Leading News Portal in Telugu

కోడికత్తి కేసు విచారణపై స్టే.. శీను జైల్లో మగ్గిపోవాల్సిందే! | ap hi court stay kodi katti cace| nia| jagan| vizag| airport


posted on Oct 18, 2023 6:28AM

జగన్ పై కోడికత్తితో దాడి చేసిన శీను నేరం ఇప్పటికీ రుజువు కాలేదు. కానీ, అప్పటి నుండి ఇప్పటి వరకూ ఇంకా జైల్లోనే మగ్గిపోతున్నాడు. ఈ కేసులో బాధితుడిగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కోర్టు ఎన్నిసార్లు పిలిచినా విచారణకు హాజరు కాలేదు. బాధితుడు జగన్ కోర్టుకు వచ్చి వాంగ్మూలం ఇవ్వాలని పలుమార్లు నోటీసులు ఇచ్చినా ఆయన మాత్రం కోర్టుకు వెళ్లడం లేదు. జగన్ కోర్టుకు వెళ్తే ఈ కేసు కొలిక్కి వస్తుంది. కోడికత్తి శీనుకు బెయిల్ దక్కుతుంది. కానీ  జగన్ మాత్రం కోర్టుకు వెళ్లడం లేదు. ఆ మాట కొస్తే ఈ మధ్యనే ఎన్ఐఏ మరింత లోతుగా దర్యాప్తు చేయాలంటూ హై కోర్టుకు వెళ్లారు. తాజాగా ఈ  కేసు విచారణపై  ఏపీ హైకోర్టు  మంగళవారం నాడు స్టే విధించింది.  ఈ కేసుపై విచారణను ఆరు వారాల పాటు వాయిదా వేసింది. లోతుగా దర్యాప్తు కావాలని సీఎం జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై ఎన్ఐఏను కౌంటర్ దాఖలు చేయాలని కూడా ఏపీ హైకోర్టు ఆదేశించింది. ముందుగా జగన్ లోతైన దర్యాప్తు కావాలని జగన్ ఎన్ఐఏ కోర్టును ఆశ్రయించగా కోర్టు  తోసిపుచ్చింది.  దీంతో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారించిన కోర్టు ఈ కీలక ఆదేశాలు జారీ చేసింది. 

ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సీఎం జగన్‌పై విశాఖ ఎయిర్‌ పోర్టులో కోడి కత్తి దాడి జరిగిన సంగతి జరిగింది. 2018 అక్టోబర్ 25న 294వ రోజు పాదయాత్ర ముగించుకొని వైఎస్‌ జగన్‌  హైదరాబాద్‌ తిరిగి వచ్చేందుకు విశాఖపట్నం విమానాశ్రయంకు రాగా.. అదే విమానాశ్రయం క్యాంటీన్ లో పనిచేస్తున్న వెయిటర్‌ సెల్ఫీ తీసుకుంటానని వైఎస్‌ జగన్‌ వద్దకు వచ్చారు. అతను వస్తూనే జగన్‌పై కోళ్ల పందేలకు ఉపయోగించే కత్తితో దాడి చేశాడు. ఈ సమయంలో అప్రమత్తంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సహాయకులు దాడిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. వైఎస్‌ జగన్‌ భుజానికి కత్తి తగిలింది. అది చిన్న గాయం కావడంతో వెంటనే జగన్ విమానం ఎక్కి వెళ్లిపోయారు. కానీ, అక్కడ నుండే అసలు సినిమా మొదలైంది. జగన్ హైదరాబాద్ చేరుకున్న తరవాత సిటీ న్యూరో ఆస్పత్రిలో చేరారు. దీంతో అదే పెద్ద సంచలనం అయింది. అక్కడ సీన్ కట్ చేస్తే వైసీపీ అధికారంలోకి వచ్చిది. జగన్ మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. కానీ, ఈ కేసు ఎటూ తేలక నిందితుడు శ్రీనివాస్ ఐదు సంవత్సరాల నుంచి జైల్లోనే ఉంటున్నాడు. 

పలు మార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు వరకూ శ్రీనివాస్ కు బెయిల్ ఇవ్వాలంటూ పిటిషన్లు వెళ్లినా ఎక్కడా పనికాలేదు. వైఎస్ జగన్ ఈ కేసులో కోర్టుకు హాజరు కాకపోగా ఆయన తరపు లాయర్లు ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ కు బెయిల్ రాకుండా అడ్డుపడుతున్నారు. ఇటు కేసు తేలక.. బెయిల్ రాక నిందితుడు జైలుకు పరిమితమయ్యాడు. తాజాగా, ఈ కేసులో శ్రీనివాస్ తరపున పిచ్చుకల శ్రీనివాసరావు అనే కొత్త లాయర్ వాదనలు వినిపిస్తున్నారు. మొన్నటి వరకూ సలీం అనే లాయర్ ఈ కేసులో శ్రీనివాస్ తరపున వాదనలు వినిపించగా ఇప్పుడు శ్రీనివాస్ వాదిస్తున్నారు. కాగా  కోర్టుకు వచ్చి తన బాధను చెప్పుకోవాల్సిన బాధితుడు జగన్ అసలు కోర్టుకే వెళ్లకుండా.. ఇప్పుడు ఈ కోడికత్తి కేసులో లోతైన దర్యాప్తు కావాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు రెండు నెలల క్రితమే తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టులో పిటిషన్ వేశారు. 

అయితే, విమానాశ్రయంలో దాడి జరిగినపుడు ఏపీ పోలీసులపై నమ్మకం లేదని ఎన్ఐఏ దర్యాప్తు కోరింది కూడా జగనే కాగా.. ఇప్పుడు ఆ ఎన్ఐఏ దర్యాప్తు కూడా సరిపోలేదని.. ఇంకా లోతైన దర్యాప్తు కావాలని మళ్ళీ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ వేసింది కూడా జగనే కావడం విశేషం.  కాగా, ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న ఈ కేసులో ఇప్పటికే రాష్ట్ర పోలీసులు కూడా జోక్యం పెరిగింది. జైలు నుండి కోర్టుకు.. కోర్టు నుండి జైలు తరలించే సమయంలోనూ, జైల్లో కూడా నిందితుడు శ్రీనివాస్ పై క్రూరంగా ప్రవర్తిస్తున్నారు. కోర్టు ఆవరణలోనే పోలీసులు శ్రీనివాస్ ను ఈడ్చుకెళ్తున్న దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.  తనను హింస పెడుతున్నారని శ్రీనివాస్ కోర్టులోనే మొరపెట్టుకుంటున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. ఈ పరిణామాలను చూస్తుంటే జగన్ కావాలనే శ్రీనివాస్ ను జైలు నుండి బయటకురాకుండా మేనేజ్ చేస్తున్నారన్న అనుమానాలు బలపడుతున్నాయని పరిశీలకులు అంటున్నారు.