కేసీఆర్ వ్యూహాలు రివర్స్.. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ కోవర్టులు?! | kcr strategies reverse| congress|coverts| brs| candidates| worry
posted on Oct 17, 2023 11:28AM
మామూలుగా కాంగ్రెస్ ను కుదిపేసే అసంతృప్తి, అసమ్మతి ఈ సారి బీఆర్ఎస్ కు కంగారు పెడుతోంది. గత పదేళ్లుగా ఏ వ్యూహాలతో అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేశారో.. అవే వ్యూహాలను ఇప్పుడు బీఆర్ఎస్ అసమ్మతి నేతలు అనుసరిస్తున్నారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముచ్చటగా మూడో సారి సీఎం పగ్గాలు చేపట్టాలన్న పట్టుదలతో ఉన్న కేసీఆర్ కు అడుగడుగునా అడ్డంకులే ఎదురౌతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఆవిర్భవించిన తరువాత ఇప్పటి వరకూ ఎన్నడూ లేని విధంగా ఆయన డిఫెన్స్ లో పడ్డారు. మరో వైపు కాంగ్రెస్ అనూహ్యంగా పుంజుకోవడమే కాకుండా.. అధికారాన్ని హస్తగతం చేసుకోగలమన్న ధీమాతో ముందుకు సాగుతోంది. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా చెప్పుకుంటున్నా.. తెలంగాణ ఆవిర్భావం నుంచీ అధికారానికి దూరమై ఉని మాత్రంగా మిగిలిన కాంగ్రెస్ లో అసమ్మతి, అసంతృప్తి ఉన్నప్పటికీ వాటన్నిటినీ పక్కన పెట్టి ముందు అధికారంలోకి రావడమే లక్ష్యంగా సమైక్యంగా కదలాలన్న భావన వ్యక్తమౌతోంది.
ఇప్పటి వరకూ బీఆర్ఎస్ తరఫున కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారన్న వార్తలు మాత్రమే విన్నాం.. కానీ ఈ సారి కాంగ్రెస్ పార్టీకి కోవర్టులుగా బీఆర్ఎస్ నేతలు కొందరు పని చేస్తున్నారన్న అనుమానాలు అధికార పార్టీలో వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు ఇంటెలిజెన్స్ రిపోర్టులు కూడా ఔననే చెబుతున్నాయి. బీఆర్ఎస్ లోని కొందరు.. కాంగ్రెస్కు కోవర్టులుగా పనిచేస్తున్నారని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం అధికార పార్టీకి అందినట్లు సమాచారం. వారు కూడా అలాంటి ఇలాంటి వారు కాదు. కేసీఆర్ పార్టీ అభ్యర్థులుగా ప్రకటించిన వారేనని పార్టీ వర్గాల సమాచారం. ఇలాంటి వారు దాదాపు డజను మంది వరకూ ఉన్నారని అంటున్నారు. ఏతావాతా ఎన్నికల తరువాత సపోజ్ ఫర్ సపోజ్ హంగ్ ఏర్పడితే..ఈ డజను మందీ గంపగుత్తగా గోడదూకేయడానికి ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చారని అంటున్నారు. ఆ కారణంగానే కేసీఆర్ తొలి జాబితా అంటూ 115 మంది అభ్యర్థులను ప్రకటించినా అందులో సగం మందికి కూడా బీఫారాలు ఇవ్వలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
ఇప్పుడు బీఆర్ఎస్ అధినేత పార్టీ అభ్యర్థులుగా తాను ఇప్పటికే ప్రకటించిన వారిపై నిఘా పెట్టారని అంటున్నారు. ఒక వైపు పార్టీ ప్రచారంపై దృష్టి పెడుతూనే మరో వైపు అభ్యర్థుల కదలికపై కన్నేసిన కేసీఆర్.. మరో వైపు కోవర్టులు ఎవరన్న సమాచారం కోసం ఇంటెలిజెన్స్ వర్గాలపై ఆధారపడ్డారని చెబుతున్నారు. ఇప్పటికే వారిలో కొందరిని గుర్తించినా.. ఈ సమయంలో అభ్యర్థులను మారిస్తే అది ప్రజలలోకి తప్పుడు సంకేతాలను పంపే ప్రమాదం ఉందని సంకోచిస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.
ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇప్పటికే నిర్వహించిన పలు సర్వేలలో, కేసీఆర్ స్వయంగా చేయించుకున్న సర్వేలలో కూడా రాష్ట్రంలో కాంగ్రెస్ గ్రాఫ్ తారాజువ్వలా పైపైకి వెడుతోందనీ, అదే సమయంలో బీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతోందనీ తేలిందని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ తరఫున వచ్చే ఎన్నికలలో పోటీకి టికెట్ ఖరారైన కొందరు అభ్యర్థులలో తమ రాజకీయ భవిష్యత్ పై ఆందోళన మొదలైందని చెబుతున్నారు. అలా ఆందోళనలో ఉన్న వారిలో అత్యధికులు గత ఎన్నికల తరువాత తాము గెలిచిన పార్టీ నుంచి ఫిరాయించి బీఆర్ఎస్ పంచన చేరిన వారేనన్నది పరిశీలకుల విశ్లేషణ. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఇప్పటికే నిర్ధారించుకున్న వారు ముందుగానే ఆ పార్టీకి టచ్ లోకి వెళ్లినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేసీఆర్ లో ఆందోళన మొదలైందనీ, ఇప్పుడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తరువాత ప్రకటించిన అభ్యర్థులలో మార్పులు, చేర్పులూ చేస్తే అది ప్రజలకు ఎలాంటి సంకేతాలు పంపిస్తుంది.. అలా అని మార్చుకుంటే.. ఎన్నికల అనంతరం పూడ్చుకోలేని నష్టం జరిగే అవకాశం ఉంటుంది. దీంతో ఏం చేయవలే.. ఈ సమస్యను ఎలా అధిగమించవలె అంటూ కేసీఆర్ మథన పడుతున్నారని పార్టీ శ్రేణుల్లోనే పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందని బీఆర్ఎస్ వర్గాల ద్వారానే తెలుస్తున్నది.
నీవు నేర్పిన విద్యయూ నీరజాక్ష అన్నట్లుగా.. ఇప్పటి వరకూ ప్రత్యర్థి పార్టీలను బలహీనం చేయాలనీ, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే నిర్వీర్యం చేయాలని కేసీఆర్ అనుసరించిన వ్యూహాలూ, ఎత్తుగడలే ఇప్పుడు ఆయనకు వ్యతిరేకంగా ఇంత కాలం ఆయన వెన్నంటి ఉన్నవారిలో కొందరు అనుసరించడం కేసీఆర్ కు మింగుడుపడటం లేదని పార్టీ శ్రేణులే అంటున్నాయి.