Leading News Portal in Telugu

జాబితాలో 115 మంది.. బీఫారాలు అందింది 51 మందికే! | bforms to only 51 candidates| outof 115| kcr| pending| defence| fear| wait| congress


posted on Oct 16, 2023 10:54AM

తెలుగువన్ మొదటి నుంచీ  ఏం చెబుతోందో అదే జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి ఊరికి ముందు అంటే  ఎన్నికల షెడ్యూల్ కూడా వెలువడక ముందే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 115 స్థానాలలో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించేశారు. రాష్ట్రంలో మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే.. వాటిలో నాలుగంటే నాలుగు పెండింగ్ లో పెట్టి.. ఒకే సారి 115 నియోజకవర్గాలలో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించేశారు.

అయితే ఆలా ప్రకటించినప్పుడే తెలుగువన్  జాబితాలో పేర్లు ఉన్న వారందరికీ బీఫాంలు ఇచ్చే అవకాశం లేదని అంచనా వేసింది. ఇప్పుడు అదే జరిగింది. ఆర్భాటంగా 115 మంది అభ్యర్థులను ప్రకటించేసినా ఆదివారం ( అక్టోబర్ 15)న కేసీఆర్ తన చేతుల మీదుగా వారిలో  51 మందికి మాత్రమే  బీ-ఫారాలు అందజేశారు. వాటితో పాటు ఎన్నికల ఖర్చుల కోసం రూ. 40 లక్షల పార్టీ ఫండ్ ను కూడా అందించారు. మిగిలిన వారికి రిక్త హస్తమేనా అన్న చర్చ రాజకీయవర్గాలలో జోరుగా సాగుతోంది. అసలు ఈ చర్చ అన్ని పార్టీల కంటే ఎక్కువగా బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జరుగుతోంది. అయితే మిగిలిన బీఫారాలు సిద్ధం కాలేదనీ, ఒకటి రెండు రోజులలో అందరికీ ఈస్తామనీ పార్టీ హైకమాండ్ చెబుతోంది.  

కేసీఆర్ ప్రకటించిన జాబితాలో మార్పులూ చేర్పులూ ఉంటాయనీ, ఉండక తప్పదనీ ఆయన ఆ జాబితా ప్రకటించిన  నాటి నుంచీ కూడా పార్టీలోనే పెద్దఎత్తున చర్యలు జరుగుతున్నాయి. జాబితా ప్రకటన తరువాత వెల్లువెత్తిన అసంతృప్తిని నామినేటెడ్ పదవులతో చల్లార్చాలని చేసిన ప్రయత్నాలు అంతంత మాత్రంగా కూడా ఫలితాన్నివ్వలేదని పార్టీ శ్రేణులే పెదవి విరిచాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ప్రకటించిన అందరికీ బీఫారాలు ఇవ్వకుండా  పెండింగ్ లో పెట్టడంతో  జాబితాలో మార్పులు, చేర్పులపై జరుగుతున్న ప్రచారం మరింత జోరందుకుంది.  ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటన పూర్తి అయ్యేదాకా వేచి చూసే వ్యూహంతో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు.

పార్టీలో అసంతృప్తిని చల్లార్చే ప్రయత్నాలు విఫలం కావడంతో కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో టికెట్ల ప్రకటన తరువాత పరిస్థితిని బట్టి ముందడుగు వేయాలని భావిస్తున్నట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా ప్రకటించిన అభ్యర్థులందరికీ ఒకే సారి భీపారాలు అన్న కేసీఆర్ ఇప్పుడు అవి రెడీ కాలేదని చెప్పడాన్ని ఇతర పార్టీలే కాదు.. సొంత పార్టీ వారు కూడా నమ్మడం లేదు.    ముచ్చటగా మూడవసారి గెలిచి హ్యాట్రిక్  సాధించాలనే లక్ష్యంతో వ్యూహాత్మకంగా, ముందుగానే, అభ్యర్ధులను ప్రకటించి, ప్రత్యర్ధులకు సవాలు విసిరిన కేసీఆర్ ఇప్పుడు డిఫెన్స్ లో పడ్డారని పరిశీలకులు అంటున్నారు.

అయితే ఇప్పుడేమిటి? ఆయనలో ఏమూలో పార్టీ విజయావకాశాలపై అనుమానాలు తలెత్తడంతోనే ముందుగానే  అభ్యర్థులను ప్రకటించేశారనీ, అసమ్మతి ఉధృతిని చూసి అవసరమైతే మార్పులూ చేర్పులూ చేసుకోవడానికి వీలుగా ఆయనీ ఆప్షన్ ఎంచుకున్నారనీ  అప్పట్లోనే పరిశీలకులు విశ్లేషించారు. ఇక ప్రకటించిన క్షణం  నుంచీ కేసీఆర్ కసరత్తు అంతా  ఆ జాబితాలో మార్పులూ, చేర్పుల మీదే ఉందని కూడా అంటున్నారు.  మొత్తం మీద ఆదివారం (అక్టోబర్ 15) ఆయన ప్రకటించిన జాబితాలో కేవలం 51 మందికి మాత్రమే బీఫారాలు ఇచ్చారు. దీంతో టికెట్లు దక్కిన వారందరికీ బీఫారాలు ఇవ్వకపోవచ్చునన్న పార్టీ వర్గాల ప్రచారం నిజమై కూర్చుంది. రెండు మూడు రోజుల్లో మిగిలిన వారికి బీఫారాలు ఇస్తామని చెబుతున్నప్పటికీ.. కొందరికి మొండి చేయి తప్పక పోవచ్చునని పరిశీలకులు అంటున్నారు.  

టికెట్  వస్తుందో రాదో అనే అనుమానంతో పక్క చూపులు చూస్తున్న వారిని కట్టడి చేసేందుకే  కేసీఆర్ గంపగుత్తగా ఒకే సారి 115 మంది అభ్యర్థులతో జాబితా విడుదల అయితే చేశారు  కానీ, ఆ జాబితాలో ఉన్న వారందరికీ  బీఫారంలు ఇస్తారన్న నమ్మకం  లేదన్న ప్రచారం అప్పట్లోనే బీఆర్ఎస్ శ్రేణుల్లో పెద్ద ఎత్తున జరిగింది.  ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైందని అంటున్నారు.