Leading News Portal in Telugu

న్యాయానికి సంకెళ్లు.. టీడీపీ మరో వినూత్న నిరసన! | shackles to justice| tdp| new| innovative| protest


posted on Oct 14, 2023 3:39PM

తెలుగుదేశంఅధినేత నారా చంద్రబాబు నాయుడును అక్రమ అరెస్ట్ చేసి  నెల రోజులు దాటింది. ఈ నెల రోజులుగా తెలుగుదేశం శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపడుతూనే ఉన్నారు. పార్టీ పరంగా  అధిష్టానం పిలుపు ఇచ్చినా.. ఇవ్వకపోయినా  కార్యకర్తలు పలు విధాలుగా నిరసనలు తెలుపుతూనే ఉన్నారు. ఈ నిరసన కార్యక్రమాలకు పార్టీ నాయకులు సంపూర్ణ మద్దతు ఇస్తూనే ఉన్నారు. ప్రజలూ స్వచ్ఛందంగా రోడ్లపైకి వచ్చి ఆందోళనల్లో పాలుపంచుకుంటున్నారు.

పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా, అలాగే దేశం సరిహద్దులు దాటి కూడా  తెలుగు జాతి ఉన్న ప్రతి చోటా ఈ నిరసనల హోరు కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పలుచోట్ల రిలే నిరాహార దీక్షలు, నల్ల వస్త్రాలు ధరించి నిరసనలు, మహాత్ముని విగ్రహానికి వినతిపత్రాలు అందించడం, కాంతితో క్రాంతి పేరుతో లైట్ల వెలుతురులో, సత్యమేవ జయతే దీక్ష పేర సత్యాగ్రహ దీక్షలు ఇలా వినూత్న కార్యక్రమాలను కూడా చేపట్టి చంద్రబాబు అక్రమ అరెస్ట్ కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే.  వైసీపీ ప్రభుత్వం చంద్రబాబు అరెస్టు చేసిన తొలి రోజు నుండి ఈ దీక్షలు, నిరసన కార్యక్రమాలను అణిచి వేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమౌతూనే ఉన్నాయి. ఎంత అణచివేద్దామని ప్రయత్నిస్తే అంతకు రెట్టింపుగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. 

తాజాగా తెలుగుదేశం ‘న్యాయానికి సంకెళ్లు’ పేరిట మరో నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.  చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసి, న్యాయానికి సంకెళ్లు వేసిన సీఎం జగన్‌ నియంతృత్వ పోకడలు దేశమంతా తెలిసేలా ఆదివారం (15న) రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల మధ్యలో చేతులకు తాడు లేదా రిబ్బను కట్టుకొని నిరసన తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. న్యాయానికి ఇంకెన్నాళ్లీ సంకెళ్లంటూ నినదించాలని కోరారు. ఆ వీడియోలు ఫొటోలు సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి చంద్రబాబు ధర్మ పోరాటానికి మద్దతుగా నిలవాలని పార్టీ శ్రేణులను, అభిమానులను లోకేశ్‌ కోరారు.

5 నిమిషాల పాటు.. 5 కోట్ల ఆంధ్రులు ఒక్కటిగా చంద్రబాబుకి సంఘీభావం తెలుపుతూ ఇళ్లు, వాకిళ్లు, బాల్కనీలు, వీధుల్లోకి వచ్చి పిచ్చి జగన్‌కి చూపించాలని పేర్కొన్నారు. చంద్రబాబు   ప్రజలకు మంచి చేయడం ఒక సైకోకు నచ్చలేదు. నిజాయితీపై కక్షగట్టి న్యాయానికి సంకెళ్లు వేసాడు. నువ్వు చేసింది తప్పు అని ఆ సైకోకి చెబుదాం. చేతులకు సంకెళ్లు వేసుకుని ప్యాలెస్ లోని నేరగాడికి చూపిద్దాం అంటూ టీడీపీ కోరింది. ఈ మేరకు లోకేష్ విడుదల చేసిన ఓ పోస్టర్ కూడా ఆసక్తిగా మారింది.

కాగా చంద్రబాబునాయుడి ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, తెలుగుదేశం శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ఇటీవల డీహైడ్రేషన్‌, అలర్జీలతో బాధపడుతుండటతో జైలులో చంద్రబాబు ఆరోగ్యానికి ముప్పు ఉందని పలువురు  అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించేలా న్యాయపోరాటానికి కూడా తెలుగుదేశం సిద్ధమౌతున్నట్లు చెబుతున్నారు. గురువారం ప్రభుత్వాసుపత్రి నుంచి ఇద్దరు చర్మ సంబంధిత వైద్య నిపుణులు ఆయన్ను పరీక్షించి వైద్యం అందించినా ఆ అనుమానాలు నివృత్తి కాలేదు. ఆయనకు అందించిన చికిత్స, చేసిన పరీక్షల వివరాలు గోప్యంగా ఉంచడంతో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలోనే సీల్డ్‌ కవర్‌లో చంద్రబాబు ఆరోగ్యానికి  సంబంధించిన సమగ్ర నివేదికను  ఉన్నతాధికారులకు ఇచ్చినట్లు వైద్యవర్గాలు తెలిపాయి. ఇలా ఉండగా చంద్రబాబును  రాజమండ్రి ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 

ఇప్పటికే రాజమండ్రి జీజీహెచ్‌లో ఉన్న వీఐపీ చికిత్స గదిని అధికారులు అత్యవసరంగా రెడీ చేయించారు. వైద్యుల సూచనలతో చంద్రబాబును ఆసుపత్రికి తరలించాల్సి వస్తే, ముందు జాగ్రత్త చర్యగా వీఐపీ చికిత్స గదిని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. ఈ గదితో పాటు ఎమెర్జెన్సీ డాక్టర్, ఇద్దరు క్యాజువాలిటీ డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్‌ నర్సులను ఈ విఐపీ గదికి కేటాయించారు. విఐపీ గదిలో రెండు ఆక్సిజన్‌ బెడ్లు, ఒక ఈసీజీ మిషన్‌, వెంటిలేటర్‌, వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచారు. అయితే, ప్రభుత్వాసుపత్రిలో ఈ వీఐపీ గదిని ఆగమేఘాలపై సిద్ధం చేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు చంద్రబాబు ఉన్న ఓపెన్‌ ఎయిర్‌ జైల్‌ ప్రాంగణంలోకి ఓ డ్రోన్‌ వచ్చినట్లు గుర్తించామని జైలు అధికారులే తెలిపారు. అయితే, దీనిపై విచారణ జరిపినా ఎలాంటి ఆధారాలు లభించలేదని చెప్పారు. దీంతో అసలు జైల్లో ఏం జరుగుతుంది? చంద్రబాబు ఆరోగ్యం ఎలా ఉంది అన్న దానిపై ఎన్నో రకాల చర్చలు జరుగుతున్నాయి.