ఇంతలా చెబుతున్నా ఎందుకు నమ్మరు.. జనంపై సజ్జల ఆక్రోశం! | why dont you believe us| sajjala| anger| people| babu| skill| cases| corruption| evidence| court
posted on Oct 19, 2023 10:59AM
తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అవినీతికి పాల్పడ్డారు. స్కిల్ స్కాంలో ఆయనకు ముడుపులు అందాయి. అని ఎంతగా చెబుతున్నా ప్రజలు ఎందుకు నమ్మడం లేదు? మేం ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు? అంటూ జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు, సకల శాఖల మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి జనంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేం చెప్పేది మీరు నమ్మి తీరాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇంత చెప్పినా ఎందుకు నమ్మడం లేదంటూ ఆక్రోశం వ్యక్తం చేస్తున్నారు.
గత 40 రోజులుగా చెప్పించే చెబుతూ వైసీపీ నేతలు మరీ ముఖ్యంగా సజ్జల రామకృష్ణారెడ్డీ నెత్తీ నోరూ బాదుకుని మరీ చెబుతున్నా జనం చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటే నమ్మడం లేదు. ఆయనను జగన్ సర్కార్ కక్ష పూరితంగా అరెస్టు చేసిందంటూ రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. చంద్రబాబు అరెస్టు ముందు వరకూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడాలంటే ఎందుకొచ్చిన గొడవ.. కేసులు, దాడులను ఎదుర్కొనవలసిన అవసరం ఏముంది? అనుకుంటూ తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ మనస్సులలోనే దాచుకుని ఎన్నికలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూస్తూ గడిపేసిన జనం ఇప్పుడిక తమ ఆగ్రహాన్ని, వ్యతిరేకతనూ దాచుకోవడానికి, అణచుకోవడానికి ప్రయత్నించడంలేదు.
ప్రభుత్వ వ్యతిరేకతను బాహాటంగా, బహిరంగంగా వెళ్లగక్కుతున్నారు. దీంతో సజ్జల వారికి చిర్రెత్తుకొచ్చింది. మీడియా సమావేశం పెట్టి మరీ ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు అంటూ మేం చెబుతున్నా మీరెందుకు నమ్మరు? చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారని మిమ్మల్ని నమ్మించడానికి ఇంకా ఏం చేయాలి అని ప్రశ్నించారు. ఔను మీడియాలో ఆయన మాట్లాడిన విషయాల సారాంశమిదే. దీంతో ఇప్పటి వరకూ ఏమో స్కిల్ కేసులో కుంభకోణం ఉందేమో అని జనంలో ఏమూలైనా అనుమానాలు ఉండి ఉంటే అవన్నీ పటాపంచలైపోయాయి. సజ్జల మాటల తరువాత చంద్రబాబుపై జగన్ ప్రభుత్వం కక్ష పూరితంగానే అక్రమ కేసు బనాయించి జైలుకు పంపించారని విస్పష్టంగా అర్ధమైంది.
ఇదే విషయంపై నెటిజన్లు సజ్జలను ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే ఇరికించిందనడానికి సజ్జల మాటలే నిదర్శనమంటూ ఫైరౌతున్నారు. వైసీపీ చంద్రబాబుపై చేస్తున్న ఆరోపణలు జనం నమ్మడం లేదనడానికి సజ్జల మాటలే సాక్ష్యమంటూ పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని వివరిస్తున్నారు. ఆధారాలతో సహా చంద్రబాబును అరెస్టు చేశామంటూ ఓ వైపు సజ్జల అండ్ కో చెబుతుంటే.. న్యాయస్థానాలలో ప్రభుత్వం తరఫున వాదిస్తున్న న్యాయవాదులు మాత్రం.. ఆధారాలా వాటి గురించి అడగకంటి.. స్కిల్ కేసులో అవినీతి జరిగింది. ఇక ఇప్పుడు ఆధారాలు సేకరించడం కోసమే చంద్రబాబును అరెస్టు చేశాం అంటూ చెబుతున్నారు. సెక్షన్ 17ఏపై కూడా అదే వితండ వాదన అటుతిప్పీ ఇటు తిప్పీ వినిపిస్తున్నారు.
రేపు, మాపు అంటూ వాయిదాల మీద వాయిదాలు కోరుతున్నారు. స్కిల్ కేసులో తనకు కావలసింది బెయిలు కాదు.. అసలు కేసే కొట్టేయాలంటూ చంద్రబాబు ధర్మాగ్రహంతో న్యాయపోరాటం సాగిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ స్కిల్ కేసులో ఆధారాలు చూపలేక.. నీళ్లు నములుతోంది. అవినీతి జరిగిందని చెబుతున్నాం కదా.. కేసు కట్టేశాం.. ఇక ఇప్పుడు ఆధారాల కోసం విచారిస్తాం అంటున్నారు. అందుకే సజ్జల మీడియా ముందుకు వచ్చి ఇంతగా చెబుతున్నా మీరెందుకు నమ్మరు అంటూ జనాన్ని నిందిస్తున్నారు. వాస్తవాలు కళ్లెదుట సాక్షాత్కరిస్తుంటే జనం అబద్ధాలు ఎందుకు నమ్ముతారన్న లాజిక్ ను సజ్జల మరచిపోయారు పాపం.