లుడు అనిల్ కుమార్ ప్రఖ్యాత పాస్టర్ అనే సంగతి కూడా తెలిసిందే. అరచేతితో వర్షాన్ని ఆపడం, దీర్ఘకాలిక రోగాలను కూడా చిటికెలో నయం అయ్యేలా ప్రార్ధనలు చేసే అల్లుడు అనిల్ ఉండగా.. విజయమ్మ ఓ సిద్ధాంతి కోసం ఒంగోలు వరకూ వెళ్లడం ఆసక్తి కలిగిస్తోంది.
విజయమ్మ ఎందుకు వెళ్లారు?.. హిందూ సిద్ధాంతాలు, జాతకాలను కూడా ఆమె నమ్ముతారా అన్న విషయాలను అలా ఉంచితే.. ఆమె ఎవరు కోసం వెళ్లారంటే రాజకీయ వర్గాలు మాత్రం షర్మిల కోసమే అంటున్నాయి. షర్మిల వైఎస్సార్ టీపీ భవితవ్యం, అభ్యర్థులకు బీఫాంలు ఇచ్చే అంశాలపై విజయమ్మ జాతకాలు అడిగి తెలుసుకున్నట్లు చెప్తున్నారు. శుభ ఘడియలపై సిద్ధాంతితో చర్చించినట్లు తెలుస్తున్నది. సుమారు మూడు గంటలపాటు ఆమె సదరు సిద్ధాంతితో చర్చలు జరపగా అనంతరం ఆమె తిరిగి మళ్ళీ హైదరాబాద్ చేరుకున్నారు. విజయమ్మ హైదరాబాద్ నుండి 350 కిమీ దూరం ఉన్న ఒంగోలుకు వచ్చి.. మళ్ళీ 350 కిమీ హైదరాబాద్ వెళ్లారు. కానీ, ఒంగోలు నుండి జగన్ నివాసం తాడేపల్లి గూడెం 250 కిలోమీటర్లు మాత్రమే. అయినా విజయమ్మ తాడేపల్లి వెళ్లకుండానే తిరిగి హైదరాబాద్ వెళ్లిపోయారు. దీంతో వైఎస్ కుటుంబంలో గొడవలు, సొంత తల్లే సీఎం జగన్ కు దూరంగా ఉండడంపై మరోసారి రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
కాగా, విజయమ్మ ఒంగోలు పర్యటన రాజకీయ నేతల మధ్య ఆసక్తికర చర్చకు దారి తీస్తుంది. రాజకీయాల్లో ఉన్న వైఎస్ కుటుంబం తమ తాతల కాలం నుండే క్రిస్టియానిటీని బలంగా నమ్ముతారు. కుటుంబం అంతా జెరూసలేం వరకూ వెళ్లి ప్రార్ధనలు చేసి వస్తారు. అయితే, ఈ మధ్య కాలంలో వైఎస్ కుటుంబం కూడా సిద్ధాంతులు, మఠాలను నమ్ముకుని ముందుకు సాగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. గతంలో వైఎస్ జగన్ కూడా విశాఖ శారదా పీఠాన్ని నమ్ముకున్న సంగతి తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు జగన్ శారదా పీఠాన్ని సందర్శించి.. అక్కడే అభ్యర్థుల విషయాన్ని పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామితో చర్చించారు. అప్పట్లో ఈ పర్యటన తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో దుమారం రేపింది. జగన్ శారదా పీఠం పర్యటన అనంతరం మాత్రమే వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు.
అలాగే ఇప్పుడు తొలిసారి సొంత పార్టీతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న షర్మిల కూడా స్వాములు, మంత్రులను నమ్ముకున్నారనే ప్రచారం మొదలైంది. అయితే, ఇప్పుడు షర్మిల రాకుండా విజయమ్మను పంపించడం ఆసక్తిగా కనిపిస్తుంది. విజయమ్మ ఈ ఒంగోలు పర్యటనలోనే వైసీపీ కీలక నేతలను కొందరిని కలిసినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. విజయమ్మ ఒంగోలు వెళ్ళగానే ముందుగా టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి ఇంటికి వెళ్లగా.. ఆ తర్వాత మరో ముఖ్యనేత బాలినేని శ్రీనివాసరెడ్డి, కర్నూలు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డిని కూడా కలిసినట్లు తెలుస్తున్నది. అయితే, జగన్ కు దూరంగా ఉంటున్న విజయమ్మ వైసీపీ ముఖ్య నేతలను కలవడంపై కూడా ఇప్పుడు విస్తృతంగా చర్చ జరుగుతోంది.