నిందితులకు రెడ్ కార్పెట్.. నిర్దోషులకు జైలు.. జగన్ సర్కార్ విధానమా? | red carpet to acuused| jail| innocent| policy| jagan| sarkar| mlc| ananthababu
posted on Oct 14, 2023 1:09PM
హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబును వైసీపీ సస్పెండ్ చేసింది. అయితే అది ఉత్తుత్తి సస్పెన్షనేనని తేటతెల్లమైపోయింది. ముఖ్యమంత్రి నిర్వహించే పార్టీ సమావేశాలలో ఆయన పాల్గొంటున్నారు. సీఎం తూర్పోగోదావరి జిల్లా పర్యటనల్లో అంతా తానై ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో వైసీపీ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేసిందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వడ్డించేవాడు మనవాడైతే చాలు భోజనం పంక్తిలో చివర కూర్చున్నా ఏం ఇబ్బంది లేదు అన్నట్లు ఎమ్మెల్సీ అనంతబాబు జగన్ కు అస్మదీయుడు కావడంతో ఆయన కూడా పార్టీలో ఉంటే ఏంటి? సస్పెండైతే ఏమిటి? అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు.
పార్టీ వర్గాలు, పోలీసులు కూడా ఆయనకు రెడ్ కార్పెట్ పరిచి మరీ రాచమర్యాదలు చేస్తున్నారు. ఔను నిజమే హత్య కేసులో నేరం అంగీకరించి బెయిలుపై బయటకు వచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు ఇప్పుడు జగన్ చుట్టూనే తిరుగుతున్నారు. జగన్ రెడ్డి గోదావరి జిల్లాల పర్యటనకు వచ్చిన సందర్భంగా అనంతబాబుకు జగన్ రెడ్డి పక్కనే ఉంటున్నారు. అన్నిటికీ మించి గత నెల 26న తాడేపల్లి హత్య చేశానంటూ స్వయంగా నేరాన్ని అంగీకరించిన అనంతబాబును పక్కన పెట్టుకుని జగన్ ప్రజలకు ఏం సంకేతమిస్తున్నట్లు అని చర్చ రాజకీయవర్గాలలో విస్తృతంగా జరుగుతోంది. ఇక అనంతబాబు స్వయంగా హత్య చేసినట్లు అంగీకరించినా.. ఆయనే స్వయంగా నేరాన్ని అంగీకరించారని పోలీసులే వెల్లడించినా.. దర్యాప్తు ముందుకు సాగడం లేదు. పైగా పోలీసులు ఆయనకు ఎక్కడ లేని మర్యాదా చూపుతూ అడుగులకు మడుగులొత్తుతున్నారంటేనే రాష్ట్రంలో నేరస్థులకు ఏ విధంగా ఏ స్థాయిలో అండదండలు అందుతున్నాయన్నది అవగతమౌతోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చిత్రీకరించడానికి జరిగిన ప్రయత్నాలూ, అవి విఫలమైన తరువాత.. ఆ కేసులో నేరారోపణలు ఏదుర్కొంటున్న వారికి ప్రభుత్వపరంగా అందిన, ఇప్పటికీ అందుతున్న అండదండలనూ ఉదహరిస్తూ.. ఏపీలో జగన్ హయాంలో భారత రాజ్యాంగం మరుగున పడిపోయిందనీ, ప్రత్యేకంగా ఏపీ కోసం జగన్ రెడ్డి తనదైన సొంత రాజ్యాంగాన్ని రూపొందించారా అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
ఇక అనంతబాబు విషయానికి వస్తే.. ఔను నా మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం తన వ్యక్తిగత వ్యవహారాల్లో మితిమీరిన జోక్యం చేసుకుంటున్న కారణంగా తానే స్వయంగా హత్య చేశానని పోలీసుల ఎదుట అంగీకరించారు. ఈ హత్యలో మరెవరికీ ప్రమేయం లేదని అనంతబాబు తమ విచారణలో అంగీకరించిట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అప్పట్లో ఆయనపై అనివార్యంగా కేసు నమోదు చేసి జైలుకు పంపినా.. జైల్లో ఆయనకు రాచమర్యాదలు చేశారని అప్పట్లోనే వార్తలు వచ్చాయి. అయితే హత్య కేసులో నేరాన్ని అంగీకరించిన అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించినా వైసీపీ ఆయనకు తెరవెనుక అండదండలను అందిస్తూనే వచ్చింది. వస్తోంది.
ఇప్పుడు ఆయన బెయిలు మీద బయటకు వచ్చి జగన్ ను అంటిపెట్టుకుని తిరుగుతున్నారు. జిల్లాలో పార్టీ ముఖ్య నేతగానే వ్యవహారాలన్నీ చక్కబెడుతున్నారు. దీంతో వైసీపీ అనంతబాబును సస్పెండ్ చేయడం కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని తేటతెల్లమైపోయిందని అంటున్నారు. నిందితులకు రెడ్ కార్పెట్ పరిచి, నిర్దోషులను ఖైదులో ఉంచడం అన్నది జగన్ సర్కార్ విధానమా అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.