కుమారుడి విజయం కోసం టీటీడీ నిధులు.. భూమన భారీ స్కెచ్!? | bhumana sketch for son win| ttd| funds| divert| name| tirupati
posted on Oct 20, 2023 10:06AM
గతంలో రాజకీయ నాయకులు ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం తమ జేబులోని నగదు తీసి ఖర్చు పెట్టే వారు. అంటే సొంత డబ్బును ప్రజల కోసం వినియోగించేవారు. అయితే రానురాను ఆ పరిస్థితి మారింది. ఏపీ సీఎం జగన్ భాషలో చెప్పాలంటే రివర్సైంది. దాంతో రాజకీయమే కాదు.. రాజకీయ నాయకులూ మారిపోయారు. దీంతో ఈ నయా రాజకీయ నాయకులు సొంత సొమ్మును తమ ఇళ్లలోని ఇనపెట్టిల్లో, లేకుంటే బ్యాంకు లాకర్లలో.. అదీ కాకుంటే తమ బ్యాంకు ఖాతాల్లో భద్రంగా దాచుకోని.. ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్న నగదును వివిధ పథకాల రూపంలో అదే ప్రజల కోసం వినియోగిస్తూ.. తమ జేబులో నుంచి కోట్లకు కోట్ల రూపాయిలు తీసి..చెల్లిస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. అయితే టీటీడీ చైర్మన్ కం తిరుపతి ఎమ్మెల్యే అయిన భూమన కరుణాకరరెడ్డి మాత్రం ఒక అడుగు ముందుకు వేసి దేవుడికి ముడుపులు రూపంలో భక్తులు చెల్లిస్తున్న నగదును ప్రజావసరాల పేరుతో సొంత లాభం కోసం వినియోగించేందుకు వీలుగా నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు ఆ నిర్ణయమే తీవ్ర వివాదాస్పదంగా మారింది. విషయమేమిటంటే..
తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్,తిరుపతి ఎమ్మెల్యే, వైసీపీ నాయకుడు నాయకుడు భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షన తాజాగా జరిగిన టీటీడీ పాలక మండలి సమావేశంలో టీటీడీకి వార్షిక బడ్జెట్ నిధుల్లో ఒక శాతాన్ని తిరుపతి అభివృద్ధి కోసం వినియోగించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
శ్రీవారు కొలువు తీరిన తిరుమల కొండపై ఇప్పటికే ఆచార వ్యవహారాలు కొండెక్కాయని ఇప్పుడు దేవుడి నిధులను కూడా పక్కదారి పట్టించేయడానికి నిర్ణయం తీసుకున్నారని ఈ నిర్ణయంపై పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికలలో తన కుమారుడు భూమన అభినయ్ రెడ్డికి టికెట్ ఇచ్చి గెలుపించుకొనేందుకే భూమన కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ హోదాలు తిరుపతి అభివృద్ధికి టీటీడీ బడ్జెట్ నుంచి నిధులు కేటాయించాలని నిర్ణయించారని అంటున్నారు. అయినా టీటీడీ వార్షిక బడ్జెట్ వందల, వేల కోట్ల రూపాయిల్లో ఉంటుందని.. అందులో ఒక శాతం అంటే.. దేవుడి సొమ్ము కోట్లాది రూపాయిలు కైంకర్యం చేసేందుకు భూమన స్కెచ్ వేశారని అంటున్నారు.
అయినా దేశంలో ఎక్కడా కూడా దేవాలయాలపై వచ్చే సొమ్మును ఇతర అవసరాల కోసం ఖర్చు చేయడం లేదని గుర్తు చేస్తున్నారు. అదీకాక జగన్ ప్రభుత్వ ఖజానాలో నిధులు నిండుకొన్నాయని.. దీంతో రాష్ట్రంలోని ఏ పట్టణం, ఏ నగరం అభివృద్ధికి నోచుకోలేదని.. దీంతో దేవుడి నిధులు తిరుపతి అభివృద్ధికి మళ్లీస్తే.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో నగరాన్ని అభివృద్ధి చేశానంటూ.. ప్రజలకు చెప్పుకుని, మా అబ్బాయిని గెలిపిస్తే ఇంకా ఎక్కువ అభివృద్ధి చేస్తామని చెప్పుకుని ఓట్లు దండుకునేందుకే గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుమల శ్రీవారి సొమ్మును తిరుపతి అభివృద్ధి కోసం మళ్లించే నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అయినా గతంలో తాను నాస్తికుడినని బాహాటంగా చెప్పి.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని నల్లరాయి అన్న భూమన కరుణాకర్ రెడ్డికి టీటీడీ బోర్డ్ చైర్మన్ గా నియమించిన నాడే.. జగన్ పై విరమ్శలు వెల్లువెత్తాయి.
వినాశకాలే విపరీత బుద్ధీ అంటూ నాడే నెటిజన్లు ఓ రేంజ్ లో జగన్ పై విమర్శలు గుప్పించారు. పద్దతికే అసలు సిసలు బ్రాండ్ అంబాసిడర్‌లాగా నిలువు బొట్టు పెట్టి.. తనకు మాత్రమే సాధ్యమైన అభినయంతో మాట్లాడుతూ.. తాను గతంలో అన్న మాటలు జనం మరిచిపోయారన్న భ్రమలో పరమ భక్తుడిలాగా బిల్డప్ ఇచ్చుకునే భూమన కరుణాకర్ రెడ్డి ఇప్పుడు టీటీడీ బడ్జెట్ నుంచి తిరుపతి అభివృద్ధికి నిధుల మళ్లింపు నిర్ణయంతో తన నిజస్వరూపాన్ని బయటపెట్టుకున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇప్పటికే తిరుమల తిరుపతి దేవస్థానం.. ఓ ధార్మిక కేంద్రం అన్న సంగతిని ఈ ప్రభుత్వం ఎప్పుడో మరిచిపోయిందని.. ఇది ఓ రాజకీయ పునరావాస కేంద్రంగా మారిపోయిందని.. అదీకాక టీటీడీని జగన్ సర్కార్ కామధేనువుగా భావించి ఇష్టారీతిన పద్ధతులు పాటించకుండా దోపిడీయే లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు అన్ని వర్గాల నుంచీ వస్తున్నాయి. ఇందుకు తార్కానంగా ప్రభుత్వం ఇటీవల నియమించిన టీటీడీ బోర్డు సభ్యులను ఉదహరిస్తున్నారు. అయినా కరుణాకర్ రెడ్డి తన కుమారుడి విజయం కోసం దేవుడు సొమ్మును ఇలా వాడుకొవడం చూస్తుంటే.. ఆయన ఓ రాజకీయ ఘనపాటి అని వారు సెటైరికల్‌గా అభివర్ణిస్తున్నారు.
అదీకాక ఇప్పటికే టీటీడీ అంశంలో జగన్ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై భక్తులు, విపక్షాలు మండిపడుతుండగా.. తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.