చంద్రబాబు క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసిన సుప్రీం | chandrababu quash petition judgement reserve| supreme| court| heated| arguements| mukulrohatgi| harishsalve| 17a
posted on Oct 17, 2023 5:30PM
స్కిల్ కేసులో చంద్రబాబును అక్రమంగా అరెస్టు చేసిన తరువాత ప్రభుత్వ తీరు, ఆ కేసులో ప్రభుత్వ న్యాయవాదుల వాదనలు గమనించిన ఎవరికైనా సరే కోర్టు ప్రొసీడింగ్స్ ను సాధ్యమైనంతగా జాప్యం అయ్యేలా చేసి వీలైనన్ని ఎక్కువ రోజులు చంద్రబాబును జైలులో ఉంచాలన్న వ్యూహమే కనిపిస్తున్నది. ఏసీబీ, హైకోర్టులలో చంద్రబాబు క్వాష్ పిటిషన్ కొట్టివేసిన తరువాత సహజంగానే చంద్రబాబు సుప్రీంను ఆశ్రయించారు.
అక్కడ వాదనలలో చంద్రబాబు తరఫు న్యాయవాదుల వాదనలు సూటిగా, సుత్తి లేకుండా ఉంటే.. ప్రభుత్వ తరఫు న్యాయవాది మాత్రం సాధ్యమైనంతగా కాలయాపన చేయడమే లక్ష్యంగా తన వాదనలు వినిపించారు. దీంతో విచారణ వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్నది. మంగళవారం ( అక్టోబర్ 17) వాదనలు పూర్తై తీర్పు వెలువడుతుందని అంతా భావించారు. అయితే ప్రభుత్వం తరఫున వాదించిన సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ మాత్రం సుదీర్ఘంగా తన పాత వాదనలనే వినిపించారు. ఆయన వాదిస్తున్న సమయంలో పలుమార్లు న్యాయమూర్తులు ప్రశ్నలు సంధించారు. మంగళవారం మధ్యాహ్నం సుప్రీం కోర్టులో చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణకు రాగానే తొలుత ప్రభుత్వ తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపించారు. చంద్రబాబుకు 17ఏ వర్తించదని ఆయన చెప్పారు. అయితే ముకుల్ రోహత్గీ వాదనలు వినిపిస్తుండగా సుప్రీం కోర్టు ధర్మాసనం పలు ప్రశ్నలు సంధించింది. ఈ కేసుకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని ఒక సందర్భంలో ధర్మాసనం వ్యాఖ్యానించింది.
అయితే వాటిని పట్టించుకోకుండా రోహత్గీ తన వాదనలు కొనసాగించారు. సమయం మించిపోతోంది.. ముగించాల్సిందని కోరితే మరికొంత సమయం కావాలన్నారు. అయితే సుప్రీం ధర్మాసనం అందుకు అంగీకరించలేదు. ఈ కేసులో వాదనలు ఈరోజే పూర్తి అవుతాయని స్పష్టం చేసింది. ఆ తరువాత చంద్రబాబు తరఫు న్యాయవాది హరీష్ సాల్వే సెక్షన్ 17ఏ చంద్రబాబుకు వర్తిస్తుందంటూ పలు తీర్పులను ఉటంకించారు. అన్నిటికీ ఈ కేసులో రిమాండ్ రిపోర్టు, కౌంటర్ అఫిడవిట్లలో ఆరోపణలు తప్ప మరేమీ లేవని సోదాహరణంగా వివరించారు. ఈ కేసు వెనుక రాజకీయ కక్షసాధింపు ఉందనీ.. ఎన్నికల ముందు విపక్ష నేతను జైలులో ఉంచి రాజకీయంగా లబ్థి పొందేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. ఇరు పక్షాల వాదనలూ విన్న అనంతరం సుప్రీం కోర్టు తీర్పేను శుక్రవారానికి రిజర్వ్ చేసింది. కాగా ఈ రోజు సుప్రీంలో విచారణకు రావలసిన సైబర్ నెట్ కేసును కూడా శుక్రవారానికి వాయిదా వేయడమే కాకుండా అప్పటి వరకూ చంద్రబాబును అరెస్టు చేయవద్దని ఆదేశించింది. ఆ కేసు విచారణ కూడా శుక్రవారమే పూర్తి చేసి తీర్పు వెలువరిస్తామని పేర్కొంది.