రిషికొండ నిర్మాణాలపై సుప్రీంలో పిల్ | pil in supreme court| rishikonda| constructions| environment| ngt| highcourt| cm| camp
posted on Oct 19, 2023 12:33PM
రిషికొండపై నిబంధనలకు విరుద్ధంగా సీఎం క్యాంప్ కార్యాలయ నిర్మాణం పై సుప్రీంకోర్టు లో పిటిషన్ దాఖలు అయింది. పర్యవరణ వేత్త శివరాం ప్రసాద్ అనే వ్యక్తి దాఖలు చేసిన ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఉల్లంఘించి, కోస్టాల్ రెగ్యులేటరీ జోన్ మార్గదర్శకాలకు విరుద్ధంగా రిషికొండపై కాంప్ కార్యాలయం నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. కోస్టల్ రెగ్యులేటరీ జోనుకు సంబందించి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ)లో విచారణ జరుగుతున్నదనీ, రాష్ట్ర హైకోర్టు ఆదేశాలను కూడా ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు.
నిబంధనలు తుంగలోకి తొక్కి కోర్టులు ఇచ్చిన ఆదేశాలను బేఖాతరు చేసి మరీ రిషికొండలో సీఎం క్యాంపు కార్యాలయం, విశాఖలో సీనియర్ అధికారుల కార్యాలయాల ఏర్పాటు కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 11-10-2023 న ఇచ్చిన జీవో 2015 ను వెంటనే రద్దు చేయాలనీ శివరాం ప్రసాద్ తాను దాఖలు చేసిన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్ )లో కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 21, 48/A ఉల్లంఘనలకు పాల్పడిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చర్యలను వెంటనే నిలువరించాలని కోరారు. ఎన్జీటో, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో రిషికొండ పై రిసార్ట్ నిర్మాణం పై దాఖలైన కేసులు పరిష్కారం అయ్యే వరకు రుషికొండపై ఏవిధమైన నిర్మాణాలు, ప్రారంభ కార్యక్రమాలు జరుగకుండా వెంటనే ఉత్తర్వులు ఇవ్వాలని ఆయన తన పిటిషన్ లో కోరారు.
అలాగే పిటిషన్ తో పాటు… కార్యాలయాల తరలింపుపై జిఎడి ఇచ్చిన జీఓ, వివిధ పత్రికలలో వచ్చిన వార్తల క్లిప్పింగులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన ఆదేశాల కాపీలు జత చేశారు. అలాగే రిషికొండ నిర్మాణాలపై సుప్రీంకోర్టు ధర్మాసనం గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాపీని కూడా జత చేశారు. డిసెంబర్ నుంచి పాలన మొత్తం విశాఖ నుంచే ఉంటుందని స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన నేపథ్యంలో దాఖలైన ఈ పిటిషన్ అత్యం ప్రాధాన్యత సంతరించుకుంది. రిషికొండపై నిబంధనలను తుంగలోకి తొక్కి నిర్మాణాలు చేపట్టారన్నఆరోపణలు ఎప్పటి నుంచో ఉండగా, అధికారులు, వైసీపీ వర్గాలు కూడా అంతర్గత సంభాషణల్లో నిబంధనల ఉల్లంఘన నిజమే అంటున్నారు. దీంతో సుప్రీం కోర్టులో దాఖలైన పిల్ అధికారుల గుండెల్లో గుబులు రేపుతోంది.