Leading News Portal in Telugu

తెలంగాణ అసెంబ్లీకి నందమూరి సుహాసిని.. ఈసారి పక్కా అంటున్న టీడీపీ! | nandamuri suhasini to contest from two constituencies in telangana| tdp| win| assure| lbnagar| kukatpalli| 2018| elections


posted on Oct 17, 2023 2:16PM

ఏపీలో ఈసారి అధికారం తెలుగుదేశం పార్టీదే. ఈ విషయం ఇప్పటికే  పలు సర్వే సంస్థలు పేర్కొన్నాయి. అలాగే  రాజకీయ పరిశీలకులు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అధికార వైసీపీ సొంత సర్వేలలో కూడా ఇదే ఫలితాలలు రావడంతో ఇప్పుడు వైసీపీ నేతలు ఆత్మరక్షణలో పడ్డారు. ఏదోలా కార్యకర్తలను రెచ్చగొట్టి, వ్యవస్థలను మ్యానేజ్ చేసి, అధికారంలో ఉండగా సంపాదించుకున్న ఆర్ధిక వనరులను వినియోగించుకొని, పందిని నందిని చేసి చూపించగల రాజకీయ వ్యూహకర్తలను అడ్డం పెట్టుకొని ఎలాగైనా గెలవాలని ఆరాటపడుతున్నది. అయితే  మరో సారి మోసపోయేందుకు సిద్ధంగా లేమని ప్రజలు వైసీపీ నేతలకే మొహం మీద చెప్పేస్తున్నారు. మరోవైపు తెలంగాణలో కూడా తెలుగుదేశం జోష్ కనిపిస్తున్నది. చంద్రబాబు అరెస్టుకు నిరసనగా తెలంగాణలో ఎలాంటి కార్యక్రమం తలపెట్టినా అనూహ్య స్పందన లభిస్తున్నది. తెలంగాణలో మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో టీ తెలుగుదేశం క్యాడర్ గతంలో మాదిరి ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపడం లేదు. ఈసారి తమ ఉనికి  చాటుకోవాలన్న తపన తెలంగాణ తెలుగు తమ్ముళ్లలో కనిపిస్తుంది. దీంతో తెలంగాణ తెలుగుదేశం నాయకత్వం కూడా ఆ దిశగా వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా 87 స్థానాల్లో అభ్యర్థులను సిద్ధం చేశామని తెలంగాణ తెలుగుదేశం అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ తాజాగా ప్రకటించారు. రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్ లో చంద్రబాబుతో కాసాని జ్ఞానేశ్వర్ ఇటీవల ములాఖత్ అయ్యారు.   హైదరాబాద్ లోని పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబుతో ములాఖత్ వివరాలు వెల్లడించారు. ఆ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తారని, చంద్రబాబు ఆమోదించాక త్వరలోనే అభ్యర్థులను ప్రకటిస్తామని జ్ఞానేశ్వర్ చెప్పారు. కాగా  నంద‌మూరి సుహాసిని ఈ సారి తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్డడం ఖాయ‌మ‌ని తెలుగుదేశం నేతలు బల్లగుద్ది చెప్తున్నారు. ఈ సారి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ నందమూరి ఆడపడుచుని గెలిపించి ఋణం తీర్చుకుంటామని తెలుగు తమ్ముళ్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

గ‌త 2018 ఎన్నిక‌ల్లో తొలిసారి నంద‌మూరి కుటుంబం నుంచి సుహాసిని రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన సంగతి తెలిసిందే. దివంగ‌త హ‌రికృష్ణ కుమార్తె అయిన సుహాసిని గురించి అప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రికీ తెలియ‌దు. కానీ  సుహాసిని రాజకీయ అరంగేట్రం,  2018 ఎన్నిక‌ల్లో కూక‌ట్ ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో నిలవడం చకచకా జరిగిపోయాయి. కూకట్ పల్లిలో సెటిలర్లు ఎక్కువగా ఉండడం, కాంగ్రెస్‌తో అప్ప‌ట్లో టీడీపీ పొత్తు ఉండడం, బాబాయ్ బాలకృష్ణ దగ్గరుండి ప్రచారం చేయడం వంటి కారణాలతో సుహాసిని ఖ‌చ్చితంగా గెలిచి తీరుతార‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా సుహాసిని ఓట‌మి చ‌వి చూశారు. కాగా ఇప్పుడు వ‌చ్చిన అసెంబ్లీ పోరులో ఆమె మ‌రోసారి ఎన్నిక‌ల బరిలోకి దిగనున్నారు. అయితే, ఈసారి పగడ్బందీ ప్రణాళికతో ఎ సుహాసినిని తెలంగాణ అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయాలని తెలంగాణ  తెలుగుదేశం నేతలు వ్యూహాలు సిద్ధం చేస్తున్నారట.

ఈ సారి నందమూరి సుహాసినిని గెలిపించుకోవ‌డం ల‌క్ష్యంగా రెండు చోట్ల పోటీకి దింపనున్నట్లు తెలుస్తుంది. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిన కూక‌ట్ ప‌ల్లి నియోజకవర్గంతో పాటు ఈసారి ఎల్బీన‌గ‌ర్‌ను కూడా సుహాసినికి కేటాయించిన‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. కూకట్ పల్లిలో ఆంధ్రా సెటిలర్లు ఎక్కువే అయినా   వీరిలో కొంత శాతం తెలంగాణలో బలమైన పార్టీలకు షిఫ్ట్ అయ్యారు. కానీ  ఎల్బీ నగర్ అలా కాదు. ఇప్పటికీ ఇక్కడ తెలుగుదేశం బలంగా ఉంది. ఆ పార్టీ పిలుపు మేరకు ఇక్కడ కార్యక్రమాలు దిగ్విజయంగా జరుగుతుంటాయి. ఇక్కడ సెటిలర్లలో ఎక్కువ శాతం ఏపీలో తెలుగుదేశం పార్టీకి  కంచుకోట లాంటి ప్రాంతాల నుండి  వచ్చిన వారే కావడంతో తెలంగాణలో ఉన్నా తాము తెలుగుదేశం కార్యకర్తలమే అని గట్టిగా చెబుతుంటారు.  అందుకే గత ఎన్నికలలో ఎల్బీ న‌గ‌ర్‌ నుండి బీసీ నాయ‌కుడు ఆర్‌.కృష్ణ‌య్య కూడా విజ‌యం సాధించారు. అప్పట్లో టీఆర్ఎస్(ఇప్పుడు బీఆర్ఎస్) ప్ర‌భావం జోరుగా ఉన్న‌ప్ప‌టికీ కృష్ణయ్య విజ‌యాన్ని అడ్డుకోలేకపోయింది. అందుకే ఇప్పుడు ఇక్కడ కూడా సుహాసినిని పోటీ చేయించనున్నట్లు తెలుస్తుంది.