కేసుల సాగతీతలో ఘనాపాఠి.. జగన్ మనసెరిగి మెసులుకుంటున్న రోహత్గీ?! | babu quash pitition deferrals continue| mukul| rohatgi| arguements| supreme| evidences| new| points
posted on Oct 16, 2023 7:03AM
చంద్రబాబు అక్రమ అరెస్టును సక్రమమే అని నిరూపించలేక సాగతీత పర్వాన్ని కొనసాగిస్తున్నది ప్రభుత్వం. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేతకు ముందు రెండు కోర్టుల్లోనూ సుదీర్ఘ వాదనలు జరిగాయి. ఇప్పుడు కేసు సుప్రీం కోర్టులో ఉంది. మూడు చోట్లా కూడా ప్రభుత్వ తరఫు న్యాయవాదులు.. ఆధారాలు చూపకుండా కేవలం సెక్షన్ల ఆధారంగానే కేసును నడిపారు. నడుపుతున్నారు.
చంద్రబాబు కోర్టులో దాఖలు చేసినది క్వాష్ పిటిషన్ కనుక న్యాయస్థానాలు కేసు మెరిట్స్, డీ మెరిట్స్ విషయం కాకుండా.. అరెస్టు సక్రమమా? కాదా? అన్న విషయంపైనే వాదనలు వింటున్నారు. ఏసీబీ, హైకోర్టులలో కీలక సెక్షన్ అసలు ఒక మాజీ ముఖ్యమంత్రిని ఆయన సీఎంగా ఉన్న సమయంలో తీసుకున్న విధాన నిర్ణయం విషయంలో గవర్నర్ అనుమతి లేకుండా విచారించవచ్చా? అరెస్టు చేయవచ్చా? అన్న విషయాన్ని పట్టించుకోకుండా కేవలం సెక్షన్ ల మేరకే తీర్పులు చెప్పాయని న్యాయనిపుణులు అంటున్నారు. ఇక సుప్రీం కోర్టు వద్దకు వచ్చే సరికి ప్రభుత్వ వాదనలన్నీ తేలిపోయాయని అంటున్నారు. అయినా సాంకేతికంగా వాదనలను కొనసాగిస్తూ వాయిదాల మీద వాయిదాలు పడేలా ప్రభుత్వ లాయర్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ముఖ్యంగా జగన్ కేసుల విషయంలో సాగతీతలో ఘనాపాఠిగా పేరొందారు. ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసులు పదేళ్లుగా విచారణకు నోచుకోకుండా వాయిదాల పర్వం కొనసాగుతుండడాన్ని, ఒక్క సారి కూడా ఆయన కోర్టుకు హాజరు కాకుండా బెయిలుపై ఉండడాన్ని ఈ సందర్భంగా న్యాయనిపుణులు ప్రస్తావిస్తున్నారు. అలాగే కోడికత్తి కేసులో బాధితుడిగా కూడా కోర్టుకు హాజరు కాకుండా.. ఐదేళ్లుగా ఆ కేసులో నిందితుడు కోడికత్తి శీనుకు బెయిలు కూడా రాకుండా జైలులోనే మగ్గుతున్న పరిస్థితిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విషయంలో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ కూడా జగన్ మనసెరిగి వ్యవహరిస్తున్నారని అంటున్నారు.
చంద్రబాబు అక్రమ అరెస్టును సమర్ధించేందుకు ఒక్క అధారాన్ని కూడా చూపలేకపోయినా.. రోజుల తరబడి కేసును వీలైనంతగా సాగదీయడానికి ఆయన శతధా ప్రయత్నిస్తున్నారు. గత శుక్రవారం మధ్యాహ్నం విచారణలో కూడా ఇయన ఒక్కటంటే ఒక్క ఆధారం చూపలేకపోయినా, సెక్షన్ 17ఏపై న్యాయమూర్తులు అడిగిన ప్రశ్నలకు సూటిగా సమాధానం ఇవ్వకుండా గంటన్నరకు పైగా సుదీర్ఘ వాదనలు వినిపించి.. మరింత సమయం కావాలని కోరారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణ మంగళవారం (అక్టోబర్ 17)కు వాయిదా పడింది.
ముకుల్ రోహత్గీ ఎంత సేపూ స్వాతంత్రం వచ్చినప్పటికేసుల్ని… సెక్షన్ 17ఏ చట్టం రాక ముందు నాటి కేసుల్ని మాత్రమే రిఫరెన్స్ గా చూపుతూ తన వాదనలు వినిపించారు. కేసు పాతతే.. ఎఫ్ఐఆర్ కొత్తది అయినప్పుడు రద్దయిన సెక్షన్ల కింద కేసులు ఎలా నమోదు చేస్తారన్న సుప్రీం కోర్టు ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పలేకపోయారు. ఆ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశం లేనప్పుడు కేసులు ఎలా పెడతారని సుప్రీం కోర్టు సూటిగా ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది.