Leading News Portal in Telugu

షర్మిల పార్టీ.. పోటీకి అభ్యర్థులేరీ? | candidates wanted to contest| ysrtp| sharmila| 119| vijayamma| brotheranil| congress


posted on Oct 19, 2023 11:42AM

వైఎస్సార్టీపీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పేరు మీద తెలంగాణలో ఏర్పాటైన పార్టీ. ఈ పార్టీని వైఎస్సార్ కుమార్తె షర్మిల ఏర్పాటు చేశారు. తెలంగాణలో రాజన్న రాజ్యం అంటూ ఆమె ప్రారంభించిన ఈ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దయనీయంగా మారింది. పార్టీ  ఆవిర్భావం నుంచీ కూడా షర్మిల రాజకీయ లక్ష్యం ఏమిటన్న అనుమానాలు బలంగానే వ్యక్తం అవుతూ వచ్చాయి.

అయితే ఆమె వాటిని  వేటినీ  పట్టించుకోకుండా  తన  మానాన  తాను  నడిచారు. ఏళ్ల  తరబడి ఆమె రాష్ట్రంలో సాగించిన నడక, చేపట్టిన దీక్షలతో ఏదో మేరకు జనం దృష్టిని ఆకర్షించగలిగారు. అన్నిటికీ మించి రాష్ట్రంలో అధికార పార్టీ బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల  చంద్రశేఖరరావు, ఆయన కుటుంబ సభ్యులపై షర్మిల విమర్శల  బాణాలు గుప్పించారు. ఆమె ఎవరు వదిలిన బాణం..  ఏ లక్ష్యంతో గురిపెట్టిన బాణం  అన్న ప్రశ్నలను  అధిగమించి.. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన కాంగ్రెస్, బీజేపీల కంటే ఎక్కువగా కేసీఆర్ కుటుంబాన్ని  టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. దాంతో షర్మిల పార్టీకి ప్రజలలో గుర్తింపు వచ్చింది. ఆ గుర్తింపు  ఎన్నికలలో విజయం సాధించిపెట్టేంత ఎక్కువగా లేకపోయినా షర్మల  మాత్రం తెలంగాణ  రాజకీయాలలో  తన ఉనికిని  బలంగానే చాటుకున్నారు.  విజయం  సంగతి ఎలా ఉన్నా.. ఆమె పార్టీ కచ్చితంగా  కొన్ని నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేస్తుందని పరిశీలకులు  సైతం విశ్లేషించారు.

అయితే ఆ గుర్తింపును, ఆ బలాన్నీ షర్మిల  చేజేతులా ‘చే’ జార్చుకున్నారు. ఎంత కష్టపడినా, వేల కిలోమీటర్లు పాదయాత్ర  చేసినా, వారం వారం  దీక్షలు చేసినా  తెలంగాణలో అధికారం చేపట్టే అవకాశం లేదన్న నిర్ధారణకు వచ్చిన అనంతరం ఆమె కాంగ్రెస్ పార్టీ వైపు దృష్టి సారించారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలో కాంగ్రెస్ సాధికార విజయం తరువాత.. తెలంగాణలో కూడా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న అంచనాతో  షర్మిల ఆ పార్టీవైపు అడుగులు వేశారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్నచందంగా ఏపీ సీఎం, స్వయానా తనకు అన్న అయిన జగన్ తో ఉన్న ఆస్తి తగాదాల సెటిల్ మెంట్ తో పాటు.. తన రాజకీయ భవిష్యత్ కు కూడా డోకా లేకుండా ఉండేలా వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.

తన తండ్రి వైఎస్ కు ఆత్మగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కేవీపీ రామచంద్రరావు, అలాగే వైఎస్ కుటుంబానికి సన్నిహితుడైన కర్నాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ల ద్వారా కాంగ్రెస్ అధిష్ఠానానికి టచ్ లోకి వెళ్లారు. వైఎస్సార్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదన పెట్టారు. హై కమాండ్ కూడా సానుకూలంగా స్పందించింది. అయితే వైఎస్ వారసురాలిగా షర్మిలకు తెలంగాణ రాజకీయాలతో సంబంధం ఏమిటంటూ తెలంగాణ కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అయితే ఒక అడుగు ముందుకు వేసి తెలంగాణలో షర్మిల అవసరం లేదని కుండబద్దలు కొట్టేశారు. ఆమె ఏపీలో రాజకీయాలు చేస్తే బాగుంటుందని అధిష్ఠానానికి తెగేసి చెప్పారు. దీంతో వైఎస్సార్టీపీ కాంగ్రెస్ లోకి విలీనం కావడం ఆగిపోయింది.

అయితే ఆ క్రమంలో తెలంగాణలో వైఎస్సార్టీపీ ప్రతిష్ట కూడా పాతాళానికి పడిపోయింది. కాంగ్రెస్ మొండి చేయి చూపడంతో ఆమె ప్రతిష్టకు పోయి వైఎస్సార్టీపీ తెలంగాణ ఎన్నికలలో పోటీ చేస్తుందనీ, అది కూడా మొత్తం 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడతానని షర్మిల ప్రకటించారు. అక్కడే ఆమె తప్పులో కాలేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయడానికి ప్రతిపాదించిన క్షణం నుంచే ఆమె వెనుక అప్పటి వరకూ నడిచిన వారు షర్మిల నాయకత్వంపై విశ్వాసం కోల్పోయారు. దీంతో ఆమె 119 స్థానాలలోనూ అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించే నాటికి.. పార్టీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులే కరవయ్యారు.

పాలేరుతో పాటు మరో స్థానం నుంచి షర్మిల నిలబడతారు. ఇది ఖాయమే. అలాగే మరో రెండు స్థానాల నుంచి అభ్యర్థులుగా ఆమె భర్త బ్రదర్ అనీల్ కుమార్, తల్లి విజయమ్మ నిలబడినా మిగిలిన 115 నియోజకవర్గాలలో నిలబడేందుకు అభ్యర్థులను వెతుక్కోవలసిన పరిస్థితి. దరఖాస్తు చేసుకోవాలని ఆమె పిలుపునిచ్చానా ఎవరూ ముందుకు రాలేదంటున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలలో అభ్యర్థులను నిలుపుతామంటూ ఆమె చేసిన ప్రకటనను నెటిజన్లు హేళన చేస్తున్నారు. ఎవరి కోసమో, ఎవరో వదిలిన బాణంగా రాజకీయ ప్రవేశం చేసిన షర్మిల ఇప్పుడు  దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.