తెలంగాణ ఎన్నికల బరిలో టీఆర్ఎస్.. గుర్తు గ్యాస్ సిలెండర్ | trs in telangana elections| symbol| gas| cylander| ec
posted on Oct 19, 2023 12:05PM
వచ్చే నెల 30న జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో టీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలోకి దిగనున్నారు. అదేమిటి టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందింది కదా.. మళ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ అభ్యర్థులు రంగంలో ఉండటమేమిటను కుంటున్నారా? అక్కడికే వస్తున్నాం ఆగండి.
జాతీయ రాజకీయాలపై మక్కువతో.. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాలన్న ఆకాంక్షతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని బీఆర్ఎస్ గా మార్చేసిన సంగతి తెలిసిందే. జాతీయ పార్టీగా గుర్తింపు రాకపోయినప్పటికీ బీఆర్ఎస్ ను కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. ఆ పార్టీకి తొలి నుంచీ ఉన్న కారు గుర్తునే కేటాయించింది. అయితే తెలంగాణ ఉద్యమ కారులు, రాష్ట్రానికి చెందిన కొందరు కీలక నేతలు కలిసి తెలంగాణ రాజ్య సమితి (టీఆర్ఎస్) పార్టీని స్థాపించారు. ఈ పార్టీని కూడా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తించింది. తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని రిజిస్టర్ చేయించి.. తెలంగాణ ఎన్నికల బరిలో నిలిపారు.
రాష్ట్రంలోని మొత్తం 119 నియోజకవర్గాలలోనూ అభ్యర్థులను నిలబెట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో తమ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అంగీకరించింది. తెలంగాణ రాజ్య సమితి (ఆఆర్ఎస్) పార్టీకి గ్యాస్ సిలెండర్ ను ఎన్నికల గుర్తుగా కేటాయించింది. దీంతో ఆ పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచే వారందరికీ గ్యాస్ సిలెండర్ గుర్తు కేటాయిస్తుంది. మొత్తంగా రానున్న ఎన్నికలలో టీఆర్ఎస్ బరిలో ఉండటం, ఆ పార్టీ అభ్యర్థులందరికీ ఒకే గుర్తును కేటాయించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవడం ఎంత లేదన్నా అధికార బీఆర్ఎస్ కు ఒకింత ఇబ్బందికరమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.