Leading News Portal in Telugu

పనిమనిషిపై లైంగిక దాడి.. ప్రైవేట్ స్కూల్ మాజీ చైర్మన్ పై కేసు | rape on servent| case| regestered on| city| school


posted on Oct 20, 2023 2:24PM

మహిళలపై అత్యాచారాల నిరోధానికి ఎన్ని చట్టాలు తీసుకువచ్చినా ఫలితం ఉండటం లేదు. నిర్భయ ఘటన తరువాత అత్యాచార  నిందితులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా  చట్టాన్ని సవరించినా ఫలితం లేకపోయింది. అన్నిటికీ మించి బాధితులపై ఒత్తిడి తీసుకువచ్చి, బెదరించి ఫిర్యాదే లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఒక వేళ బాధితురాలు ధైర్యం చేసి ఫిర్యాదు చేయడానికి ముందుకు వచ్చినా రాజీ చేసుకోవడం మంచిదంటూ ఠాణాలోనే రాజీయత్నాలు జరుగుతున్న సంఘటనలు సమాజంలో మహిళల  భద్రత  ప్రశ్నార్థకం  చేస్తున్నాయి.

తాజాగా విశ్వనగరం హైదరాబాద్ లో ఓ మహిళపై జరిగిన లైంగిక దాడి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. లైంగిక దాడికి ముందు, తరువాత కూడా ఆమెను బెదరించి ఫిర్యాదు చేయకుండా నిలువరించడానికి జరిగిన  ప్రయత్నాలూ వెలుగులోకి వచ్చాయి. విషయంలోకి వస్తే.. హైదరాబాద్  బంజారాహిల్స్ మిథిలానగర్ లో నివాసం ఉండే మురళి ముకుంద్ ఇంట్లో  ఓ ఏగ్రేడ్ ఏజెన్సీ ద్వారా పనిమనిషిగా చేరింది.  ఈ ఏడాది  జూన్ 18న ఆమె మురళి ముకుంద్ నివాసంలో పని మనిషిగా చేరింది. చేరిన నెల రోజుల నుంచే ఆమెకు వేధింపులు ఎదురయ్యాయి. పలు మార్లు ఈ విషయమై ఆమె అభ్యంతరం వ్యక్తం చేసినా ఫలితం లేకపోయింది. తాను పని చేస్తున్న ఇంటి యజమాని మురళి ముకుంద్ మామూలు వ్యక్తి  కాదు. జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ చైర్మన్. మురళి ముకుంద్ తో పాటు ఆయన కుమారుడు ఆకాష్ కూడా ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తూ వేధించే వారు. ఆ క్రమంలోనూ  జూలై 16 మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మురళి ముకుంద్ ఆమెను తన బెడ్ రూంలో బెడ్ షీట్ మార్చాలని ఆదేశించాడు. దీంతో ఆమె బెడ్ రూంలోకి వెళ్లగానే ఆమె ప్రతిఘటించేలోగానే రూం తలుపులు మూసేసి స్నానం చేయాల్సిందిగా ఒత్తిడి చేశారు. తిరస్కరిస్తే బెదరింపులకు దిగాడు. ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించడంతో ఆమె బాత్ రూంలోకి వెళ్లి స్నానం చేసింది.

బాత్ రూంలో ఆమె స్నానం చేస్తుండగా తీసిన ఫొటోలు, వీడియోలూ చూపి బెదరించి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ  విషయాన్ని ఎవరికైనా చెబితే ఆమెను, ఆమె తల్లినీ చంపేస్తానని బెదరించాడు. ఆ తరువాత కూడా పలు మార్లు అత్యాచారానికి  పాల్పడటంతో భరించలేక విషయాన్ని  ఆ యువతి మురళీముకుంద్ కుమారుడు ఆకాష్ కు చెప్పింది.

అయితే  ఆకాష్ బాధితురాలిని తీవ్రంగా కొట్టి విషయం బయటపెడితే చంపేస్తానని  బెదరించాడు. అంతే కాకుండా తమ ఇంట్లో సిమ్ కార్డ్ చోరీ చేసిందంటూ ఎదురు కేసు పెట్టారు. తనను తీవ్రంగా  కొట్టారంటూ ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేస్తే రాజీచేసుకోమని వారు ఆమెనే మందలించారు. దీంతో దిక్కుతోచక ఆమె మౌనంగా ఉండిపోయింది. ఆ సమయంలో తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని ఆమె పోలీసులకు చెప్పలేకపోయింది. చెబితే తననూ తన తల్లినీ చంపేస్తామని మురళి ముకుంద్, అతని కుమారుడు ఆకాష్ బెదరించడంతో మౌనంగా ఉండిపోయింది.

తర్వాత కూడా అత్యాచార పర్వం కొనసాగిస్తుండటంతో ఆమె విషయాన్ని తల్లికి  చెప్పి ఆమెతో కలిసి ఈ  నెల 18న బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలిని  భరోసా కేంద్రానికి తరలించిన పోలీసులు నిందితులు మురళీముకుంద్, అతని కుమారుడు ఆకాష్ పై కేసు నమోదు చేశారు.